సద్విమర్శ నేరం కాదు


సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ను కోర్టు ధిక్కరణ నేరం కింద శిక్షార్హుడిగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్మానించింది. ఈ తీర్పు పట్ల పలువురు మాజీ న్యాయమూర్తులు, దేశంలోని ప్రముఖులు, న్యాయవాదుల సంఘాలు, సంస్థలు అభ్యంతరం వెలిబుచ్చాయి. ట్విట్టర్‌ వేదికగా ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన రెండు పోస్టులు దేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవానికి భంగకరంగా వున్నాయని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వం లోని బెంచ్‌ భావించింది. సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేసింది. 

ఒక ట్వీట్‌ హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే దిగిన ఫొటోకు సంబంధించినది. ఆయన ముఖానికి మాస్క్‌, హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపి నిబంధనలు పాటించలేదనేది మొదటి పోస్టు. ఆరు సంవత్సరాలుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించిన నలుగురు తమ పదవీ కాలంలో...దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీకి ఊతమిచ్చారని, పౌరుల ప్రాథమిక హక్కులు, దేశ భద్రత వంటి కీలక అంశాలకు సంబంధించిన కేసులను అత్యున్నత న్యాయస్థానం త్వరితగతిన విచారించలేదన్నది రెండవ పోస్టు సారాంశం. ఇవి న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని సుప్రీం నిర్థారించింది.

*భావ ప్రకటనా స్వేచ్ఛ*

సుప్రీం వెలువరించిన తీర్పు...న్యాయ వ్యవస్థ తన ప్రతిష్టను తానే మసకబార్చుకున్నట్టు భావించాలి. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు స్వతంత్రంగా, సమర్థవంతంగా పని చేయాలనేది నిర్వివాదాంశం. అయితే తనను ఎవరూ విమర్శించకూడదనే న్యాయ వ్యవస్థ స్వీయ రక్షణ...ఆ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీస్తుంది.

దేశంలోని ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా సరే విమర్శకు అతీతం కాదు. సద్విమర్శ వ్యవస్థ పటిష్టతకు దోహదపడుతుంది. ఏ వ్యవస్థ అయినా తన లోపాలను ఎంచి చూసుకునేందుకు మార్గమవుతుంది. మేం విమర్శకు అతీతమని ప్రకటించడమంటే రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కులను వమ్ము చేయడమే. 

సుప్రీంకోర్టు గత 7 దశాబ్దాలలో ఎన్నో ప్రతిష్టాత్మక తీర్పులను వెలువరించటమే కాక పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటంలో చారిత్రక తీర్పులు వెలువరించింది. అయితే, 70వ దశకంలో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులలో (ఎడిఎం జబల్‌పూర్‌ కేసు) పౌరుల జీవించే హక్కు, ప్రాథమిక హక్కులు ఎమర్జెన్సీకి లోబడే వుంటాయని సుప్రీం ఇచ్చిన తీర్పు తీవ్ర విమర్శలకు లోనైంది. 

భూషణ్‌ కోసులో సుప్రీం తీర్పు కూడా అలాంటి చర్చకే తెర లేపింది. ఈ తీర్పు సుప్రీం చరిత్రలో చీకటి అధ్యాయం. కోర్టులు, న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా, వ్యవహారశైలి ద్వారా ప్రజల ఆమోదం పొందగలరని నిరంకుశ ధోరణితో విమర్శలు స్వీకరించే స్థితిలో వుంటే ప్రజల నుండి ఖేదం లభిస్తుందని...సుప్రీం న్యాయమూర్తులుగా పని చేసిన జస్టిస్‌ గజేంద్ర గడ్కర్‌, జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌లు సెలవిచ్చారు.

*భావవ్యక్తీకరణ-కోర్టు ధిక్కరణ*

రాజ్యాంగ పరంగా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే విశిష్ట అధికారాలు సుప్రీంకోర్టు, హైకోర్టులు కలిగి వున్నాయి. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణలో న్యాయ వ్యవస్థకు సమున్నత స్థానం ఉందన్నారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. భావ వ్యక్తీకరణను నిరోధిస్తే కోర్టు ప్రతిష్ట ఇనుమడించదు. ''ధిక్కరణ'' అంటే ఏంటో కోర్టు ధిక్కరణ చట్టంలో స్పష్టంగా నిర్వచించలేదు. సుప్రీం తీర్పులో భావవ్యక్తీకరణే నేరమన్నట్లు పరిగణించటం విస్మయానికి గురిచేస్తుంది. ఇది ప్రమాదకర సంకేతం. 

వ్యక్తిగతంగా ప్రశాంత్‌ భూషణ్‌ ఎన్నో దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో వుండి విశేష సేవలందించారు. బడుగు, బలహీన వర్గాల తరపున న్యాయ స్థానంలో వకాల్తా పుచ్చుకున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను పటిష్టపరిచేలా సద్విమర్శలు చేశారేగాని ఏనాడూ పరుష పదజాలాన్ని ప్రయోగించలేదు. చట్టవ్యతిరేకంగానూ ప్రవర్తించలేదు. ప్రజా న్యాయవాదిగా ఉన్నత వ్యక్తిత్వం ఆయనది.

*బలమైన, స్వతంత్ర న్యాయవాద సంఘాలు*

దేశంలో స్వతంత్ర, బలమైన న్యాయవాద సంఘాల ద్వారానే బలమైన, స్వతంత్రమైన న్యాయ వ్వవస్థకు పునాదులు పడతాయి. న్యాయవాదుల సహకారంతోనే న్యాయ వ్యవస్థ ప్రతిష్ట పరఢవిల్లుతుంది. ఆ వ్యవస్థలో పని చేసే న్యాయవాదులు న్యాయ వ్యవస్థ బలహీనతలను ఎత్తి చూపగలరు. ప్రశాంత్‌ భూషణ్‌ చేసింది అదే. 

విమర్శను స్వీకరించడం, లోపాలను గుర్తెరగటం న్యాయ వ్యవస్థ బలోపేతానికి చోదకమౌతాయి. వీటిని విస్మరిస్తే సంభవించే పరిణామాలు చేదుగా ఉంటాయి. తాము విమర్శలకు అతీతులమని న్యాయ వ్యవస్థ భావిస్తే ప్రజాస్వామ్యం, భావ వ్యక్తీకరణ పునాదులకు బీటలు పడినట్లే, విమర్శ ప్రజాస్వామ్యానికి రక్షణ వలయం వంటిదని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ ధనుంజయ చంద్రచూడ్‌ ఒక తీర్పులో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ సైతం సద్వివిమర్శలను స్వీకరించగలగాలి. అప్పుడే అందరి మెప్పు పొందగలుగుతుంది. దాని ప్రతిష్టను ఇనుమడిస్తుంది.

దేశంలో కోట్లాది కేసులు దశాబ్దాల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా వున్నాయి. ప్రాథమిక హక్కులు, నేరాలు, ఆస్థి తగాదాలు, వ్యాపార సంబంధమైన అనేక కేసుల్లో తీర్పులు రావటానికి ఎక్కువ సమయమే పడుతోంది. వీటన్నిటిని పక్కన పెట్టి, దేశావ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా కోర్టులు భౌతికంగా పని చేయని సందర్భంలో కూడా ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణగా పరిగణించి...వడివడిగా తేల్చి నేర నిర్థారణ చేయడం...ప్రజలకు న్యాయ వ్యవస్థ పట్ల తప్పుడు సందేశాలనే అందిస్తుంది. 

తన మేధస్సుతో ప్రజా న్యాయవాదిగా దశాబ్దలుగా ఇతోధికంగా సేవలందించిన ప్రశాంత్‌ భూషణ్‌ను శిక్షించడమంటే ప్రజలకు శిక్ష విధించడమే. ఇది స్వేచ్ఛా, సమానత్వం, స్వాతంత్య్ర, భావ వ్యక్తీకరణ, న్యాయ పాలన సిద్ధాంతాలను విస్మరించడమే. ఈ నెల 20వ తేదీన శిక్ష ఖరారుకు సుప్రీం సిద్ధమవుతున్న వేళ ప్రగతిశీల శక్తులు, ప్రజలు, న్యాయవాదులు, ప్రముఖులు దీనిపై గళమెత్తాలి. సుప్రీం తన తీర్పును పున: సమీక్షించుకుని న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కాపాడాలి. ఈ సమయంలో ఇది ఎంతైనా అవసరం. ఈ విధంగా సుప్రీంకోర్టు తనను తానే మసకబరుచుకునే స్థితి నుండి బయట పడుతుందని ఆశిద్దాం.

✍️ నర్రా శ్రీనివాసరావు (అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు), జాతీయ కార్యదర్శి, సెల్‌ : 9440441488)

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు