సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన అభిప్రాయం


అసమ సమాజంలో సమానత్వం సాధించే అంతిమలక్ష్యంతో తీసుకొచ్చిన రిజర్వేషన్లను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమలుచేసే విషయంలో రాష్ర్టాలకు హక్కులుంటాయని, ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన కచ్చితమైన అభిప్రాయం ఆహ్వానించదగిన పరిణామం. రిజర్వేషన్ల అమలు విషయంలో రాష్ర్టాలకు అధికారాలు అప్పగించడమే సరైన రాజ్యాంగ స్ఫూర్తి అని తెలంగాణతోపాటు, దేశంలోని చాలా రాష్ర్టాలు చేస్తున్న వాదనలకు గురువారం నాటి ధర్మాసనం ఆమోదముద్ర వేసింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయం అంతిమం కాకపోయినా, అది రిజర్వేషన్లు పొందుతున్న సామాజిక వర్గాల్లోనే అంతర్గతంగా ఉన్న అసమానతల తొలగింపునకు జరిగే ప్రయత్నంలో ఒక గొప్ప ముందడుగు. సామాజికవర్గాల వర్గీకరణ విషయంలో వెల్లడైన ఈ ధర్మాసనం అభిప్రాయం, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో డిసెంబర్‌ 9 నాటి ప్రకటన లాంటిదే. ఇక ఇక్కడి నుంచి ముందుకు పోవడానికి ఒక దారి దొరికింది.

భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వం (ఆర్టికల్‌ 14), వివక్షకు తావులేని పరిస్థితులు (ఆర్టికల్‌ 15), సమాన అవకాశాలు (ఆర్టికల్‌ 16) అందించే ప్రాథమిక హక్కులు కల్పించింది. అయితే ఈ ‘సమాన’ హక్కులు సామాజిక అసమానతలు లేని సమాజంలోనే సాధ్యం. అందుకని ముందు భారతదేశంలో సామాజిక సమానత్వం సాధించాలని రాజ్యాంగ నిర్మాతలు తలపెట్టారు. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 46 ద్వారా వివక్షకు, అణిచివేతకు గురైన వర్గాలను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి పరిమితుల్లేవని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 46 స్ఫూర్తిని ఆధారం చేసుకొని 330, 332, 335 ఆర్టికల్స్‌ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్‌ కల్పించారు. 14, 15, 16 ఆర్టికల్స్‌కు, 330, 332, 335 ఆర్టికల్స్‌ మధ్య విభేదం కనిపించే అవకాశం ఉండటాన్ని గ్రహించి, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెనువెంటనే ఈ ఆర్టికల్స్‌ మధ్య సమన్వయం కుదిర్చే సవరణ చేశారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పౌరుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన నిబంధనలు జారీచేయవచ్చని ఆర్టికల్‌ 15(4)లో స్పష్టం చేశారు.


 
ఇతర దేశాల రాజ్యాంగాల్లోని చాలా అంశాలను భారత రాజ్యాంగంలోకి తీసుకున్నప్పటికీ, రిజర్వేషన్ల అంశం మాత్రం కచ్చితంగా ఈ దేశంలో ఎన్నో తరాలుగా అమలవుతున్న సామాజిక అంతరాలను తొలగించేందుకు పొందుపరిచిందే. స్వాతంత్య్రం రాకముందు నుంచే భారతదేశంలో రిజర్వేషన్లు అమలుచేసిన చరిత్ర ఉంది. 1882లోనే కొల్హాపూర్‌ రాజ్యంలో అప్పటి రాజు సాహు బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్‌ కల్పించారు. బ్రిటన్‌ ప్రధాని ప్రతిపాదించిన కమ్యూనల్‌ అవార్డులో సామాజిక రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. బ్రిటిష్‌ ప్రభుత్వం రూపొందించిన గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా చట్టాల్లో కూడా సామాజిక రిజర్వేషన్‌ కల్పించారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లోనూ రిజర్వేషన్ల అంశంపైనే ప్రధానంగా చర్చించారు. ఈ దేశంలో అనేక మతాలు, కులాల వారున్నారు. వారిలో పేదలున్నారు. వారిలో వెనుకబాటుతనం పోగొట్టడానికి, ఇతరులతో సమానంగా వారిని తీర్చిదిద్దడానికి రిజర్వేషన్లు కల్పించాలన్నది రాజ్యాంగస్ఫూర్తి. ఈ స్ఫూర్తికి అనుగుణంగానే 1951లో మొదటి రాజ్యాంగ సవరణ మొదలుకొని 2020లో 104వ రాజ్యాంగ సవరణ వరకు పార్లమెంటు చట్టాలు చేస్తూ వస్తున్నది. సుప్రీంకోర్టు కూడా సమయానుకూలంగా తీర్పులు వెలువరిస్తూ వస్తున్నది.

అయితే, రిజర్వేషన్లు ఎలా అమలుచేయాలనే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘అధికారం’ పంచాయతీ ఏర్పడింది. ఇది సామాజిక న్యాయం సాధనకు పెద్ద అవరోధంగా మారుతున్నది. ఎవరు వెనుకబడిన వారు? ఎవరు ఎస్సీలు? ఎవరు ఎస్టీలు? అనేది నిర్ణయించే అధికారం రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికే ఇచ్చింది. అయితే రాష్ర్టాల్లో ఉండే పరిస్థితి ఆధారంగానే ఆ నిర్ణయం ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. అంటే ఒక రాష్ట్రంలో ఎస్సీల కేటగిరికీ చెందిన  కులం మరో రాష్ట్రంలో కూడా ఎస్సీ కేటగిరీ కిందనే ఉండాలని లేదు. ఆయా రాష్ర్టాల పరిస్థితికి అనుగుణంగా సామాజికవర్గ నిర్ణయం జరుగుతుంది. అంటే రాజ్యాంగం చాలా స్పష్టంగా సామాజిక పరిస్థితులు అన్ని రాష్ర్టాల్లో ఒకే మాదిరిగా ఉండవని తేల్చిచెప్పింది. అది వాస్తవం కూడా. ఇప్పుడు రాష్ర్టాలు చేస్తున్న వాదన కూడా అదే. రిజర్వేషన్లు పొందుతున్న సామాజిక వర్గాల్లోని కులాల మధ్య అసమానతలు ఉంటే, వాటిని తొలగించడానికి వర్గీకరణ చేసుకుంటామని కొన్ని రాష్ర్టాలు వాదిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో, పంజాబ్‌ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ కోసం ఆయా రాష్ట్ర అసెంబ్లీలు చట్టాలు చేశాయి. కానీ ఇలా వర్గీకరణ చేసే అధికారం రాష్ర్టాలకు లేదని 2004లో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. దీనిపై అనేక రాష్ర్టాలు రాజ్యాంగ ధర్మాసనం సమీక్షను కోరాయి. దీంతో 2014లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2004 నాటి తీర్పును పునఃసమీక్షించాలని కోరింది. ఇదే కేసును సమీక్షించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పుడు 2014 నాటి ధర్మాసనం తీర్పును సమర్థించింది. 


 
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను పైకి తేవడానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ర్టాలకు, పార్లమెంటుకు ఉంది. అదే సందర్భంలో జాబితాలో ఉన్నవారికి క్షేత్రస్థాయిలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. రిజర్వేషన్లు సమానంగా ఎలా అందించాలన్న విషయాన్ని రాష్ర్టాలే నిర్ణయించుకోగలవని మేం నుమ్ముతున్నాం. ఆయా కులాల్లో వర్గీకరణ చేసే అధికారం రాష్ర్టాలకు ఉండటమే ‘సబబు’ అని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తాజాగా అభిప్రాయపడింది. సంఖ్యాపరంగా ఈ ధర్మాసనం కూడా 2004 నాటి ధర్మాసనం లాంటిదే కాబట్టి, సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం (ఏడుగురు లేదా తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం) ద్వారా దీనిపై మరింత లోతుగా పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

స్థానిక, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ర్టాలకే ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం పెత్తనం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని కేసీఆర్‌ వాదన లేవనెత్తారు. ఎస్సీ వర్గీకరణ జరపాలని, ఎస్టీలకు రిజర్వేషన్‌ పెంచాలని, ముస్లింలుగా పరిగణించబడుతున్న కొన్ని కులాల వారికి రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ రాష్ట్రం గట్టిగా కోరుకుంటున్నప్పటికీ నిర్ణయాధికారం లేక నిస్సహాయంగా ఉండాల్సి వస్తున్నది. ఎస్సీలలోనే కొన్ని కులాలు మరీ వెనుకబడి ఉన్నాయని, వారికీ అవకాశాలు రావాలంటే తప్పక వర్గీకరణ జరగాలని అందరూ కోరుతున్నారు. కానీ నిర్ణయం మాత్రం జరగడం లేదు. రాష్ట్రస్థాయిలో బీసీలకు ఉన్నట్లే ఎస్సీలకు, ఎస్టీలకు కూడా వర్గీకరణ ఉండాలని చాలా రాష్ర్టాల్లో డిమాండ్‌ ఉంది. తాజాగా సుప్రీం ధర్మాసనం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసి, ఆ వాదనకు ధర్మబద్ధత చేకూర్చింది. భారత సమాజంలో అసమానతలున్నాయనేది అందరూ అంగీకరించే వాస్తవమే. వీటిని తొలగించే విషయంలో నెలకొనే సందిగ్ధత, అవరోధం అంతిమ లక్ష్యానికి విఘాతం కలిగించ వద్దు.

స్థానిక, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ర్టాలకే ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో కేంద్రం పెత్తనం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమని కేసీఆర్‌ వాదన లేవనెత్తారు. ఎస్సీ వర్గీకరణ జరపాలని, ఎస్టీలకు రిజర్వేషన్‌ పెంచాలని, ముస్లింలుగా పరిగణించబడుతున్న కొన్ని కులాల వారికి రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ రాష్ట్రం గట్టిగా కోరుకుంటున్నప్పటికీ నిర్ణయాధికారం లేక నిస్సహాయంగా ఉండాల్సి వస్తున్నది. 

-గటిక విజయ్‌కుమార్‌


Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు