రూపం మార్చుకుంటున్న ఫాసిజం_ ప్రజాస్వామిక వాదుల కర్తవ్యాలు


రూపం మార్చుకుంటున్న ఫాసిజం_ 
ప్రజాస్వామిక వాదుల కర్తవ్యాలు 
   
        "ఫాసిజం ముఖ్యమైన లక్షణం సత్యాన్ని విమర్శించడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం." ___ జార్జ్ ఆర్వెల్

      ఫాసిజం 20వ శతాబ్దపు ప్రారంభంలో యూరప్‌లో మొదలైన ఒక రాజకీయ భావజాలం. ఇది ప్రధానంగా మన జాతి ఉన్నతమైనదని ప్రచారం చేసే జాతీయవాదం తో మొదలవుతుంది. మాధ్యమాలను నియంత్రిస్తుంది. మతాన్ని రాజకీయాలతో కలిపి యూదులు, కమ్యూనిస్టులను సామాజిక శత్రువులుగా ప్రచారం చేస్తుంది.
      ఫాసిజం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేసే ఒక రాజకీయ ధోరణి. ఇది అతిజాతీయ వాదాన్ని, మతాధిక్యతను, స్థానికతను ఉపయోగించుకుంటూ విదేశీయులకు వ్యతిరేకంగా హింసను సాధనంగా చేసుకుంటుంది. ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లర్, స్పెయిన్‌లో ఫ్రాంకో వంటి నియంతలు దీన్ని గణనీయంగా అనుసరించారు. భారతదేశంలో ఈ ధోరణులను మెజారిటీ మతవాద సంస్థ దీన్ని అమలు చేయడం గమనించవచ్చు.
      ఇటలీలో బెనిటో ముస్సోలిని (1922-1943) ఫాసిజాన్ని కార్పొరేటివిజంగా అమలు చేశాడు, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ (1933-1945) నాజీయిజంగా మలిచాడు. హన్నా అరెండ్ట్ తన "The Origins of Totalitarianism" (1951) రచనలో ఫాసిజాన్ని అధికారవాద వ్యవస్థగా వివరిస్తూ, దాని మూలాలను ఆధునిక సామాజిక రాజకీయ అసంతృప్తులతో ముడిపెట్టింది. దీన్ని ఎదుర్కోవడానికి రెండవ ప్రపంచ యుద్ధం కూడా జరగాల్సి వచ్చింది.ఫాసిజం యొక్క ప్రధాన లక్షణాలను ఉంబెర్టో ఎకో తన వ్యాసం "Ur-Fascism" (1995)లో ఫాసిజం యొక్క 14 లక్షణాలను గుర్తించాడు.అందులో మచ్చుకు కొన్ని ప్రధాన లక్షణాలు:
1. ప్రతిపక్షాభిప్రాయాలను అణచివేస్తారు. 
2. "దేశభక్తులుvs శత్రువులు" అనే భావనను వ్యాపింపచేస్తారు.
3. రాజ్య హింస పరిపాటి అవుతుంది. 
4. జాతీయ ఉన్మాదాన్ని పెంచేందుకు ఊహాత్మక కథనాలు ప్రచారంలో పెడతారు.

     జార్జ్ ఆర్వెల్ తన నవల "1984" (1949)లో ఫాసిస్ట్ రాజ్యం సత్యాన్ని వక్రీకరిస్తూ, నిరంతరం సర్వైలెన్స్ ద్వారా సమాజాన్ని నియంత్రించే స్వభావాన్ని విమర్శనాత్మకంగా చిత్రీకరించాడు.
       1961లో, బార్డెచే ఫాసిజం అంటే ఏమిటి?
 ( "Qu'est-ce que le fascisme?")
 అనే పుస్తకంలో ఫాసిజం స్వభావాన్ని పునర్నిర్వచించాడు .అందులో ఫాసిస్ట్ పద్ధతులు నిరంతరం సవరించబడుతూ ఉంటాయన్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఇతర పార్టీల సహకారం ద్వారా రాజకీయ ఆమోదం పొందడం నేటి నయా ఫాసిజం లక్షణమన్నారు. 
      ఇరవయ్యవ శతాబ్దం చివరలో నయా ఉదారవాదం ఆవిర్భావంతో రాజకీయ నాయకులు మూలధనానికి ఉన్న అన్ని పరిమితులను ( కార్మిక చట్టాలు , సామాజిక హక్కులు మరియు సుంకాలు సహా ) తొలగించడానికి ఒక మార్గంగా నయా ఫాసిజాన్ని ఉపయోగించుకునేలా ప్రేరేపించిందని యూనివర్సిడాడ్ మిచోకానా డి శాన్ నికోలస్ డి హిడాల్గోకు చెందిన మనస్తత్వవేత్త డేవిడ్ పావోన్-కుల్లార్ పేర్కొన్నారు.

        భారతదేశం, అమెరికా, రష్యా, టర్కీ .హంగేరీ, పోలాండ్, జర్మనీ,ఇటలీ,గ్రీస్,పోర్చుగల్,మొదలైన దేశాలలో వివిధ పార్టీల పేరుతో నయా ఫాసిజం అమలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఆమోదించినట్లు నటిస్తుంది. కానీ లోపలినుంచి దానిని నిర్వీర్యం చేస్తూ ఉంటుంది. హార్డ్ కోర్ మిలిటరిజం పాటిస్తుంది.ఆర్థిక వ్యవస్థను స్వంత మిత్రులకు,వారి కంపెనీలకు అప్పగిస్తూంటుంది.
      అమెరికా లో శ్వేత జాతి మేధస్సు, జాతివాదం, ఇమ్మిగ్రేషన్ వ్యతిరేకత లను అమలు చేస్తోంది.
ఇది ‘నయా ఫాసిజం’కు అత్యంత దగ్గరగా ఉందని చెప్పొచ్చు.
     టర్కీలో మతతత్వం, మైనారిటీలపై నియంత్రణ, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు చేస్తున్నారు.
హంగేరీ, పోలాండ్ లలో జాతీయవాదం, యూరోపియన్ యూనియన్ విలువలకు వ్యతిరేకత, వలసదారులపై ద్వేష భావనలు రెచ్చగొడుతున్నారు.
       నయాఫాసిస్టులు ఓటర్లను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఫాసిస్టు నాయకులైన హిట్లర్,ముసోలినీ వంటి క్రూరమైన నాయకుల నుండి తమను తాము వేరు చేసుకోవడానికి రకరకాలుగా అభినయిస్తూంటారు. నయీ ఫాసిస్టుల మధ్య వివిధ అంశాలు అంతర్జాతీయ సహకారానికి దారితీస్తున్నాయి.
       భారతదేశంలో హిందూత్వ భావజాల పరంగా బ్రాహ్మణీయత, మతతత్వం, చరిత్ర వక్రీకరణ పెంచి పోషిస్తున్నారు. మీడియాను నియంత్రిస్తున్నారు.ఒకే దేశం, ఒకే సంస్కృతి,ఒకే చట్టం‌,ఒకే ఎన్నిక పేరుతో ప్రజల చైతన్యాన్ని, చరిత్రను మారుస్తున్నారు. రాజకీయ ప్రయోజనం కోసం హిందూత్వ పేరుతో మతం విద్వేషానికి పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరోక్ష నియంత్రణ చేస్తున్నారు
 పెగాసిస్ వంటి వాటితో రహస్యం గా ప్రత్యర్థులపై నిఘాపెడుతున్నారు.మత పరంగా విభజన రాజకీయాలు చేస్తున్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని అనేక చట్టాలను చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో స్పష్టంగా కనిపిస్తున్న లక్షణాలివి.  
     విమర్శకులను, ప్రజాస్వామిక స్వరాలను హత్య చేస్తున్నారు. గౌరి లంకేష్‌ ,కల్బుర్గి,నరేంద్ర దభోల్కర్‌, గోవింద్‌ పన్సారే మొదలైన వారిని హత్య చేయడం ద్వారా భయోత్పాతాన్ని సృష్టించారు.నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు మత భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు.
      ఆహారం పై ఆంక్షలు పెడుతున్నారు.శాకాహారం అంటే మనిషి ఆలోచనలు సాత్వికంగా ఉంటాయని,తెలివి తేటలు గొప్పగా ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. మహిళలు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో వీళ్లే నిర్ణయిస్తారు. వ్యక్తిగత విశ్వాసాల పై దాడి చేస్తారు. 
       సనాతన ధర్మం అంటూ మనువాదాన్ని ప్రజల మనసుల్లోకి నింపుతున్నారు. భారతదేశంలో నెలకొన్న బహుళత్వాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. గోమాత పేరుతో హింస, బహుజనులపై దాడులు చేస్తున్నారు. బడుగు ప్రజల చరిత్రను వక్రీకరిస్తున్నారు. నూతన విద్యా విధానం
( NEP ) ద్వారా బ్రాహ్మణీయ భావజాలాన్ని, మనువాద భావజాలాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.సామాజిక అణచివేతను “ధర్మం” పేరిట సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.ఒక వైపు మత విద్వేషాలను రెచ్చగొడుతూ కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే అనేక చట్టాలను చేస్తున్నారు.
        దేశభక్తులు vs దేశ ద్రోహులు లాంటి చర్చలు చేసి పాలకులను సమర్థించే వారిని దేశ భక్తులుగా మూర్ఖంగా కీర్తిస్తారు. దేశభక్తి పేరుతో జాతీయ వాదాన్ని రెచ్చగొట్టి చరిత్ర ను వక్రీకరిస్తారు. వాస్తవాలను చెప్పిన వారికి దేశభక్తి లేనట్లు చిత్రీకరిస్తారు. శామ్యూల్ జాన్సన్ చెప్పినట్లు, దేశ భక్తి అనే పదం, తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోటానికి మూర్ఖులు వాడే ముసుగు.

       మీడియాను కొనుగోలు చేయడం, లేదా తమ వైపుకు తిప్పుకొని ప్రజలకు వాస్తవ సమాచారాన్ని దాచి తమకు అనుకూలంగా సమాచారం వండి వారుస్తారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడేవారిని అర్బన్ నక్సలైట్లు గా ముద్రవేసి దుష్ప్రచారం చేస్తారు.
     టిమోథీ స్నైడర్ తన "On Tyranny" (2017)లో ఆధునిక సాంకేతికత ఫాసిస్ట్ ధోరణులను ఎలా సులభతరం చేస్తుందో వివరిస్తాడు.ఆ దారిలోనే నేడు
సోషల్ మీడియా ద్వారా అబద్ధ ప్రచారాలు, భయోత్పాతాన్ని సృష్టించడం చేస్తున్నారు.  
జాతీయ భద్రత పేరుతో వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నారు. మతపరమైన భావజాలాలను రాజకీయాలతో కలిపి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు.
     
     పాబ్లో నెరుడా రాసిన "I’m Explaining a Few Things" కవిత ఫాసిజం అసలు రూపాన్ని చూపుతుంది.

నీవు అడుగుతావు
“నీ కవితల్లో
పూలెందుకు లేవు?
స్వప్నాలూ లేవు?
నీ దేశపు అగ్నిపర్వతాలూ ఎందుకు లేవు?”

నీవు అడుగుతావు –
కవిత్వం ప్రేమ గురించి ఉండాలి కదా?
గులాబీలు, చినుకులు, జ్ఞాపకాల గురించి ఉండాలి కదా ?

వచ్చి చూడు – వీధుల్లో రక్తం ఎలా పారుతోందో!
వచ్చి చూడు – ప్రజల కన్నీళ్లు ఎలా కారుతున్నాయో!
వచ్చి చూడు – శిశువుల అరుపులు గాలిని ఎలా చీలుస్తున్నాయో!

మిత్రమా ,
ఒక్క మాట 
ఫాసిజం రక్తాన్ని పీలుస్తుంది.
మేము చూడాలనుకోకపోయినా, 
మా కళ్ల ముందు ప్రపంచాన్ని కాల్చేస్తుంది.

       నయా ఫాసిజం ద్వారా ప్రజాస్వామ్య రూపాన్ని ఉంచుకుంటూ,బ్రాహ్మణీయ ఫాసిజం ద్వారా మతాధిపత్య కుల సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.ఈ రెండింటి మిళితమే ఇప్పటి భారతదేశంలో ప్రభుత్వ ధోరణిగా కనిపిస్తుంది.
ఇప్పటి నయా ఫాసిజాన్ని స్త్రీ ద్వేషం, కుట్ర సిద్ధాంతాలు, పురాణాలు, అసహనం, హింస ఆధారంగా చేస్తున్న సైద్ధాంతిక యుద్ధంగా అర్థం చేసుకోవాలి.
        జాన్ స్టువర్ట్ మిల్ తన "On Liberty" (1859)లో స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పడం సమాజ పురోగతికి అవసరమని వాదిస్తాడు.అమర్త్య సేన్ తన "Development as Freedom" (1999)లో మానవ హక్కులు, స్వేచ్ఛ సామాజిక స్థిరత్వానికి కీలకమని నొక్కిచెప్పాడు. గతంలో పాసిజం హిట్లర్ రూపంలో తలెత్తినప్పుడు ప్రజాస్వామికవాదులు మానవ వాదులు, స్వేచ్ఛావాదులు, సంస్కరణ వాదులు,కవులు, రచయితలు ప్రజాస్వామ్యం, బహుళత్వం ,వ్యక్తిగత స్వేచ్ఛ , మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం అనేక పోరాటాలు, జీవితాలను త్యాగాలు చేశారు.

       ఫాసిజం ఒక సంక్లిష్టమైన రాజకీయ భావజాలం. ఇది సామాజిక సమస్యలకు ప్రమాదకరమైన పరిష్కారాలను అందిస్తుంది. ఈ భావజాలాల ప్రభావాలను అర్థం చేసుకోవడం, ప్రజాస్వామ్య విలువలను బలపరచడం, నేటి సమాజానికి ఒక సవాలు.మాసన్ రాసిన "హౌ టు స్టాప్ ఫాసిజం" అనే పుస్తకం, కొత్త ఫాసిజం ముప్పును అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మాసన్ ప్రకారం ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటానికి
వేర్వేరు సిద్ధాంతాలకు చెందిన పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు తమ విభేదాలను పక్కనపెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వారంతా ఐక్యంగా ఉండాలి.
      నేటి భారతదేశ పరిస్థితులలో ప్రజాస్వామ్య మూలాలను రక్షించడానికి, సామాజిక న్యాయం, సెక్యులరిజం పునర్నిర్మాణానికి ఒక విస్తృత ప్రజా ఉద్యమం అవసరమన్నది నిర్వివాదాంశం. సాంస్కృతిక రంగంలో కవులు రచయితలు కళాకారులు తమ మేథకు పదును పెట్టి నయా ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా సామాజిక రంగాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టాలి.ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను నిలబెట్టడమే నిజమైన దేశభక్తి.

      
__ పిళ్లా కుమారస్వామి 9490122229

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు