గిరిజన తెగల లక్షణాలు
ప్రజలందరూ సమానంగా ఉన్న గిరిజన
సమాజాలు
వివిధ రకాల సమాజాలను తెగలుగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, యానాదులు, సవరలు మొదలయిన గిరిజన సమాజాలున్నాయి. మన దేశంలోని చాలా రాష్ట్రాలలో ఉండే తెగలు ప్రధానంగా అడవులలో జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ విభిన్న జీవన విధానాలు, భాషలు, సంస్కృతులు ఉన్నాయి. వాళ్ళ మధ్య కొన్ని తేడాలున్నప్పటికీ వాళ్ళందరిని గిరిజనులు అని ఎందుకంటున్నారు? వాళ్ళ మధ్య కొన్ని ఒకేరకమైన లక్షణాలు ఉండడం దానికి కారణం. అ ఏమంటే
1. ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూలపురుషునినుండి వచ్చిన వాళ్ళమని భావిస్తారు. అందువల్ల తెగలోని సభ్యులందరు ఒకరినొకరు బంధువుగా తలుస్తారు.
2. సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పశు సంపద వంటివాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. అంతేగాని ఒక వ్యక్తికో, కుటుంబానికో చెందినవిగా తలచరు. ఈ వనరులన్నింటినీ తెగ నిర్ణయాలకనుగుణంగా వాడుకోవచ్చు.
3.ధనిక, పేద తారతమ్యాలు వీళ్ళలో కనపడవు. ప్రతి ఒక్కరికి తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఉంటుంది. ఉదాహరణకు తెగ భూమి మొత్తాన్ని అన్ని కుటుంబాలకు కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి పంచుతారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కుటుంబాలకు భూమిని పంచుతారు, లేదా విభజిస్తారు. మరికొన్ని సందర్భాలలో గిరిజన సమూహ సభ్యులందరూ సాగుచేసి పంట పండిస్తారు. పండిన పంటను అందరూ సమష్టిగా పంచుకుంటారు. గిరిజన తెగ సమష్టి భూమిని ఎవ్వరూ అమ్మడానికి వీలు లేదు. కారణం ఆ భూమి మొత్తం తెగది. ఎవరూ కూడా తాము సాగు చేయగలిగిన దాని కంటే ఎక్కువ భూమిని తమ ఆధీనంలో ఉంచుకోగూడదు..
4. తెగలోని వాళ్ళు అందరూ అన్ని పనులూ చేస్తారు. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువులను మేపడం, దుస్తుల తయారీ, బుట్టల తయారీ, పనిముట్లు, ఇల్లు కట్టడం లాంటివి. ఏ పనికీ ప్రత్యేకమైన మనుషులు ఉండరు.
5. కుటుంబంలోని ప్రతి పనినీ చిన్నా, పెద్దా తేడా లేకుండా పురుషులు, స్త్రీలు, పిల్లలు కలిసి చేస్తారు. అయితే పురుషులకు నిర్ణయాధికారం ఎక్కువగా ఉండటం సామాన్యంగా కనిపిస్తుంది.
6. అడవి దేవతలను, తమ మూల పురుషులను సంతృప్తిపరచటానికి వీలుగా జరిపే సామూహిక ఉత్సవాలకు, పండుగులకు గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంతేగాక వివిధ విశ్వాసాలు, ఆచారాలు, పాటలు, నృత్యాలు, చిత్రకళలు వంటివి వాళ్ళ సమూహాలలో సామాన్యంగా కనిపిస్తాయి.
Comments
Post a Comment