సామ్యవాద లౌకిక వాటిక భారత రాజ్యాంగ పీఠిక

 
◆భారతదేశం 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగానే ప్రజలు దేశవ్యాప్తంగా రాజ్యాంగ పీఠికను పఠనం చేస్తున్నారు. ఉద్యమవాణిగా మార్చుకున్నారు. రాజ్యాంగ విలువలకు పీఠిక దర్పణం. పీఠిక భారతదేశాన్ని ప్రజాతంత్ర లౌకిక సామ్యవాద సర్వసత్తాక గణతంత్ర దేశంగా ప్రకటించింది. ఇందులో లౌకిక సామ్యవాదం అన్న పదాలు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి. 

◆ఆ తర్వాతనే రాజ్యాంగ మౌలిక చట్రంలో పీఠిక అంతర్భాగమని, దాన్ని సవరించటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు అనేక దఫాలుగా స్పష్టం చేసింది. అయినా బీజేపీకి ఇవేవీ పట్టటం లేదు. తాజాగా పౌరసత్వ సవరణ చట్టం, పౌరజాబితా ముందుకు తెచ్చి దేశంలో అద్వైత హిందూత్వను అధికారిక మతంగా ప్రకటించాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం 2015లోనే మొదలైంది.

◆గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2015లో కేంద్ర సమాచార ప్రసార శాఖ జారీ చేసిన ఓ ప్రచార ప్రకటనలో లౌకిక, సామ్యవాద అన్న పదాలు తొలగించిన పీఠికను ప్రచురించారు. సాధారణంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జారీ చేసే ప్రభుత్వ ప్రకటనలు మతసామరస్యాన్ని, పరమత సహనాన్ని వ్యక్తీకరించే విధంగా అన్ని మతాలకు చెందిన వారి కట్టుబొట్టుతో కూడిన ఫొటోలు కూడా ప్రచార ప్రకటనలో ఉంటాయి. 

◆కానీ 2015లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో కేవలం హిందువుల కట్టుబొట్టుకు సంబంధించిన ఫొటోలు మాత్రమే ప్రచురించారు. సిక్కులు ప్రతీకగా ఉన్న టర్బన్‌ గానీ, క్రైస్తవులకు ప్రతీకగా ఉన్న చిహ్నాలు గానీ, ముస్లింలకు ప్రతీకగా ఉన్న చిహ్నాలుగానీ లేవు. నాడే బీజేపీ అసలు ఉద్దేశ్యం తేటతెల్లంగా వెలుగులోకి వచ్చింది. ఆ హెచ్చరిక పట్ల దేశం ఏమరుపాటు ప్రదర్శించింది కాబట్టే నేడు పౌరులందరూ చొరబాటుదారులేనని ప్రకటించే దుస్సాహసానికి బీజేపీ ఒడిగడుతోంది. ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలంటే రాజ్యాంగ పీఠిక రూపొందిన క్రమాన్ని తెలుసుకోవాలి.

◆డిసెంబరు 13, 1946న రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం ఆధారంగా పీఠిక రూపొందింది. రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని అనేక దఫాల చర్చల తర్వాత 1947 జనవరి 22న రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. అనంతరం 1949 అక్టోబరు 17న పీఠికను రాజ్యాంగపరిషత్‌ చర్చకు పెట్టింది. ఈ చర్చలో పాల్గొన్న వ్యక్తులు వెల్లడించిన అభిప్రాయాలు, వాటి లోతును అర్థం చేసుకోకుండా పీఠిక స్ఫూర్తిని అర్థం చేసుకోలేం.

◆హస్రత్‌ మొహాని భారతదేశాన్ని భారతీయ సోషలిస్టు రిపబ్లిక్కుల సమాహారంగా యూనియన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌గా ప్రకటించాలని ప్రతిపాదించారు. నాటి సోవియట్‌ యూనియన్‌ రాజ్యాంగం అప్పటికే ఆ దేశంలోని అణగారిన జాతులు, ప్రాంతాలకు సమున్నత గౌరవాన్నిచ్చి సమాన హౌదా ఇచ్చిన నేపథ్యంలో భారతదేశంలో కూడా అన్ని జాతులు మధ్య అటువంటి సంబంధాలనే మనం ఖాయం చేయాలన్న ఉద్దేశ్యంతో తాను ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చినట్టు మొహాని స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్ళే క్రమంలోనే 42వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ పీఠికలో 'సామ్యవాద' అన్న పదాన్ని చేర్చింది.

◆ఇప్పుడు జరుగుతున్న చర్చ పౌరసత్వానికి మతాన్ని పునాదిగా మార్చాలా వద్దా అన్న చర్చ. ఈ విషయంలో రాజ్యాంగ పరిషత్‌కు చాలా స్పష్టత ఉంది. ఈ చర్చను గమనిస్తే భారతదేశం లౌకికరాజ్యంగా మనుగడ సాగించాల్సిన అవసరం ఏమిటో కూడా బోధపడుతుంది. పీఠికను ఆమోదించటానికి జరిగిన చర్చలో అనేకమంది సభ్యులు సవరణలు ప్రతిపాదించారు. హెచ్‌వి కామత్‌ ''దేవుడిపై విశ్వాసం ప్రకటిస్తూ భారతీయులమైన మేము...'' అని పీఠికను సవరించాలని ప్రతిపాదించారు. అంతేకాక భగవద్గీత స్ఫూర్తితో రాజ్యాంగాన్ని అంకితం చేయాలని కూడా ప్రతిపాదించారు. ''రాజ్యాంగంలో ఉన్న లోపాలు అధిగమించే శక్తిని ప్రసాదించాలని, మట్టిలో మాణిక్యాలు సృష్టించగల ధైర్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాలని...'' అంటూ సాగుతుంది హెచ్‌వి కామత్‌ సవరణ తీర్మానం. 

◆దీన్ని తిరస్కరిస్తూ తిరుమలరావు ''ఈ దేశానికి దేవుడు కావాలా వద్దా అన్నది ఈ రాజ్యాంగ పరిషత్‌లోని 300మందిమి నిర్ణయించలేం. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు దేవునిపై ప్రమాణం చేసి అని చెప్తూనే ఉన్నాం. దేవుడిని నమ్మని వాళ్లకు మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. అలాంటప్పుడు పీఠికలో దేవుడిని ప్రస్తావించటం ద్వారా మన లౌకిక విలువల పట్ల రాజీ వైఖరి అనుసరించలే''మని హెచ్చరిస్తూ కామత్‌ తన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

◆హృదరునాథ్‌ కుంజ్రు జోక్యం చేసుకుంటూ ''ఆలోచించటానికి, భావ ప్రకటనకు, విశ్వాస వ్యక్తీకరణకు స్వేచ్ఛనిస్తున్న రాజ్యాంగ పీఠికలో దేవుడిని ప్రస్తావించటం పీఠిక స్ఫూక్తి (రాజ్యాంగ లక్ష్యాల తీర్మాన స్ఫూర్తికి) విరుద్ధమైన, అసమంజసమైనద''ని అభిప్రాయపడ్డాడు. కుంజ్రు అభిప్రాయంతో ఏకీభవిస్తూ రోహిణి కుమార్‌ చౌదురి కూడా ''వందేమాతరం అంటున్నాం. దీని అర్థం ఏమిటి? దేవతను ప్రసన్నం చేసుకోవటమే కదా.. శక్తిని ఆరాధించే మేము దేవుడిని పీఠికలో చేర్చటాన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేశాడు. కాదు కూడదు అని దేవుడిని ప్రస్తావిస్తే దేవతను కూడా ప్రస్తావించాలని పట్టుబట్టాడు. 

◆ఈ సవరణలన్నింటినీ తిరస్కరిస్తూ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌, అంబేద్కర్‌లు పీఠికకు సవరణలు ఉపసంహరించుకోవాలని సభ్యులను కోరారు. కానీ కామత్‌ తన తీర్మానంపై ఓటింగ్‌కు పట్టుబట్డాడు. హాజరైన వారిలో 68మంది కామత్‌ తీర్మానాన్ని వ్యతిరేకించగా 41మంది సమర్ధించారు. అనంతరం గోవింద మాలవీయ దేవుడి గురించిన ప్రస్తావనతో కూడిన మరో తీర్మానాన్ని ప్రతిపాదిస్తే ఓటింగ్‌కు కూడా రాకుండా దాన్ని సభ తిరస్కరించింది. 

◆భారతదేశాన్ని ధార్మిక రాజ్యంగా మార్చాలన్న మొదటి ప్రయత్నాన్ని రాజ్యాంగ పరిషత్‌ తిప్పికొట్టింది. మరో సభ్యుడు శిబ్బన్‌ లాల్‌ సక్సేనా మరో సవరణ ప్రతిపాదిస్తూ దేవుడితో పాటు దేశాన్ని బానిసత్వం నుండి విముక్తి దిశగా నడిపించిన మహాత్మా గాంధీ ఆశీర్వచనాలు కూడా పీఠికలో భాగంగా ఉండాలని ప్రతిపాదించాడు. స్వాతంత్య్రోద్యమంలో అమరులైన లక్షలాదిమంది త్యాగాలను కూడా పీఠికలో కీర్తించాలని ప్రతిపాదించాడు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బ్రజేశ్వర్‌ ప్రసాద్‌ ''రాజ్యాంగంలో మహాత్మాగాంధీ పేరును చేర్చాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఆమోదించబోయేది గాంధేయ విలువలతో కూడిన రాజ్యాంగం కాదు. మన రాజ్యాంగ పునాది సూత్రాలు అమెరికా సుప్రీం కోర్టు తీర్పుల్లో ఉన్నాయి. బ్రిటిష్‌ పాలకులు ఆమోదించిన 1935 చట్టాన్నే దాదాపుగా పునఃప్రస్తావి స్తున్నాం. అందువల్ల గాంధీ పేరు రాజ్యాంగంతో జత చేయ రాదని'' వాదించారు. తీర్మానంపై పట్టుబట్టడం రాజ్యాంగ సభ సభ్యులకు గౌరవం తెచ్చిపెట్టదని, అందువల్ల సవరణను ఉపసంహరించుకోవాలని జెబి కృపలాని విజ్ఞప్తి చేశారు.

◆దేశ విభజనానంతరం ఈ దేశాన్నే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్న అల్పసంఖ్యాక మతస్తులకు నైతిక ధైర్యం చేకూర్చేందుకు గాను పీఠికలో లౌకిక అన్న పదాన్ని చేర్చాలని బ్రజేశ్వర్‌ ప్రసాద్‌ ప్రతిపాదించారు. అదేవిధంగా సోషలిజమే భారతదేశానికి భవిష్యత్తు అని అందువల్ల సోషలిజం అన్న పదాన్ని కూడా పీఠికలో అంతర్భాగం చేయాలని కూడా తీర్మానం ప్రతిపాదించారు. కేవలం సర్వసత్తాక రాజ్యానికే మనం పరిమితమైతే యుద్ధాలకు, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షకు అవకాశం ఇచ్చిన వారమవుతామన్నది బ్రజేశ్వర్‌ ప్రసాద్‌ ఆందోళన. 

◆పూర్ణిమా బెనర్జీ భారత రాజ్యాంగం దేశపు భౌగోళిక సార్వభౌమత్వానికి ప్రతీకగా కాక ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీకగా ఉండాలని ప్రతిపాదించగా మహావీర్‌ త్యాగి ఆ ప్రతిపాదనను సమర్ధించారు. అంతేకాక రాజ్యాంగానికి పీఠిక తొలి పాఠంగా ఉండాలని అప్పుడు మాత్రమే మిగిలిన భాగాల్లో ఏమన్నా మార్పులు చేసేటప్పుడు పీఠిక స్పూర్తికి లోబడి ఉన్నామా లేదా అని మనలను మనం సరి చూసుకోవటానికి సాధనంగా ఉపయోగపడుతుందని జెడి కృపలానీ అభిప్రాయపడ్డారు.

◆మన రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం పునాదిగా ఉంది. ఈ పదానికి ఉన్న ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక విలువను దేశం అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యానికి కుల వ్యవస్థకు పొంతన కుదరదు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఇదే ప్రజాస్వామ్యం నిరంకుశత్వానికీ, సామ్రాజ్యవాదానికీ, నియంతృత్వానికి దారులు వేస్తుంది. రాజ్యాంగం హామీ ఇస్తున్న స్వేచ్ఛ సమానత్వాలన్నీ అహింసాయుత పద్ధతుల్లోనే అమలు చేసుకోగలం. అనుభవించగలం. దానికి తొలి మెట్టు పరమత సహనం. దేశ ప్రజలందరూ ఒకరి మత విశ్వాసాలను మరొకరు గుర్తించాలి. గౌరవించాలి అని కృపలాని అభిప్రాయపడ్డారు. 

◆భారత రాజ్యాంగ లక్ష్యాల తీర్మానంలోనే రాజ్యాధికారం ప్రజల నుంచి పాలకులకు దఖలుపరుచుతుందని, పాలకులు గాంధీ ప్రతిపాదించినట్టు ధర్మకర్తలు మాత్రమేనని, ధర్మకర్తల పాలన నచ్చకపోతే పాలకమండలి కొత్త వారిని ఎన్నుకునేందుకు అధికారం కలిగి ఉన్నందున మన ప్రజాస్వామ్యం పాలకులు అందించిన ప్రసాదం కాదనీ, ప్రజాభిప్రాయ పునాదులపై నిలిచి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

◆ఈ విధంగా రాజ్యంగ లక్ష్యాల తీర్మానం, పీఠికపై జరిగిన చర్చల్లో రాజ్యంగ పరిషత్‌ నిస్సంకోచంగా భారతదేశాన్ని ధార్మిక దేశమనీ, ఏదో ఒక మతానికి మాత్రమే మాతృభూమి అని ప్రకటించటాన్ని తిరస్కరించింది. లౌకిక సామ్యవాద భావనలను రాజ్యాంగ పరిషత్‌ స్వీకరించింది. పరమత సహనం, సంఘీభావం, సౌభ్రాతృత్వాలను స్వాగతించారు. రాజ్యాధికారం ప్రజల చేతుల్లో ఉందని విస్పష్టంగా ప్రకటించింది. ఈ ప్రజలే ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ఆదేశించింది. భవిష్యత్‌ పాలకులు రాజ్యంగంలో చేపట్టబోయే ఏ మార్పులైనా రాజ్యాంగ లక్ష్యాల తీర్మాన స్ఫూర్తిని పొందుపర్చిన రాజ్యాంగ పీఠిక మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది వివేకవంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించింది. అంతిమంగా ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఇదే ప్రజాస్వామ్యం నియంతృత్వానికి పునాదులు వేస్తుందని కూడా హెచ్చరించింది. 

◆తన లక్ష్యమేమిటో, దేశాన్ని ఎలా మార్చదల్చుకుందో గణతంత్ర దినోత్సవ ప్రకటన ద్వారా పాలకులు తన లక్ష్యాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు. 

      రాజ్యాంగ నిర్మాతల హెచ్చరికను గుర్తించి అర్థం చేసుకున్నారు కాబట్టే నవతరం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవటానికి కంకణధారు లయ్యింది.  గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవటమంటే ప్రజలు ప్రజాతంత్ర పరిరక్షణోద్యమానికి రాజ్యాంగ నిర్మాతలిచ్చిన స్ఫూర్తితో కంకణధారులు కావటమే.

- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037(నవతెలంగాణ నుండి)

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు