తెలంగాణా పోరాటానికి నాంది పలికినదొడ్డి కొమరయ్య అమరత్వం



తెలంగాణా పోరాటానికి  నాంది పలికిన
దొడ్డి కొమరయ్య అమరత్వం
                    ____ పుచ్చలపల్లి సుందరయ్య
     
          ఇది 1946లో, జూలై 4న జరిగిన సంఘటన.
వివిధ సంఘటనలతో విసునూరు దేశ్ ముఖ్ బాగా రెచ్చిపోయాడు. తన జీవితంలోనే ఎన్నడూ ఎరుగనంతటి ఘోరమైన ఓటమిగా దాన్ని పరిగణించాడు.. పోలీసుల సహాయంతో కడవెండి గ్రామానికి చెందిన నాయకులను హత్యచేయాలని పథకం వేశాడు. ఈ పథకంలో భాగంగా అనేకమంది ప్రజలపై కేసులు పెట్టాడు. వారిలో 15 మందిని అరెస్టు చేయించాడు. వారు తర్వాత బెయిలుమీద విడుదల చేయబడ్డారు. ఆ రోజుల్లో ఎంత తక్కువ సమయంలోనైనా సరే, ప్రజలు సంఘం కార్యాలయం చేరేవారు. తమ కార్యక్రమాన్ని గూర్చి చర్చించుకొనేవారు. ఆవిధంగా కేసులు పెట్టి భయ పెట్టినట్లయితే తన హత్యా పథకాలు, అమలు జరపవచ్చునని అతడు తలంచాడు. పోలీసు అధికారులు, జమీందారును, అతని గూండాలతోనూ కలిసి మొత్తం పధకమంతా తయారుచేశారు. జమీందారు యధేచ్చగా వ్యవహరించడం కోసం వాళ్ళక్కడనుండి

వెళ్ళిపోయారు. అది 1946 జూలై 4వ తేది. తప్ప త్రాగిన గూండాలు నాయకుల యిండ్లపై రాళ్ళు విసిరారు. ఆ ఊరేగింపు ప్రధాన వీధిలోనే వున్న జమీందారు యింటి దాపుకు వచ్చేసరికి, జమీందారు యింటి ప్రక్కన ఒక పాఠలో అప్పటికే సిద్ధంగావున్న గూండాలు ప్రజలపైకి కాల్పులు జరిపారు. ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్న గ్రామసంఘ నాయకుడు దొడ్డి కొమరయ్యకు తుపాకీ తూటా పొట్టలో గుండా దూసుకు పోయింది. ఆయన అక్కడకక్కడే మృతి చెందాడు. ఆయన అన్నగారైన దొడ్డి మల్లయ్య కాలికి తూటా తగిలి క్రింద పడిపోయాడు. మంగలి కొండయ్య నుదిటికి దెబ్బతగిలింది. అతని సోదరుడు నరసయ్య ముంజేయి గాయపడింది.
     దొడ్డి కొమరయ్య అమరత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది.

       ప్రజలు భయకంపితులై పారిపోలేదు. రక్తానికి రక్తం అని నినాదాలు. చేసుకుంటూ వారు జమీందారు భవనాన్ని చుట్టుముట్టారు. జమీందారు భవనానికి ప్రక్కనే పాకలోవున్న గూండాలని చూచి కంపించిపోయారు. ప్రజల కోపాగ్ని నుండి తప్పుకొని బ్రతికి బయటపడటం సాధ్యంకాదని తలంచారు. జమీందారు. భవనవు ఎత్తయిన గోడలు తమకు
రక్షణనివ్వగలనని భావించారు. జమీందారు. భవనంలోకి దూకారు. అయితే ప్రజలప్పటికీ ఆ భవనాన్ని చుట్టుముట్టారు. పరిసర గ్రామాల ప్రజలకు కబుర్లు పంపారు. వనం ఎండుగడ్డి మోపులలో ప్రజలు వచ్చిపడ్డారు. రెండువేల నుంది ప్రజలక్కడ చేరారు. కొంతమంది గడ్డిని చుట్టుముట్టారు. మరికొంతమంది ఊరి వెలుపల కాపలా కాస్తున్నారు. యిండా కొందరు గ్రామ వీధుల్లో సహరా తిరుగుతున్నారు. ప్రజలు ఆగ్రహంతో అట్టుడికి పోతున్నారు. ఈ వార్త విని, వినునూరు రామచంద్రారెడ్డి కొడుకు బాబూరావు (జగన్మోహన్) వినునూరు నుండి, కత్తులు, బల్లేలు, పిస్తోళ్ళు చేతబూనిన రెండువందల మంది గూండాలను తీసుకొచ్చాడు. గ్రామం వెలుపల కాపలా కాస్తున్న ప్రజలు వాళ్ళను జూచి ఆకాశం దద్దరిల్లేటట్లు వినాదాలు చేశారు. వడిసెలతో రువ్వుతూ మూకుమ్మడిగా గూండాల మీదికి నడిచారు. ఆగ్రహావేశపరులైన జనసామాన్యాన్ని చూచిన గూండాలు తుపాకి కాల్పులు సైతం  ప్రజల పురోగతిని ఆపజాలవని తలపోశారు. ప్రాణాలు దక్కితే చాలునని కాలికి బుద్ధిజెప్పి పారిపోయారు. ప్రజలు వాళ్ళను "మూడు మైళ్ళ దూరం తరిమికొట్టారు. అనేకమంది గూండాలకు రాళ్ళదెబ్బలు తగిలాయి. వాళ్లలో చాలామంది, పారిపోతూ మాడావురం తండాలో దాగుకున్నారు. అయితే, అక్కడి ప్రజల పరిస్థితిని గమనించి ఆ గూండాలను తరిమివేశారు. పేరు మోసిన గూండా అనుముల రామిరెడ్డిని ఒకచోట పట్టుకున్నారు. కామ్రేడ్స్ భీమిరెడ్డి నరసింహరెడ్డి సి. యాదగిరిరావు తదితరుల నోళ్ళలో మూత్రం పోసినవాళ్ళలో అతడూ ఒకడని తెలిసిన ప్రజలు అతన్ని చితకదన్ని పంపించారు. గూండాలు ఎక్కివచ్చిన బండ్లను ముక్కలుముక్కలు చేశారు. జమీందారు మామిడి తోటలో ఒక్క చెట్టయినా మిగలకుండా చేశారు.

సరిగ్గా అదే సమయంలో 60 మంది రిజర్వు పోలీసులు ఆ గ్రామానికి వచ్చారు. గూండాలపై తాము చర్య తీసుకుంటామని ప్రజలకు చెప్పారు వారిని అక్కడినుండి వెళ్ళిపోమన్నారు. ప్రజలచ్చటి నుండి చెదిరిపోయిన తర్వాత గూండాలను సురక్షితంగా జమీందారుకు అప్పగించారు. ఇదంతా జరిగిన తర్వాత సంఘం నాయకులపై ఆరు కేసులు పెట్టారు. గూండాలపై దాడి చేశారని, గడీని చుట్టుముట్టారని, దానికి నిప్పంటించడానికి ప్రయత్నించారని, గూండాల్లో ఎవరినీ అరెస్టు చేయలేదు. వాళ్ళ మీద ఏ కేసూ పెట్టలేదు. అయినా ప్రజలు చలించలేదు. దొడ్డి కొమరయ్య మృత దేహానికి, శవపరీక్షానంతరం వేలాది ప్రజలు ఆ గ్రామాలన్నింటా పెద్ద ఊరేగింపు జరిపిన అనంతరం అంత్యక్రియలు జరిగాయి. పరిసర గ్రామాల ప్రజలు కూడా ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. జమీందారు ఎదుట తాము తలవంచేది లేదని, సంఘం. కోసం తామంతా ఇనుమడించిన శక్తితో పనిచేస్తామని వారంతా ప్రతినబూనారు. ఆ తర్వాత మూడు నెలల కాలంలో వారు జమీందారు మనుషులను పొలాల్లోకి రానివ్వలేదు. పనిచేయనివ్వలేదు. ఈ సంఘటన అనంతరం తమకు ప్రియతమమైన ఈ అమరవీరుని శ్లాఘించే పాటలు పాడుకుంటున్నారు.

        కొమరయ్య మరణం, అమరత్వం తెలంగాణా రైతాంగంలో నిద్రాణమై వున్న ఆగ్రహాన్ని ప్రజ్వరిల్లజేసింది. నల్గొండ జిల్లాలోని అన్ని తాలూకాల్లో ప్రజలు ఒక్కుమ్మడిగా విజృంభించారు. జిల్లా అంతటా జరిగే అన్ని సభల్లోనూ, ప్రదర్శనలలోనూ, ఈ అమరవీరునికి జోహార్లర్పించే పాటపాడటం జరుగు తుండేది. కర్రలు, వడిసెలలు ధరించిన ప్రజలు ఒక గ్రామానికి చెందినవారు మరొక గ్రామానికి వెళ్లి వస్తూ ఉత్తేజం కలుగజేసేవారు. వారు ఉమ్మడిగా భూస్వామి గడీముందు బహిరంగ సభ జరిపేవారు. ఎర్రజెండాను ఆవిష్కరించే వారు. "ఇక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది. వెట్టి, అక్రమ నిర్బంధ వసూళ్ళు, భేదకళ్ళు ఇంకెంతమాత్రం సాగవు" అని ప్రకటించేవారు. భూస్వామిగాని, దేశముఖ్ గాని సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అమలు జరపకపోతే అతనిని సాంఘిక బహిష్కారానికి గురిచేసేవారు. అతని పొలాల్లో ఎవరూ పనిచేయటానికి వీలులేదు. క్షుర కర్మకారులుగానీ, రక్షకులుగానీ, ఇంటి పనివాళ్ళు గానీ, ఇతర పనివాళ్ళుగానీ ఎవరూ అతనికి ఏ పని చేయడానికి వీలులేదు. ఈ యాత్రను నిర్వహించింది, నిర్మించి వ్యాప్తి గావించిందీ స్థానిక నాయకులే.

పొరుగు గ్రామంనుండి వచ్చిన ప్రజలకు కుల,మత వివక్షత లేకుండా, భోజనాలు పెట్టి సత్కరించేవారు. వారికి మనంగా వీడ్కోలిచ్చేవారు. దూర గ్రామాలనుండి వచ్చినవారు, వెనుకకు వెళ్లిపోగా, ఆ గ్రామం నుండి మరి కొంతమంది ఆ యాత్రలో చేరి ప్రక్క గ్రామాల వరకు వెళ్లి వచ్చేవారు.

ఈ ఊరేగింపులు, జమీందార్ల ఇండ్లముందు నిలిపి, "జమీందార్ విధానం రద్దుకావాలి." "భూస్వాముల పీడనకు, పోలీసు జులుంచుకు స్వస్తిచెప్పాలి. నిర్బంధ ధాన్య సేకరణను, వెట్టిని, అవినీతిని అంతం చేయాలి." "అమరజీవి దొడ్డి కొమరయ్య జిందాబాద్" మొదలగు వివాదాలు వేసేవారు. తమ చేతుల్లోని గుటవలన్నిటిని (కర్రలన్నింటినీ). ఒక్కుమ్మడిగా నేలపై కొట్టి పెద్ద శబ్దం చేసేవారు. ఆ శబ్దం యావత్తు గ్రామాన్ని దద్దరిల్లజేసేది. ప్రజాద్రోహుల గుండెల్లో కంపరమెత్తించేది. "గూటు పాల సంఘం అని వాళ్ళు పిలుస్తుండే సంఘ నినాదా వినపడగానే, ఈ ప్రజాద్రోహులు తమ తలుపులు మూసుకొని, లోపల కూర్చొని తాళాలు పెట్టుకొనేవారు. ఈ ఊరేగింపులలో గల ప్రత్యేక లక్షణాల్లో ఒకటేమిటంటే, పురుషులతోపాటు స్త్రీలు కూడా తమ గ్రామాల్లోనేగాక, ఇతర గ్రామాల్లోకూడా పాల్గొనటం, ఐలమ్మ భూమి పోరాటంపై రాసిన పాటలు మహిళలను అత్యంతంగా ఆకర్షించాయి. మొట్టమొదటి సారిగా; భూమి, భేదకళ్లు, వెట్టి, నిర్బంధ ధాన్యసేకరణ వంటి జీవిత సమస్యలను జమీందారీ రద్దు నినాదాన్ని భోదించడం జరిగింది. ఈ దశలో ప్రధాన అంశమిది.
     అతని త్యాగం రైతాంగంలో చైతన్యాన్ని రగిలించి, భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా పోరాటానికి ప్రేరేపించింది. అతని స్ఫూర్తి తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడే ప్రతి వ్యక్తికి ప్రేరణగా నిలిచింది.

      తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య జయంతి (ఏప్రిల్‌ 3) మరియు వర్థంతి (జూలై 4)లను అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2023 ఏప్రిల్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఏప్రిల్ 3న హైదరాబాదు లోని రవీంద్ర భారతి లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు అధికారికంగా ఘనంగా నిర్వహించారు.

(రైతువాణి,జూలై, ఆగస్టు-2006)

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు