గ్రంథాలయాల గురించి లెనిన్ ఏం రాశాడు, ఏం చెప్పాడు









లెనిన్ చాలా కాలాన్ని గ్రంథాలయాల్లో గడిపాడు. సమారలో ఉంటున్నప్పుడు స్థానిక గ్రంథాలయం నుండి అనేక పుస్తకాలు ఎరువు తెచ్చుకుంటూండేవాడు. తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ లోని పబ్లిక్ గ్రంథాలయంలో రోజుల కొద్దీ గడిపేవాడు. ఫ్రీ ఎకనామిక్ సొసైటీ వారి గ్రంథాలయం నుండీ యింకా అనేక ఇతర సంస్థల నుండీ పుస్తకాలను ఎరవు తెచ్చుకొనేవాడు. జైల్లో వున్నప్పుడు కూడా అతని సోదరి అతనికి గ్రంథాలయాల నుండి పుస్తకాలు తీసుకువెళ్లి ఇస్తుండేది. ఈ పుస్తకాల నుండి అతను విస్తారంగా నోట్సు రాసుకునేవాడు.

లెనిన్ "రచనలు" (రెండవ కూర్పు) మూడో సంపుటిలో ఒక నోటు వుంది. “రష్యాలో పెట్టుడిదారీ విధానం అభివృద్ధి" రచనలో అతడు ఎంతలేదన్నా 583 పుస్తకాలని సంప్రతించినట్టు ఆ నోటులో వుంది. ఈ పుస్తకాల పేర్లు కూడా "రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి"లో పేర్కొన్నాడు. ఈ పుస్తకాలన్నిటినీ లెనిన్ ఎన్నడైనా కొనగలిగి వుండేవాడా? వాట్లలో చాలా
పుస్తకాలు అమ్మకానికి దొరకనివి కూడా. ఉదాహరణకు అతనికి ముఖ్యంగా విలువైనట్టి జేమ్ స్త్వా గణాంకశాస్త్ర లెక్కల సంగ్రహాలు. 

పైగా ఆ రోజుల్లో అతడు ఒక విద్యార్థివలె మిద్దె మీది డాబా గదిలో నివసిస్తూ ప్రతి దమ్మిడీనీ లెక్క పెట్టుకుంటూ బహుపొదుపుగా జీవితాన్ని గడిపేవాడు. ఆ పుస్తకాలు కొనడానికి వెయ్యి రూబుళైనా అవసరమయ్యేవి. అంత డబ్బు అతని అందుబాటులో వుండడం అసంభవం. పైగా పుస్తకాల షాపుల్లో ఆ పుస్తకాలని వెదకటానికి అతనికి వ్యవధి కూడా ఉండేది కాదు. అలా వెదికి వున్నట్టయితే అతని అమూల్యమైన గ్రంథపఠన కాలం వృధా అయిపోయేది. 

ఏమైతేనేం గ్రంథాలయాలలో పుస్తకాల కేటలాగులే లేకపోతే అలాంటి గ్రంథాలు వున్నాయని అతనికి తెలిసి ఉండేది కాదు. చివరికి, పోనీ సొంత గ్రంథాలయాలు ఏర్పరచుకుందామంటే అతని చిన్న గదిలో స్థలమే లేదు. ఆ గ్రంథాలని చదవడంవల్ల అతడు "రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి" వంటి మౌలిక గ్రంథాన్ని రాసే అవకాశమే కాకుండా,పారిశ్రామిక కార్మికుల, రైతుల జీవితాన్ని, శ్రమనూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఇదే గనక లేకపోతే యీనాడు మనకు తెలిసిన లెనిన్ వెలికి వచ్చి వుండేవాడు కాదు. "రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి" 1899లో వెలువడింది.

ఇల్వీచ్ విదేశాలలో వున్నప్పుడు పబ్లిక్ గ్రంథాలయాలను మరీ విరివిగా ఉపయోగించుకున్నాడు. అతనికి విదేశభాషలు వచ్చు.ఆ భాషల్లో అనేక పుస్తకాలు చదివాడు.
అతడు ఈ పుస్తకాలను ఎన్నడూ కొనగలిగేవాడు కాదు. ఎందువల్లనంటే విదేశప్రవాస జీవితాన్ని గడుపుతున్నాడేమో ప్రతి దమ్మిడీ కూడా అతనికి అమూల్యమైనదే - ట్రాం ఖర్చులకోసం, భోజనం మొదలైన వాటికోసం అతడు డబ్బును మిగుల్చుకోవాలి. ఐనా అతడు తప్పక చదివి తీరాలి - పుస్తకాలు లేకుండా, విదేశ వార్తాపత్రికలు, మాస త్రైమాస పత్రికలను చదవకుండా ఇల్విచ్ తన పనిని కొనసాగించి వుండేవాడు కాదు. అతనిలో అపారంగా ఉన్న విజ్ఞానాన్ని అతడు సముపార్జించుకొని వుండేవాడు కాదు.

"బంధువులకు లేఖలు" అనే గ్రంథాన్ని ఒక సారి చదివితే చాలు, అతడు గ్రంథాలయాలు ఎటువంటి ప్రాముఖ్యత ఒసగినదీ మనకొక అభిప్రాయం ఏర్పడుతుంది.

అతడు 1895లో తొలిసారిగా విదేశాలకు వెళ్లాడు. బెర్లిన్ లో కొద్ది వారాలు వున్నాడు.అనేక కొత్త భావాలను గడించుకున్నాడు. కార్మికవర్గపు జీవితాన్ని గమనిస్తూ ఇంపీరియల్ గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకుంటూ చాలా సమయం గడిపాడు. ఆ తర్వాత అదే సంవత్సరంలో సెయింట్ పీటర్స్ బర్గ్ జైల్లో మూడు వారాలు వున్న తర్వాత గ్రంథాలయం నుండి పుస్తకాలు తెప్పించుకొనే ఏర్పాటుచేసుకున్నాడు. జైలు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా బయట నుండి కూడా పుస్తకాలు తెప్పించుకున్నాడు. అరెస్టయిన మూడు వారాల తర్వాత జైల్లో నుండి యిలా రాశాడు : -

"...ఖైదీలు చదువుకోవచ్చును : నేను యీ విషయాన్ని ప్రాసిక్యూటర్ ను ఉద్దేశ పూర్వకంగానే అడిగాను, నాకు యీ విషయం అంతకుముందే తెలిసినప్పటికీ కూడానూ (శిక్ష విధించబడిన వారికి కూడా యీ హక్కు వుంది.) లోపలికి పంపే పుస్తకాలకు ఏ సంఖ్యా పరిమితీ లేదని అతడు ధృవపరిచాడు. ఇంకా ఏమిటంటే, పుస్తకాలను తిరిగి వాపసు పంపవచ్చు కాబట్టి వాటిని గ్రంథాలయాల నుంచి ఎరువు తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో యిక్కడ పరిస్థితులు చెడుగా లేవు."

"పుస్తకాలని సంపాదించడమనేదే ఒక పెద్ద ఆటంకం. చాలా పుస్తకాలు కావలసి ఉన్నాయి. ఇప్పుడు నాకు కావలసిన వాటి పట్టికను దీంతోపాటు పంపుతున్నాను. వాటిని సేకరించడానికి కొంత ప్రయత్నం చేయవలసి వుంటుంది. అవన్నీ దొరుకుతాయో దొరకవో నాకు నమ్మకం లేదు. ఫ్రీ ఎకనామిక్ సొసైటీ గ్రంధాలయం పై ఆధారపడవచ్చు.( నేను ఇది వరకే ఆ గ్రంధాలయం నుండి పుస్తకాలు తీసుకున్నాను. అక్కడ 16 రూబుళ్లు ధరావతు కూడా కట్టాను) ఫీజు కట్టి ఈ గ్రంథాలయం నుండి ప్రధానమైన పుస్తకాలు రెండు నెలలకు తీసుకోవచ్చు. కాని అక్కడి గ్రంథ సంచయం ఏమీ బాగా లేదు. విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ సైన్స్ కమిటీ గ్రంథాలయాన్ని ఎవరైనా ఒక రచయిత ద్వారా గాని, ప్రొఫెసర్ ద్వారాగాని నువ్వు ఉపయోగించుకో గలిగినట్టయితే పుస్తకాలను సంపాదించే సమస్య పరిష్కారమవుతుంది."

"అన్నిటికంటే అతికష్టమైన చిట్టచివరి విషయం ఏమిటంటే - పుస్తకాలను నావరకు తీసుకు రావడం ఏదో కేవలం రెండు పుస్తకాలు తీసుకూవడం కాదు : దఫదఫాలుగా చాలా కాలం వరకూ ఆ పుస్తకాలని గ్రంథాలయం మండి సేకరించడం, వాటిని ఇక్కడికి తీసుకు రావడమూ, ఒకేసారి చాలా పుస్తకాలు గనుక తీసుకురాగలిగే పక్షంలో (పక్షానికొకసారి లేదా నెలకొకసారి తీసుకువస్తే సరిపోతుందనుకుంటాను) నేను చదివేసిన వాటిని తిరిగ తీసుకెళ్లడమూ అవసరమౌతుంది. ఈ ఏర్పాటు చేయడానికి నీకు ఏవిధంగా వీలవుతుందో నాకు తెలియదు. పోనీ ఈకింది విధంగా చేస్తే బాగుంటుందేమో :ఈ పని కోసం గుమ్మ వద్ద కాపలావుండే మనిషినో, వార్తాహరుడ్నో లేదా ఒక కుర్రాడ్నో చూడు. అతనికి నేను డబ్బు యిస్తాను. పని పరిస్థితుల దృష్ట్యా, గ్రంథాలయం వారు పుస్తకాలను ఎరవు యిచ్చే నియమాల దృష్ట్వా పుస్తకాలను ఎరపు తెచ్చి తిరిగి వాపసు పంపడమనేది సరైనట్టి ఖచ్చితమైన పద్ధతిపై సహజంగా జరగవలసి ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ జరగాలి."

"చేయడం కన్నా చెప్పడం తేలిక.. ఈ పనిని చేయడం చాలా కష్టమని నా 'పథకం' వట్టి భ్రమ అనీ నాకు గట్టిగా తోస్తుంది"

గ్రంధాలయం నుండి పుస్తకాలు తెచ్చి వాటిని జైల్లో వున్న తమ్ముడి అందజేసే బాధ్యత తనపై వేసుకుని అన్న 

ప్రవాస స్థలానికి వెళ్లే మార్గ మధ్యంలో, 1897 మార్చి 4వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీవరకు క్రస్నోయార్ స్క్ లో గడిపాడు. ఇల్వీచ్. యూదిన్ అనే వ్యక్తి యొక్క సొంత గ్రంథాలయాన్ని ఉపయోగించుకుందుకు ఆ సమయాన్ని అతడు వినియోగించుకున్నాడు. మార్చి 10 వ తేదీన క్రస్నోయారస్కే నుండి అతడు ఇలా రాశాడు :

"...నిన్న సాయంత్రమంతా స్థానికంగా పేరుపొందిన యూదిన్ గ్రంథాలయంలో గడిపాను. ఆ గ్రంధాలయం సొంతదారుడు స్నేహపూర్వకంగా నన్ను ఆహ్వానించి తాను సేకరించిన గ్రంథాలన్నిటినీ నాకు చూపించాడు. అతని గ్రంథాలయాన్ని ఉపయోగించుకొనేందుకు నాకు అనుమతినిచ్చాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలననే భావిస్తున్నాను. (రెండు ఆటంకాలు వున్నాయి : మొదటిది, యీ గ్రంథాలయం బస్తీ వెలుపల సుమారు ఒక మైలున్నర దూరంలో వుంది. చక్కని షికారు. రెండోది, యీ గ్రంథాలయంలో పుస్తకాలని యింకా సరిగ్గా ఏర్పాటు చేయలేదు. ఫలానా ఫలానా సంపుటాలు కావాలని అడిగి యీ సొంతదారుని అమితంగా ప్రయాసపెడతానేమోనని భయపడుతున్నాను. ) పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో చూద్దాం. రెండో ఆటంకాన్ని తొలగించవచ్చుననుకుంటాను గ్రంథాలయాన్ని నేనింకా క్షణ్ణంగా చూడ్లేదు. కాని నేను చూసినంతవరకు మాత్రం యిది అద్భుతమైన గ్రంథాలను సేకరించిందనే చెప్పాలి. ఉదాహరణకి యీ గ్రంథాలయంలో మాసపత్రికల (ముఖ్యమైనవి) ఫైళ్లు పద్దెనిమిదవ శతాబ్దం అంత్యంనుండి యీ నాటివరకూ వున్నాయి. వాటిల్లో నా పనికి అవసరమైన మూలాధార వస్తుసామగ్రి లభిస్తుందని ఆశిస్తున్నాను...."

ఐదు రోజుల తర్వాత మార్చి 15వ తేదీన మరో ఉత్తరంలో యిలా రాశాడు -

"....ప్రతి రోజూ నేను గ్రంథాలయానికి వెళ్తున్నాను. ఇది బస్తీ వెలుపల మైలున్నర దూరంలో వుందేమో రానుపోను మూడు మైళ్ల నడక - అంటే సుమారు ఒక గంట నడకన్నమాట. ఈ నడక కాస్త నిద్రమత్తును కలుగ చేసినప్పటికీ కూడా నాకు యిష్టంగానే ఉంది. నేను షికారుని ఆనందిస్తున్నాను. నా పనికి పనికి వచ్చే పుస్తకాలు, యీ గ్రంథాలయంలో నేను దీని సైజును బట్టి అనుకున్న వాటికంటే, చాలా తక్కువే వున్నాను. ఐనా ఉపయుక్తమైన పుస్తకాలు కూడా వున్నాయి. ఈ స్థలంలో నేను కాలం వృధా చేయకుండా ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నేను మునిసిపల్ గ్రంథాలయానికి కూడా వెళ్లాను. అక్కడ వార్తా పత్రికలనూ మాసపత్రికలనూ చదువుతున్నా నన్నమాటే గానీ అవి పదకొండు రోజులక్రితపు వార్తలను మాత్రమే అందివ్వగలుగుతున్నాయి. ఈ పాత బడిపోయిన 'వార్తలు చదవడానికి అలవాటు పడడమంటే నాకు చాలా కష్టంగా వుంది."

ఉత్తరాలుగానే వార్తాపత్రికలుగానీ పదమూడో రోజుకుగాని అందనటువంటి తన ప్రవాస స్తల మైన షూషన్ స్కొయె గ్రామానికి వచ్చిన తర్వాత ఇల్వీచ్, సైబీరియాలో ఎక్కడో మూలనున్న గ్రామానికి మాస్కోనుండి గ్రంథాలు చెప్పించుకునే ఏర్పాటు చేసుకున్నాడు.

1897 మే 25న మాస్కోలో వున్న తన అక్కకు యీ కింది విధంగా ఒక ఉత్తరం రాసాడు.

"....మాస్కో గ్రంథాలయాలను ఉపయోగించుకునే విషయమై నేను ఆలోచిస్తున్నాను.ఈ విషయం నువ్వేమైనా ఏర్పాటు చేయగలిగావా, అనగా, పబ్లిక్ గ్రంధాలయాలు వేటిలోనైన ప్రవేశపు హక్కును సంపాదించగల్గే మార్గాన్ని కనిపెట్టావా? అసలు విషయం ఏమిటంటే పుస్తకాలు రెండు నెలల కొరకు ఎరవు పుచ్చుకోవడం సాధ్యమైతే (సెయింట్ పీటర్స్బర్గ్ లోని ఫ్రీ ఎకనామిక్ సొసైటీ వారి గ్రంథాలయంలో వలె) పార్సిలు ఖర్చు అంత ఎక్కువ వుండదు. పౌనుబరువైతే 16 కోపెక్కులూ, రిజస్టరీ కొరకు మరో 7 కోపెక్కులూనూ (నువ్వు 64 - ఖర్చు చేస్తే 4 పౌన్లు పంపించవచ్చు). నేను కొద్ది పుస్తకాలు కొనేందుకు పెద్ద మొత్తం ఖర్చు పెట్టేకంటే పోస్టేజీమీద డబ్బును ఖర్చు పెట్టడమే నయమేమో ననిపిస్తుంది. ఇదే నాకు బాగా అనుకూలమైందని అనుకుంటాను. కాని ఉన్న ప్రశ్న ఒక్కటే. అదేమిటంటే ఏ మంచి గ్రంథాలయాలనుండైనా - అంటే విశ్వవిద్యాలయ గ్రంథాలయంనుండో (మీత్య యీ విషయాన్ని బహు తేలికగా ఏ న్యాయశాస్త్రశాఖా విద్యార్థి ద్వారానో లేదా సూటిగా రాజకీయ ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్ వద్దకు వెళ్లి తాను ఆ పాఠ్య విషయం అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు చెప్పి ప్రధానమై గ్రంథాలయం నుండి పుస్తకాలు తీసుకొనే ఏర్పాటు చేయగలడనుకుంటాను.కాని ఇందుకొరకు శరత్తువరకూ వేచి వుండవలసి వస్తుంది), లేదా మాస్కో 'లా సొసైటీ' గ్రంథాలయం నుండో (అక్కడ క్యాటలాగ్ కొరకు దర్యాప్తు చేసి సభ్యత్వ నియమాలూ మొదలైన వాటిని చూడు), అదీ కాకపోతే మరో గ్రంథాలయం నుండో రెండు నెలలకొరకు పుస్తకాలు ఎరవు తెచ్చుకోవడం (థరావతుకట్టే అనుకో) సాధ్యపడుతుందా కాదా అనేదే. బహుశ మాస్కోలో యింకా కొన్ని మంచి గ్రంథాలయాలు ఉన్నాయేమో? పోనీ ప్రైవేటు గ్రంథాలయం గురించి విచారించు. మీలో ఎవరైనా ఇంకా మాస్కోలో వున్నట్టయితే యీ సంగతిని కనుక్కోండి."

"నువ్వు గనక విదేశాలు వెళ్లినట్టయితే నాకు తెలియపరచు. అక్కడ్నుండి పుస్తకాలు తెప్పించుకొనే మార్గాలను విపులంగా రాయగలను. పుస్తకాల అంగళ్లూ, గ్రంథాలయాలు, యింకా అలాంటి వాటి రకరకాల క్యాటలాగ్లనూ నాకు పంపించు. నీ వి.ఉ."

1897 జులై 19వ తేదీన తన తల్లికీ, చెల్లెలు మరియకూ రాసిన ఉత్తరంలో ఇల్యిచ్, తనకు కావలసిన గ్రంథాలనుండి కొన్ని భాగాలను ఉల్లేఖంచి పంపుతానని రాసిన మరియకు సమాధానంగా యిలా రాశాడు: "గ్రంథాలనుంచి ఎత్తిరాసిన భాగాలు నాకు సహాయపడతాయో పడవో నిర్ధారణగా చెప్పలేను. శరత్తుకల్లా మాస్కో తప్పితే సెయింట్ పీటర్స్ బర్గ్ గ్రంథాలయాల్లోని ఏదో ఒక గ్రంథాలయంలో అన్ని ఏర్పాట్లు జరగగలవని ఆశిస్తున్నాను".

తర్వాత 1897 శీతాకాలంలో అతడు తన బంధువులకు ఒక ఉత్తరం రాశాడు.అందుకే వాళ్లు అతని కోసం ఏదో ఏర్పాటు చేసినట్లు అతడు యింకా కొన్ని యితర సౌకర్యాల కొరకు వెతుకుతున్నట్లు సూచన ఉంది.

"ప్రియమైన మరియకు,

"నీవు (14) 2.12 న రాసిన పొస్తుకార్డూ పంపిన రెండు పుస్తకాలూ (సెమేనొస్ రాసినవి) అందాయి. ధన్యవాదాలు. ఒక వారంలోగా లేదా వీలైనంత త్వరలో వాటిని తిరిగి పంపిస్తాను. (బుధవారం (5.1) 24 వ తేదీన మాకు పోస్ట్ బంట్రోతు కనబడుతాడనినేననుకోను.)

"ఈ రెండు సంపుటాల్లోనూ ఆసక్తిజనకమైన విషయాలు ఏమీ లేనట్టు తేలింది.మనకు తెలియని పుస్తకాల కొరకు ఆర్డరు యిస్తే - యిలాంటిదేదో జరుగుతుందని నేను అనుకున్నాను - యిలా జరగడం తప్పదేమో ననుకుంటాను.

"మనం జుల్మానా కట్టవలసిన అవసరం లేదేమో ననుకుంటాను : వాళ్లు మరో నెల పొడిగించవచ్చు.

"నువ్వు రాసిన వాక్యం నాకు అర్థం కాలేదు: 'లా' సొసైటీ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొనేందుకు - కబ్లుకోవ్ ను నేను యీ విషయమైన అడిగాను - తప్పనిసరిగా న్యాయవాది అయివుండాలి. లా సొసైటీ సభ్యులనుండి రెండు సిఫారసులు వుండాలి? అంతేనా?సొసైటీ సభ్యుడై వుండవలసిన అవసరం లేదా? సెయింట్ పీటర్స్ బర్గ్ నుండి సిఫారసును తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను."

"న్యాయవాది కానివాడు సొసైటీలో సభ్యుడుగా చేరవచ్చుననే విషయంలో నాకు యీ షణ్మత్రమైన సందేహమూ లేదు. ప్రేమతో వి.ఉ".

ఏమైతేనేం, షూషేన్ స్కోయోలో గడిపిన ప్రవాసకాలంలో, పోస్టు ఇబ్బందులు మూలంగా గ్రంథాలయాల పుస్తకాలను ఏది ఏ విధంగానూ సంతృప్తికరంగా ఉపయోగించుకోవడం అసంభవమయింది.

1898 సెప్టెంబర్ నెలలో దంతచికిత్సకోసం క్రస్నోయార్ స్కుకు వెళ్లుందుకు ఇల్విచ్ కు అనుమతిని యిచ్చారు. ఈ అవకాశం కలిగినందుకు అతని ఆనందానికి మేరలేకపోయింది.
స్థానిక గ్రంథాలయాన్ని ఉపయోగించుకొనేందుకు అతడు ఇక పథకం వేసుకున్నాడు.

ప్రవాసం నుండి తిరిగి వచ్చాక పొక్సొవ్ లో స్థిరపడ్డాడు. 1900 మార్చి 15 తేదీన తన తల్లికి రాసిన ఉత్తరంలో యిలా రాశాడు: "నేను తరచూ గ్రంథాలయానికి వెళ్తున్నాను".షికారుకు కూడా నడచి వెళ్తున్నాను.

విదేశాలకు ప్రవాసం వెళ్లినప్పుడు అతడు తన కాలాన్ని ఎక్కువగా గ్రంథాలయాల్లో గడపేవాడు. కాని యీ విషయం అతడు తన కుటుంబానికి రాసిన లేఖలలో అస్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

1902 - 1903 లో మేం లండన్లో వున్నప్పుడు ఇల్యీచ్ సగం కాలాన్ని బ్రిటిష్ మ్యూజియంలోనే గడిపాడు. ఆ మ్యూజియంలో ప్రపంచంలోకల్లా అత్యంత భాగ్యవంతమైన గ్రంథాలయం ఉంది. అక్కడ పుస్తకాలు చదువరులకు అందించే విధానం అద్భుతమైనటువంటిది. అతడు తరచూ పబ్లిక్ గ్రంథాలయాల పఠనమందిరాలకు కూడా వెళ్తూండేవాడు. ఆ విషయాన్ని 1902 సెప్టెంబర్ 27వ తేదీన తన తల్లికి రాసిన ఉత్తరాన్ని బట్టి తెలుసుకోవచ్చు.

లండన్లో అనేక పఠనమందిరాలు వున్నాయి - వీధిలోనుండే నేరుగా ఆ గదుల్లోకి వెళ్లవచ్చు. అక్కడ కుర్చీలు కూడా వుండవు. చదువుకోను స్టాండులు ఉన్నాయి. వార్తాపత్రికలు కొక్కేలకు వ్రేలాడుతూ ఉన్నాయి. లోపలకి వెళ్లిన తర్వాత కొక్కెంనుండి పత్రికను తీసుకుంటావు. చదివేసిన తర్వాత మళ్లీ దానిని అక్కడ తగిలించేస్తావు. ఈ పఠనమందిరాలు చాలా సదుపాయంగా ఉన్నాయి. రోజూ అనేకమంది యీ పఠనమందిరాలకు వచ్చిపోతుంటారు.

మా రెండవ విదేశప్రవాస కాలంలో, అనగా తత్వశాస్త్ర ప్రశ్నపై వచ్చిన తగాదాల కాలంలో, ఇల్యీచ్ "భౌతికవాదమూ, ప్రత్యక్షానుభవయుత విమర్శనవాదము" అనే గ్రంథాన్ని రాయడంలో క్షణం తీరికలేకుండా ఉంటున్న రోజుల్లో బ్రిటిష్ మ్యూజియంలో ఇక నెల ప్రత్యేకంగా అధ్యయనం చేసేందుకని 1908 మేలో జెనీవానుండి లండన్‌కు వెళ్లాడు.

మేం 1903లో జెనీవాకు వచ్చాం . అక్కడ పగళ్లన్నీ "పఠన సమాజం " (Societe de Lecture) వారి గ్రంథాలయంలో గడుపుతూండేవాడు. అధ్యయనం కొరకు ఆదర్శవంతమైన పరిస్థితులున్నట్టి  బ్రహ్మాండమైన గ్రంథాలయం యిది - అనేక ఫ్రెంచి, జర్మన్, ఇంగ్లీషు వార్తాపత్రికలకూ, మాసపత్రికలకూ యీ గ్రంథాలయం చందాలుకట్టి తెప్పించుతుంది. ఈ సొసైటీ సభ్యులు - వీరిలో చాలామంది వయోవృద్ధులైన ప్రొఫెసర్లు - గ్రంథాలయానికి అరుదుగా నడవచ్చు. తాను రాసే వ్యాసాలను ఆలోచించుకోవచ్చు. బీరువాలనుండి తనకు యిష్టం వచ్చిన పుస్తకాలు తీసుకోవచ్చు.

ఇక్కడ కూడా అతడు కుక్లీన్ పేరుతో వున్న మంచి రష్యన్ గ్రంథాలయానికి ఆత్రతతో వెళ్తూండేవాడు. ఈ గ్రంథాలయం కామ్రేడ్ కర్పీనిస్కి కింద వుంది. మేం యితర స్విస్ పట్టణాల్లో వుంటున్నప్పుడు ఇల్యీచ్ యీ గ్రంథాలయం నుండి పుస్తకాలు ఎరవుతీసుకుంటూ వుండేవాడు.

పారిస్లో ఉంటున్నప్పుడు ఇల్యీచ్ తరచూ ముఖ్యంగా "నేషనల్ గ్రంథాలయం"Bibliotheque Nationale కు వెళ్తూండేవాడు.

ఈ గ్రంథాలయంలో అతడు సలిపిన కృషిగురించి 1909 డిసెంబరులో నేను అతని తల్లికి యీ కింది వుత్తరం రాశాను : "ఇప్పటికి ఒక వారం పైగా అతడు గ్రంథాలయానికి వెళ్లేందుకని ఉదయం 8గంటలకు లేస్తున్నాడు.అక్కడనుండి మధ్యాహ్నాం 2గంటలకు తిరిగి వస్తున్నాడు.అంత పెందలాడే లేవటానికి అతనికి మొదట కష్టంగా వుండేది.కానీ ఇప్పుడో చాలా సంతృప్తి చెంది రాత్రి పెండలాడే పడుకుంటున్నాడు."

పారిస్ లో వున్న అనేక ఇతర గ్రంథాలయాలకు వెళ్లి చూసాడు.కానీ అతనికి అవి నచ్చలేదు."నేషనల్ గ్రంధాలయం"లో కొత్త కాటలాగులు లేవు.పుస్తకాలను బదులు తీసుకోవడంలో అక్కడ కావలసినంత ' ఎర్రనవారు ' వుంది.' ఎర్ర నవారు ' అనేది సాధారణంగా ఫ్రెంచి గ్రంథాలయాల లక్షణమేనని చెప్పవచ్చు. మున్సిపల్ గ్రంథాలయాల్లో కల్పనారచన గ్రంధాలు ఎక్కువగా ఉన్నాయి.ఎవరైనా పుస్తకాన్ని తీసుకోబోయే ముందు ఈ వ్యక్తి తన యింటి యజమాని నుండి ఒక సర్టిఫికేటును తెచ్చుకోవలసి వుంటుంది. ఆ పుస్తకాన్ని సకాలంలో వాపసు చేసే బాధ్యత యజమానిపై, లేదా యజమానురాలిపై వుంటుంది. మా పేద స్థితిని చూసి మా యింటి యజమాని సర్టిఫికెట్ యివ్వడం ఆలస్యం చేశాడు. దేశంలోని గ్రంథాలయాలు నడిచే విధానాన్ని బట్టి అక్కడి సంస్కృతి స్థాయిని నిర్ణయించాడు ఇల్విచ్. గ్రంథాలయాల స్థితి సాధారణ సంస్కృతీస్థాయిని సూచిస్తుందని ఇల్యీచ్ అభిప్రాయపడ్డారు.

అతదు 1914 ఏప్రిల్ 22వ తేదీన క్రాకర్ నుండి తన చెల్లెలికి విధంగా రాశాడు:

".....నా పనికి, పారిస్ పట్టణం సదుపాయమైంది కాదు. Bibliotheque Nationale ఏర్పాట్లు బాగు లేవు. మేం తరచూ జీనీవాను జ్ఞాపకం చేసుకుంటూ వుంటాం. అక్కడ హాయిగా పని చేసుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ సదుపాయమైన గ్రంథాలయం వుందక్కడ., మేం అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో నివసించాం. నేను సందర్శించిన ప్రదేశాలన్నిటిలోనూ లండన్ లేదా జినీవాను ఎన్నుకొనేవాణ్ణి - అని అంత దూరంలో వుండి పోయినట్లైతే సామాన్య సంస్కృతి, సదుపాయము దృష్ట్యా జనీవా చాలా చక్కని ప్రదేశం. కాని యిక్కడ వాస్తవానికి సంస్కృతికి స్థానమే లేదు - ఇది యించుమించు రష్యాలాగానే వుంది. చాలా హీనంగా వుంది గ్రంథాలయం. అక్కడ అంతులేని ఇబ్బందులు.నేను గ్రంథాలయానికి వెళ్లడం లేదనే చెప్పాలి..."

క్రాకొవ్ నుండి బెర్న్కి తిరిగి వచ్చిన తరువాత ఇల్విచ్ తన చెల్లెలు మరియకు 1914 డిసెంబరు 22వ తేదీన ఒక ఉత్తరం రాశాడు -

-... ఇక్కడ చాలా మంచి గ్రంథాలయాలు వున్నాయి. పుస్తకాలకు సంబంధించినంత వరకు నాకు ఏమీ ఇబ్బంది లేదు. రోజూ వార్తాపత్రిక పనిని చేసి వచ్చిన తర్వాత ఒక పుస్తకాన్ని చదువుతూ వుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నాద్యకు కూడా బోధనాశాస్త్ర సంబంధమైన గ్రంథాలయం ఒకటి అందుబాటులో వుంది. ఆమె విద్యా విధానం పై ఒక పుస్తకం రాస్తోంది..."

1916 ఫిబ్రవరి 20వ తేదీన మరీయకు రాసిన మరో ఉత్తరంలో ఇల్వీచ్ ఇలా రాసాడు."నాకూ, నాద్య కు జ్యూరిచ్ నగరం బాగా నచ్చింది.ఇక్కడ మంచి గ్రంధాలయాలు  వున్నాయి." మూడు వారాల తర్వాత ఫిబ్రవరి 28వ తేదీన ఇల్విచ్ తన తల్లికి ఉత్తరం రాశాడు. "...ఇప్పుడు మేం జ్యూరిచ్ లో నివసిస్తున్నాం. స్థానిక గ్రంథాలయాలలో అధ్యయనం చేయడానికే వచ్చాం. సరస్సు మాకు నచ్చింది. ఇక్కడి గ్రంథాలయాలు బెర్న్ లోని గ్రంథాలయాల కంటే ఉత్తమమైనవి. కాబట్టి మేం మొదట అనుకున్నదానికంటే యింకా ఎక్కువ కాలం యిక్కడ ఉంటాం .”

అక్టోబర్ 9వ తేదీన మరీయకు రాసిన ఉత్తరంలో మళ్లీ యీ గ్రంథాలయంలను గురించి ప్రస్తావించాడు : "జ్యూరిచ్ లోని గ్రంథాలయాలు చాలా మంచివి. ఇక్కడ పనిచేసుకోవడానికి మంచి సదుపాయాలున్నాయి".

స్విస్ గ్రంథాలయాలను చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. వీట్లలోవున్న మంచి ఏమిటంటే యీ గ్రంథాలయాలు పుస్తకాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటూ వుంటాయి.స్విట్జర్లాండ్ లోని జర్మన్ భాష మాట్లాడే ప్రాంతాలలో శాస్త్రీయ గ్రంథాలయాలు జర్మనీలో ఉన్న అలాంటి శాస్త్రీయ గ్రంథాలయాలతో సంబంధం ఏర్పరచుకున్నాయి. యుద్ధకాలంలో సహితం ఇల్యీచ్ తనకు అవసరమైన పుస్తకాలు జర్మనీ నుండి తెప్పించుకో గలిగాడు.

మరో అద్భుతమైన లక్షణం ఏమిటంటే పుస్తకాలను చదువరులకు ఇచ్చే విధానం - ఎర్ర నవారు' లేనే లేదు. చక్కని క్యాటలాగులు. తెరచివున్న బీరువాలు. చదువరుల విషయంలో వాళ్లు తీసుకొనే శ్రద్ధ అపారమైనది. ,

1915 వేసవిలో మేం రోట్ హారన్ పర్వతాల దిగువభాగాన, ఎక్కడో దూరంగా ఉన్న గ్రామంలో నివసిస్తుండేవాళ్లం. అక్కడికి కూడా మాకు గ్రంథాలయాల నుండి పుస్తకాలు వచ్చేవి. పోస్టు ఖర్చు ఉచితం. లేబెల్తో వున్న దళసరికాగితంలో పుస్తకాలు వచ్చేవి : ఈ లేబెల్కి ఒక వైపున ఆ పుస్తకాలను అందుకునేవారి చిరునామా, రెండో వైపున గ్రంథాలయంవారి చిరునామా ఉన్నాయి. పుస్తకాలు తిరిగి పంపేటప్పుడు చేయవలసిందల్లా ఏమిటంటే ఆ లేబిల్ వెనక్కి తిప్పి పార్సిల్ చేసి పోస్టాఫీసుకు తీసుకు వెళ్లడం.

స్విస్ సంస్కృతిని పదేపదే పొగడేందుకు ఇల్యీచ్ వెనుదీసేవాడు కాదు. విప్లవం తర్వాత రష్యాలో ప్రవేశపెట్టబోయే గ్రంథాలయ వ్యవస్థను గురించి అతడు కలలు కనేవాడు

ఎన్.కె. కృపస్కయా

"
పార్టీ ప్రచురణాలయం,1934.

vijay pilla
9490122229

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు