మరణాన్ని నేను ధిక్కరిస్తున్నాను



 మరణించాలని ఎవ్వరికి ఉంటుంది?జీవి ప్రాథమిక సహజాతం (instinct) ప్రాణాన్ని కాపాడుకోవడం. దానికోసమే 
పోరాటమైనా, పారిపోవడమైనా. దానికోసమే రాజీలైనా, రాజకీయాలైనా.నువ్వైనా,లనేనైనా, ఎవ్వరైనా ఇంతే. ఇదే తాపత్రయం.

   బ్రతకాలని ఎవరికి ఉండదు? నేనేం దానికి అతీతుణ్ణి కాదు.పిల్లల్ని ఓదారుస్తూ,ఉత్సాహపరుస్తూ ఉండాలని, వాళ్ల కళ్ళలో మెరుపుల్ని చూస్తూనే ఉండాలని, భాగస్వామితో గిల్లికజ్జాలు కొనసాగిస్తూనే ఉండాలని, అయిన వాళ్లకు మాటసాయమైనా చేస్తూనే ఉండాలని, ప్రపంచాన్ని మొత్తం కలియతిరగాలని, కలల్ని పండించుకోవాలని., శోదించాలని, సాధించాలని....ఇలా నాకు కోర్కెలు ఎక్కువే. నవరసాలకు న్యాయం చెయ్యాలని., ఎవరికీ అన్యాయం చేయకపోతే చాలని నాకు తెలుసు.

  అయితే నాకింకా బాగా తెలిసిందేమంటే ....సత్యాన్ని అంగీకరించాల్సిందేనని,మన కోర్కెలు, ఆశలు, బాధ్యతలు, పగలు, ప్రతీకారాలు...ఇంకా ఇలాంటి వన్ని 'ప్రకృతి దృష్టి'ని దాటిపోలేవని.మన కష్ట నష్టాలతో 'అంతిమ తీర్పు' కు పనిలేదని.మరి ఇంతగా తెలిసినప్పుడు మరణంతో నేనెందుకు సరిగ్గా వ్యవహరించకూడదు? బ్రతిమాలాడుతూ, గింజుకుంటూ,వేడుకుంటూ, కాళ్ళ వేళ్ళా పడుతూ దానికి నేనెందుకు తలవంచాలి?

     అందుకే మరణాన్ని నేను ధిక్కరించాలనుకుంటున్నాను.
అంటే 'చావు భయం ' మీద తిరగబడాలనుకుంటున్నాను. రేపో, మాపో తప్పనిసరిగా వచ్చే ఆ అతిధిని చూసి నేను భయంతో చస్తూ బ్రతకాలనుకోడం లేదు. ఆలస్యంగా అయినా నాకు అనిపిస్తోందేమిటంటే...విషయాన్ని అంచనా వెయ్యడంలో మనం తప్పు దారి పట్టామని. సినిమాలు, సీరియళ్లు,
స్నేహితులు, సంస్కృతి, తప్పని సరి మరణాన్ని గూర్చి, తప్పనిసరిగా ఏడుస్తూ చావాలని మనకు తప్పుగా నూరి, నూరి పోసాయి.'ఇంకో రకంగా ఆలోచించగలమా'? అనే అనుమానం మొలకెత్తకుండా  చేశాయి.

   ఉజ్జాయింపు లెక్కల ప్రకారం మనిషి పరిణామం చెంది 8 లక్షల సంవత్సరాలయింది. జీవం పుట్టి 400కోట్ల సంవత్సరాలు. భూమి మొదలయింది 450కోట్ల సంవత్సరాల ముందర. బిగ్ బ్యాంగ్ జరిగి 13.6 బిలియన్ సంవత్సరాలయిందని అంచనా. అంతకు ముందు ఏముందో, ఎన్నాళ్లనుంచి ఉందో, దానికి ముందు ఏముండేదో, ఇంకా దానికి ముందు, ముందు ఏమి ఉండేదో, ఎన్నాళ్ళ నుంచి ఉండేదో...ఎప్పటికీ అంతు చిక్కదనే అనిపిస్తోంది. మన తర్వాత ఈ భూమి, ఈ పాలపుంత, ఇంకా మిగిలిన అంతులేని పాలపుంతలు 
ఎన్నాళ్లుంటాయో??!!.ఆ తర్వాత, ఆ తరువాత,ఆ తర్వాతర్వాత...ఏమవుతాయో ఊహకు కూడా ఎప్పటికీ అందదనే అనిపిస్తోంది. ఆది, మధ్యాంత రహితమైన పదార్థము(mass), శక్తి (energy), శూన్యము (space),కాలా(time) ల్లోకి  ఎవరైనా, ఏ క్షణమైనా లీనమవ్వాల్సిందే.దీనికోసం గుండెలు బాదుకొని తీరాల్సిన అవసరం ఏముంది?బిడ్డలైనా,  భాగస్వాములైనా,తల్లి తండ్రులైనా, స్నేహితులైనా, శత్రువులైన, ఎవ్వరికైనా ఇది తప్పదని తెలిసినప్పుడు రాబోయే సవాల్ కు మనమెందుకు సిద్దపడ కూడదు. **మనవారిని ఎందుకు సిద్దపరచకూడదు.?*ఊహించరానిదేదైనా జరిగితే మిగిలినవారు, గతించినవారు గర్వపడేలా ఓ ఉదాహరణ ఎందుకు కాకూడదు.?*

 అవును. మనం సరిగ్గా ఆలోచించాలి. మరణం తప్పదు. పునర్జన్మ లేదు. బ్రతికినన్నాళ్ళు ఈ స్వల్పమైన కాలాన్ని సద్వినియోగం చెయ్యాలి.

     మరణాన్ని తలచుకొని మనం భయపడుతున్నాము.వీలయినంత వాయిదా వెయ్యాలనుకుంటు న్నాము.ఎందుకంటే ఇంకా మనం చూడాల్సింది, చూరగొనాల్సింది,చెయ్యాల్సింది చాలా ఉంది. బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయి. మనిషి ఆయుష్షు నూరేళ్ళు కాబట్టి నిదానంగా చేసుకోవచ్చులే అనుకుంటున్నాము. ఈరోజు 'చావు' దగ్గరికి వచ్చి 'రా, పోదాం ' అంటే గుండె గుభేలు మనడం అత్యంత సహజం. పుట్టినవాడు గిట్టక తప్పదని గీత లో చెప్పే ఉన్నారు. దానిలో మనకే అనుమానం లేకపోయినా గిట్టినవాడు మళ్లీ పుడతాడంటే మాత్రం మనకు అనుమానమే. ఇక మనం చేసిన పనులకు నరకానికి కాదు, స్వర్గానికే పంపిస్తామన్నా మన ఇంగితజ్ఞానం అందుకు అంగీకరించదు.

      అర్థమవుతోంది కదా? మనమంతా పంచవర్షప్రణాళికలా, శత వర్ష ప్రణాళికలో ఉన్నాం. మన లక్ష్యాలు చేరుకోవడానికి, కోర్కెలు తీర్చుకోవడానికి ఇంకా చాలా సమయముంది అనుకుంటున్నాం. ఏ విపత్తు రాకపోతే, ఏ ఆపద సంభవించకపోతే 'జీవిత నౌక ' సాఫీగా మజిలీ చేరుకుంటుంది అని అనుకుంటున్నాం. అయితే వాస్తవం వేరుగా, కఠినంగా పెద్దలు చెప్పినట్లు 'చేదు'గానే ఉన్నట్లుంది.

      ఏ అనుకోని ఉత్పాతాలు సంభవించకపోయినా మనిషి ఆయుర్దాయం అంత లేదు. ప్రపంచంలో మంచి మంచి ప్రమాణాలున్న దేశాల్లోనే అది 80-85 ల మధ్య ఆగిపోయింది. మన దేశంలో ప్రస్తుత లెక్కల ప్రకారం అది 70కి కాస్త అటు,ఇటుగా ఉంది. నిరంతరం ఆందోళన, ఒత్తిడితో పనిచేసే వారికి, అనారోగ్యాలతో ఉన్నవాళ్లకు, పేదలకు,డబ్బులున్న వాళ్ళల్లో జబ్బులు 'కొని' తెచ్చుకున్న వాళ్లకు అది మరింత తక్కువ.

         ఇవన్నీ కాకుండా అనుకోకుండా జరిగే ఆక్సిడెంట్లు, సంకేతం ఇవ్వకుండా వచ్చే గుండెపోట్లు, తలపోట్లలాంటివి ఉండనే ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.... అత్యవసరమైనవి, అతిముఖ్యమైనవి వెంటనే చేసెయ్యండి. చూడాల్సినవి, తినాల్సినవి, వినాల్సినవి, ఆఘ్రాణించవలసినవి,అనుభవించాల్సినవి...చెయ్యడానికి ' మిథునం, కర్కాటకం ' లెక్కపెట్టొద్దు. బాధ్యతలు పూరించడానికి 'మీన, మేషా'లొద్దు. సహాయం చెయ్యడానికి వేషాలొద్దు.

      కరోనాలు, గ్యాస్ లీకులు, ఆక్సిడెంట్లు, సునామీలు, తన్నుకోవడాలు, నరుక్కోవడాలు, రోషాలు యుధ్ధాలు..ఇంకా ఉన్మాదాలతో చంపండి, పొడవండి అని ఊగిపోయే ప్రాణం విలువ తెలియని వెధవలు మన ప్రమేయం లేకుండానే మనల్ని ఎప్పుడైనా లాగేసుకోవచ్చు.

    ఇలా సర్వకాల, సర్వావ్వస్థల్లో నిర్దాక్షిణ్యంగా, నికరంగా వర్తించి, నర్తించి, ప్రవర్తించే 'సృష్టి, స్థితి, లయ'లకు మనం వెరవాల్సిన అవసరం లేదని నాకనిపిస్తోంది. అందుకే నాకు మరణాన్ని ధిక్కరించాలని పిస్తోంది. ఆడుతూ, పాడుతూ, బ్రతుకుతూ, బ్రతకనిస్తూ, జీవిస్తూ, జీవించనిస్తూ...సందర్భం వచ్చినప్పుడు మరణాన్ని ప్రాధేయపడకుండా పోరాడుతూనే నేను దాన్ని కౌగలించుకో వాలనుకుంటున్నాను.చూడాలి. ఏం జరుగుతుందో??!!

*Dr.C.Obula Reddy*
*9490770599*
*Kadapa*

(06th,August,2020)

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు