సఫ్దర్ హష్మి





సఫ్దర్ హష్మి  జనవరి 2, 2021నాటికి అమరుడై
32 సంవత్సరాలైంది.  ఈ తరానికి సఫ్దర్ హష్మి ఎవరో తెలిసే అవకాశం తక్కువ.   

మనకి తెలిసినంత వరకు నాటకం అంటే ఏదో కళామందిరంలో టిక్కెట్ పెట్టో లేక ఉచితంగానో స్టేజి మీద వేసేదే.   ఒకానొక కాలంలో పరిషత్తు పోటీలు నాటకరంగానికి గొప్ప ఊపునిచ్చేవి.  ఇందులో కూడా సామాజిక స్పృహ వున్న నాటకాలు వుంటాయి.  నాటకాలు చూసే ప్రేక్షకులకి నాటకం చూసే అభిరుచి, ఆసక్తి ఉంటేనే థియేటర్లకి వెళ్లి చూస్తారు.  సాంస్కృతిక రంగం మీద ఎంతో ఫోకస్ చేసే కమ్యూనిష్టు ఉద్యమాలు ప్రజల్ని చైతన్య పరచటం కోసం నాటక రంగాన్ని ఎంతగానో ఉపయోగించుకున్నాయి.  "మా భూమి" వంటి నాటకాలు ఇందుకు ఉదాహరణ.   రాజ్య హింసని, దోపిడీని వ్యతిరేకిస్తూ 1960లలో బెంగాల్లో బాదల్ సర్కార్ థియేటర్ రంగంలో అనేక ప్రయోగాలు చేసారు.  ఆయన నాటకరంగాన్ని బహిరంగ ప్రదేశాల్లోకి తీసుకుపోయారు.  "శతాబ్ది" అనే పేరుతో 1967లో ఒక "థర్డ్ థియేటర్" సంస్థని నెలకొల్పారు.  ఈ రూపం ప్రదర్శన సందర్భంగా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటుంది.  సాంప్రదాయక నాటకం, సినిమా మొదటి రెండు థియేటర్లు కాగా, బహిరంగ ప్రదర్శన మూడో థియేటర్ అన్నమాట.  థర్డ్ థియేటర్ పూర్తిగా సామాజికాంశాల మీదనే ఫోకస్ చేస్తుంటుంది.  దుష్ట సంప్రదాయలకి, ప్రభుత్వ అసమర్ధత నిలక్ష్యానికి, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్ని ఆలోచింపచేయటమే థర్డ్ థియేటర్ లక్ష్యం.  

ఆ తరువాత కాలంలో "స్ట్రీట్ థియేటర్" అంటే వీధి నాటకం ఒక గొప్ప థియేటర్ గా ముందుకొచ్చింది.   వీధినాటకంలో ఎటువంటి సెట్టింగ్స్, మేకప్స్ వుండవు.  పాత్రధారులందరూ దాదాపుగా ఒకే ఆహార్యాన్ని ధరిస్తారు.  ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శన ఇవ్వగలిగేందుకు వీలుగా నాటకం తయారు చేయబడుతుంది.  అది రద్దీ బజార్లలో ఒక మూల కావొచ్చు.  కాలెజీల్లో ఓపెన్ ఎయిర్ లో కావొచ్చు.  ఆఫీసు ప్రాంగణాల్లో కావొచ్చు.  పార్కుల్లో కావొచ్చు.  ఎక్కడైనా సరే ఎటువంటి పరికరాలు లేకుండా ఖాళీ చేతుల్తో వెళ్లి ప్రదర్శన ఇస్తుంటారు.  ఇందులో సాంకేతికత కంటే సృజనాత్మకత ముఖ్యం.  వివిధ భంగిమల ద్వారా వాస్తవిక వాతావరణాన్ని సృష్టిస్తుంటారు.  టీవీ వార్తలు రావటాన్ని, రైలాగటాని కేవలం భంగిమల ద్వారా చూపిస్తుంటారు.  వీధినాటకానికి ముఖ్యాంశమెప్పుడూ వర్తమాన పరిణామాలే.  ఏదో ఒక సమస్యని తీసుకొని వ్యంగ్యాత్మకంగా ప్రదర్శనని రూపొందిస్తుంటారు.  డైలాగులు రాసుకొని, బట్టీ పట్టి చెప్పటం అనేది వుండదు.  ఒక లైన్ అనుకొని దానికనుగుణంగా అప్పటికప్పుడు సృష్టించిన సంభాషణలు చెబుతుంటారు.  

వీధినాటకాన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకెళ్లినవాడు సఫ్దర్ హష్మి.  ఆయన 12 ఏప్రిల్, 1954న పుట్టాడు.  సీపీఏం అనుబంధ సంస్థ ఐన ఎస్.ఎఫ్.ఐ.లో సభ్యుడు.  ఢిల్లీ యూనివర్శిటీలో ఎం.ఏ. ఇంగ్లీష్ లిటరేచర్ చేసాడు.  ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా - మనం ప్రజా నాట్యమండలి అంటుంటాం) లో సభ్యుడు.  ఆయన 1973లో "జన నాట్య మంచ్" ప్రారంభించాడు.  దాన్నే "జనం" (జన్మ) అని పిలుస్తారు.  ప్రజా వ్యతిరేకమైన ఆధిపత్య రాజకీయాలకి వ్యతిరేకంగా ఆయన వీధి నాటకాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకున్నాడు.  ఆ సమయంలో ఆయన ఇందిరాగాంధి పదవీ వ్యామోహాన్ని ఎండగట్టిన "కుర్సీ కుర్సీ కుర్సీ" చాలా వివాదాస్పదమైంది.  చిన్న రైతుల సమస్యల మీద "గావోం సే షహర్ తక్", నిరుద్యోగం మీద "తీన్ క్రోర్", స్త్రీలు ఎదురొకొనె గృహ హింస మీద "ఔరత్"...ఇంకా ఎన్నో వీధి నాటకాల్ని రూపొందించి ప్రదర్శించారు.  ఆయన మొత్తం 24 వీధి నాటకాల్ని రూపొందించి నాలుగు వేలకి పైగా ప్రదర్శనల్ని తన బృందంతో ఇచ్చాడు.  సాహిత్యపరంగా కూడా ఎంతో కృషి చేసి అన్ని రకాలుగా పాలక వ్ర్గాల్ని ఎండగట్టిన నిజమైన ప్రజా కళాకారుడాయన.  జనవరి 1, 1989 సాయంత్రం ఘజియాబాద్ మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన "హల్లా బోల్" (పెద్దగా అరవండి) ప్రదర్శన ఇస్తుండగా సగంలో కాంగ్రెస్ గుండాలు ఆయన బృందం మీద మారణాయుధాలతో దాడి చేసారు.  దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన మరుసటి రోజున మరణించారు.  గొప్ప విషయం ఏమిటంటే ఆయన మరణించిన రెండురోజులకి అంటే జనవరి 4న ఆయన భార్య మలయశ్రీ నేతృత్వంలో ఎక్కడైతే ఆయన మీద దాడి జరిగిందో అక్కడే ఆ నాటక ప్రదర్శన పూర్తి చేసారు.   హత్య జరిగిన 14 సంవత్సరాల తరువాత ఘజియాబాద్ కోర్ట్ పది మంది నిందితులకి జైలు శిక్ష వేసింది.  అందులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముకేష్ శర్మ కూడా వున్నాడు.

హష్మీ హత్య దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.  నిరసన జ్వాలలు ఎగిసాయి.  ఆయన మరణానంతరం వీధి నాటకం ఒక ఉద్యమ రూపం తీసుకున్నది.  మన తెలుగు నేల మీద వామ పక్షాలు వీధి నాటకాన్ని భుజానికెత్తుకున్నాయి.  ప్రజలకి చేరువవటానికి ఇదో అద్భుత సాంస్కృతిక మార్గమైంది.  నాబోటి ఆదర్శాల యువతరాన్ని ఈ కళా రూపం ఎంతగానో ఆకర్షించింది.  1990ల మధ్య నుండి క్రమంగా విజృంభించిన ప్రపంచీకరణలో భాగంగా వెలువెత్తిన వినిమయవాద భోగలాలసత యువతరాన్ని, ప్రజల్ని పక్కదారి పట్టించటంతో ప్రజా ఉద్యమాలు ఊపు చల్లారినట్లే ప్రజానుకూల సాంస్కృతిక ఉద్యమాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.  

ఇప్పుడు సమాజం గురించి ఆదర్శాలెక్కడ?  హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే "ఫ్లాష్ డాన్సెస్" గురించి చదివినప్పుడల్లా నాకు వీధినాటకాలు గుర్తుకొస్తాయి.  యువతరం పక్కదారి పట్టిందనటానికి ఇంతకంటే ఏం కావాలి?  

ఏమో కాలం ఎప్పుడూ ఒక్క తీరుగా వుండదు.  సామాజిక పరిణామాల్లో ఉత్తాన పతనాలు తప్పవు.  మళ్లీ ఆ రోజులు వస్తాయనే ఆశ. 

సఫ్దర్ హష్మీ అనేక పేర్లతో మళ్లీ రావాలి!

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు