సర్దార్ గౌతు లచ్చన్న
సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో
మెట్రిక్యులేషన్ చదువుతుండగానే 21వ ఏట గాంధీజీ పిలుపువిని విద్యకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1930 లో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. దీనికి ప్రభావితుడైన లచ్చన్న బారువా సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో ఉప్పు తయారుచేసి ఆ డబ్బుతో ఆ ఉద్యమాన్ని నడిపాడు.
విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైన దుస్తులను అగ్నికి అహుతి చేశాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటున్నప్పుడు లచ్చన్నను అరెస్టు చేసి టెక్కలి, నరసన్నపేట సబ్ జైళ్లల్లో నలభై రోజులు ఉంచారు. కోర్టు తీర్పు మేరకు మరో నెల రోజుల శిక్షను అతను బరంపురం జైల్లో అనుభవించవలసి వచ్చింది.
1932 వ సంవత్సరంలో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొంటున్న లచ్చన్నను బంధించి రాజమండ్రి జైల్లో ఐదు మాసాలు ఉంచారు. రాజకీయాలకూ, సంఘసంస్కరణలకు సంబంధమేర్పరచి గాంధీజీ స్వాతంత్ర్యోద్యమాలు నడిపాడు.
అందులోని భాగమే అంటరానితనం నిర్మూలన. అంటరానితనం మీద కత్తి ఝుళిపించాడు లచ్చన్న.
అతను నడిపిన హరిజన సేవా సంఘాలు, చేపట్టిన హరిజన రక్షణ యాత్రలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. బారువా గ్రామ వీధుల్లో యువజనులను వెంట వేసుకొని భజన గీతాలు పాడుతూ వెళుతుంటే గ్రామమంతా దద్దరిల్లుతున్నట్లు కనిపించేది. సవర్ణులలో ఆశ్చర్యం, హరిజనులలో ఆశలు రేకెత్తించేవి. రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి అతనెంతో కృషి చేశాడు. హరిజనులకు దేవాలయాలలో ప్రవేశం కలిగించాడు. లచ్చన్న చేసిన ఆర్థిక సహాయంతో కుశాగ్రబుద్ధులైన ఎందరో హరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల నలంకరించారు.
ఆచార్య గోగినేని రంగాతో లచ్చన్న స్నేహం రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన శకాన్ని ఆరంభించింది. మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ గురు శిష్య సంబంధం లాంటిదే రంగా- లచ్చన్నల సంబంధం. నిడుబ్రోలులో రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో తొలిజట్టు విద్యార్థులలో లచ్చన్న ఒకడు. ఆ విశ్వవిద్యాలయంలో పొందిన శిక్షణ అతని జీవితానికెంతో ఉపకరించింది. జమీందారీ వ్యతిరేక పోరాటానికి ఆయనను నడుము బిగించేటట్లు చేసింది. 1935లో రాష్ట్రంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ శాఖ ఏర్పడినప్పుడు దానికి అతను సభ్యుడుగా ఎన్నికయ్యాడు. ఆ రోజుల్లో రైతు సంఘాలు కాంగ్రెస్ పార్టీలోని అంగాలే. 1939లో త్రిపురలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ మహాసభ, కిసాన్ సభలను ఆంధ్రలోని పలాసాలో జరపాలని తీర్మానించారు. రాహుల్ సాంకృత్యాయన్ ఈ సభలకు అధ్యక్షత వహించాడు. ఈ సభలు జయప్రదం కావడానికి ప్రధానకారకుడు లచ్చన్నే. దీనితో ఆయన పేరూ, ఆయన కార్యదీక్ష దేశమంతటా తెలిసింది. లచ్చన్న అనేక కిసాన్ ఉద్యమాలు నడిపి ఆ రోజుల్లో జమీందార్ల పక్కల్లో బల్లెంగా తయరైనాడు.
స్వాతంత్ర్యోద్యమంలో చివరి పోరాటం క్విట్ ఇండియా ఉద్యమం. 1942లో జరిగిన ఈ ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను ప్రభుత్వం అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించి, ఆయనను పట్టి యిచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే అతనిని బంధించి మూడేళ్ళు జైల్లో ఉంచి 1945 అక్టోబరులో విడుదల చేసింది. ఆనాటి నుంచి లచ్చన్న ఆంధ్ర అగ్రనాయకులలో ఒకరైనాడు. 1947లో లచ్చన్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యాడు.
తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్ర్యానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న. కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, ఆచార్య గోగినేని రంగా ప్రథమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా, రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న.
కలిశెట్టి అప్పలనాయుడు
శ్రీకాకుళం
9440436426
Comments
Post a Comment