2700 సంవత్సరాల క్రితం గంగానది లోయలో అభివృద్ధి చెందిన జనపదాలు, మహా జనపదాలు
నేటి నుండి 2700 సంవత్సరాల క్రితం గంగానది లోయలో అభివృద్ధి చెందిన జనపదాలు, మహా జనపదాలు
ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా, సింధూ మైదానం అని పిలుస్తారు. హిమాలయాలకు, ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమునలు ప్రవహిస్తాయి. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాలనుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటుంది. ఆ నదులలో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి.
1500 నుండి క్రీ.పూ 500 మధ్య జనపదాలు వృద్ధి చెందాయని సాహిత్య ఆధారాలు సూచిస్తున్నాయి. "జనపద" అనే పదం మొట్టమొదటి ప్రస్తావన ఐతరేయ (8.14.4), శతపథ (13.4.2.17) బ్రాహ్మణ గ్రంథాలలో కనిపిస్తుంది.
వేద సంహితాలలో జన అనే పదం ఒక తెగను సూచిస్తుంది. దీని సభ్యులు పూర్వీకుల వారసులు అని విశ్వసించారు.ఒక రాజు ప్రజలకు నాయకత్వం వహించాడు. సమితి అనేది జన సభ్యుల ఉమ్మడి సభ రాజును ఎన్నుకునే అధికారం, బహిష్కరించే అధికారం కలిగి ఉంది. సభ రాజుకు సలహా ఇచ్చే తెలివైన పెద్దల చిన్న సమావేశంగా ఉంటుంది.
మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయంచేస్తూ స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో 'జన’ అనీ, వారు స్థిరపడిన ప్రాంతాన్ని 'జనపదం' అనీ పిలుస్తారు.
ప్రజలు 2700 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడటం మొదలు పెట్టారు. లోహ పనిముట్లతో అడవులను నరికి, భూములను దున్ని వరి, ఇతర పంటల సాగుచేసేవారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడి వివిధ తెగల ప్రజలు నివసించసాగారు. ఇటువంటి పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు.
మహాజనపదాలు
గంగాలోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. తద్వారా లభించిన ఆధారాల ద్వారా ఆనాటి మహాజనపదాల ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోటానికి ప్రయత్నించారు. ఆ కాలం నాటి పుస్తకాలను ఎక్కువగా బ్రాహ్మణులు, బౌద్ధ, జైన భిక్షువులు సంకలనం చేశారు. అవి మతానికి సంబంధించిన పుస్తకాలు అయినప్పటికీ, ఆనాటి గ్రామాలు, పట్టణాల గురించే కాక పాలకులు, రాజుల గురించి కూడా తెలియజేస్తాయి.
కొన్ని పుస్తకాలను గ్రీసువంటి దూరప్రాంతవాసులు కూడా రాశారు. వివిధ ఆధారాలనుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆనాటి సంగతులు తెలుస్తున్నాయి.
మహాజనపదాల కాలంనాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు:
ఢిల్లీ, అత్రంజిభేర, కౌశంబి (అలహాబాద్కు దగ్గరలో), పాట్నా, అయోధ్య, రాజిర్ మొదలైనవి.
ఈ కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు: ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్జిమనికాయ, హెరిడోటస్ చరిత్ర, స్ట్రాబో మొదలైనవి.
మహాజనపదాల కాలంనాటి గ్రామాలు ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయంచేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారని తెలుస్తుంది. వారు కుటుంబ సభ్యులతోపాటు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేవారు. వాళ్లు 'దాసు'లను లేదా బానిస (యుద్ధాల్లో బందీలై రైతులకు అమ్ముడయిన వార)లను కూడా పనికి ఉపయోగించేవారు అంతేకాకుండా ‘భర్తుకా' అనే పనివాళ్ళకు కూలి ఇచ్చి పొలంలో, ఇంటిలో పనిచేయించుకునే వారు. కొంత మంది ధనవంతులైన గహపతులకు ఎక్కువభూమి, బానిసలు ఉండేవారు. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామపెద్ద అవుతాడు. గోండుల 'పట్లా’ లాగా ఆ గ్రామానికి అతడు నాయకుడే కాక, రాజుతరఫున ఇతర గ్రామస్తులనుంచి పన్నులు వసూలుచేసేవాడు. అంతేగాక కొన్ని సమయాలలో న్యాయమూర్తిగా, పోలీసు అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేవాడు.
చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పనివాళ్ళు ఉండేవారు. కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్ల (నాగటికర్రులు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి)ను, వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిలవ ఉంచే పాత్రలను కుమ్మరి, బండ్లు, నాగళ్లు, ఇతర గృహ సామగ్రిని వడ్రంగులు, దుస్తులను నేత పనివారు తయారుచేసేవారు. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వారికి ధాన్యం ఇచ్చి ఇచ్చేవారు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారుచేసుకోటానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు.
మహాజనపదాలలోని నగరాలు
పట్టణాలలో తమ జీవనానికి ఇతరులకోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతావారు వస్తువులు తయారుచేసి అమ్మే వృత్తిపనివారు. ఈ వృత్తిపనివారు ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారుచేసే వారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాలలోని ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారు, వెండి
ఆభరణాలను కూడా తయారుచేసేవారు. ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు, పరికరాలు తయారుచేసేవారు. వారు చెక్కతో బళ్ళను, గృహెూపకరణాలను తయారుచేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, చెక్కతోను, ఏనుగు దంతంతోను బొమ్మలు తయారుచేసే అనేక రకాల పనివాళ్లు ఉండేవారు. వీళ్లు తయారుచేసిన వస్తువులలో కొన్నిమాత్రమే తవ్వకాలలో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరికొంత తెలుస్తున్నాయి.
వృత్తిపనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. అంతేగాక వివిధ దేశాలలో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా జనపదాలలో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతోపాటు ఎద్దులు, బళ్ళు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలలపాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు.వాళ్ళకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో మంది సేవకులతో, బానిసలతో పనిచేయించు కుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు.
రాజ్యం, సైన్యం, పన్నులు
చాలా మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. ప్రజలు వారి ఆజ్ఞలను పాటించేట్లు చేయటానికి, ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండటానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారు రాజధాని నగరాలలో నివసిస్తూ, చెక్క, రాళ్లు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోట గోడలు నిర్మించేవారు. వీటంతటికీ చాలా ఖర్చు అయ్యేది. సైనికులకు, వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. ఇటుకలు చేసేవారికి, భవనాలు కట్టేవారికి కూలీ ఇవ్వాలి.
తెగలోని గ్రామపెద్దలకు లేదా ముఖ్యులకు, మహాజనపదాలలోని రాజులకు చాలా తేడా ఉంటుంది. ప్రజల నుంచి రాజులు పన్నులు వసూలు చేస్తారు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారస్తుల నుంచి పన్నులు వసూలు చేయటానికి అధికారులు ఉంటారు. పన్ను చెల్లించడానికి ఎవరైనా నిరాకరిస్తే వారిని సైనికులు శిక్షిస్తారు. ఈ అధికారులు, సైనికులు రాజుగారి ఉద్యోగులు, రాజు ఆజ్ఞలకు లోబడి ఉంటారు. ప్రజలు తన ఆజ్ఞలు పాటించేలా చూడటానికి కూడా రాజుకు వీళ్లు ఉపయోగపడేవారు.
సిరి సంపదలతో, గొప్పగా ఉండాలని చాలా మంది రాజులు కోరుకునేవారు. దీనికి రెండు మార్గాలున్నాయి. మొదటిది వారి రాజ్యంలోని ప్రజలపై పన్నులను పెంచటం, రెండవది పొరుగు రాజ్యాలను జయించటం. వ్యవసాయం చేసే గృహపతులనుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను ఆరు భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని 'భాగ' అని పిలిచేవారు. ప్రతి నెల ఒక రోజు ఉచితంగా పనిచేయటం ద్వారా వృత్తిపనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు.
పశువులు, గొర్రెల మందలు కాసేవారు కూడా జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్థులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్లు, కలప వంటివి ఇచ్చేవారు. ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించటం ప్రారంభమయింది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు.
రైతులు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించటానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. తద్వారా రాజులకు పన్ను రూపంలో ఎక్కువ లభిస్తుంది. అదే విధంగా వ్యాపారస్థులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుండి తమ తరఫున పన్నులు వసూలు చేయాలని గ్రామపెద్దని రాజులు కోరేవారు. గ్రామపెద్ద అధికారం, సంపద పెరుగుదలకు ఇది సహాయపడింది.
రాజులు నిరంతరం రాజ్యవిస్తరణకు యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాలలో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. ఓడిన వాళ్ళని నాశనం చేసేవారు. గ్రామదహనాలకు, లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు.
Comments
Post a Comment