అయ్యంకాళి


     కేరళ..." గాడ్స్ ఓన్ కంట్రీ "

     కేరళ అనగానే ఏం గుర్తొస్తుంది ?ప్రకృతి అందాలూ..కొబ్బరి చెట్లూ.కమ్యూనిజం...బనానా చిప్స్..అవియల్..ఇడియప్పం..పంఫ్రీట్...జేసుదాసూ..కథాకలి..ఓనమ్..మలయాళం.. ఆదూర్ గోపాలకృష్ణన్...మోహన్ లాల్..దుల్కర్ సల్మాన్..ఫహాద్ ఫాసిల్..బంగారం..నర్సులూ.. ఇంగ్లీష్ టీచర్లూ..ఇంతేనా...కేరళ ను ఇష్టపడడానికి కారణాలు ఇంకా ఉన్నాయి.

    పాలనూ నీళ్ళనూ వేరుచేయగలిగే  సునిశిత దృష్టి ...కష్టాల్లో అందరూ ఒక్కటైయ్యే ఐకమత్యం వీళ్ళది.
మొన్నీమధ్య  విమానప్రమాదం జరిగితే అంబులెన్స్ ల కన్నా ముందు చేరుకుని సొంత  కార్లలో బాధితులను ఆసుపత్రుల్లో చేర్చిన సివిలియన్స్ ని చూసి ఆశ్చర్యపోయాం.వర్షం లో చీకట్లో రక్తం ఇవ్వడానికి ఆసుపత్రుల ముందు వందల్లో  క్యూ లు కట్టిన పౌరుల్ని చూసి ముచ్చటపడ్డాం.ఇక క్షతగాత్రులకు బ్లడ్ అవసరం లేదు అని హాస్పిటల్స్ బోర్డ్ పెట్టేంతవరకూ యువతీ యువకులు కదల్లేదు.వాళ్ళెవరూ కరోనా కు భయపడలేదు.ఒక్క క్షణం ఆలోచించకుండా ఇమ్మీడియట్  గా రంగంలోకి దిగారు..మలయాళీ ల్లోని ఈ చైతన్యమే ప్రపంచాన్ని  అబ్బురపరుస్తుంది.

   అయితే అక్కడ ఎటువంటి మూర్ఖత్యం , వివక్షలూ లేవా.. ఉన్నాయి.. కానీ క్రైసిస్ లో అన్నిటిని మరిచి ఒకరినొకరు హత్తుకోవడం , మానవత్వానికి ఉదాహరణగా నిలవడం, మలయాళీ ల లో చూస్తాము.

        కేరళీయు లలో ఈ చైతన్యానికి కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడక ముందునుండే పడ్డ బీజాలు కారణం.ఆ సంస్కారానికి  కారకుడు ఒక గొప్ప దళిత వ్యక్తి 'మహాత్మ అయ్యంకళి' . 
Harbinger of Renaissance in Kerala గా పిలిచే అయ్యంకళి  జన్మదినం ఆగస్ట్ 28.కేరళ  అంతటా గొప్పగా జరుపుకుంటారు.. ఆరోజు పబ్లిక్ హాలిడే కూడా.

      ఆ మహానీయుడి గురించి వివరంగా....
   
 ట్రావన్ కోర్, కొచ్చి, మలబార్ మూడు సంస్థానాలు కలిపి ఏర్పడిన రాష్ట్రం కేరళ..ట్రావన్ కోర్ లోని తిరువనంతపురానికి13 కిలోమీటర్ల దూరంలో వెంగనూర్ గ్రామంలో 1863 ,ఆగస్టు 28 న జన్మించాడు అయ్యంకళి...అయ్యన్ , మాల అతని తల్లిదండ్రులు.అత్యంత కింది కులస్తులు గా ఉన్న పులయార్ కుటుంబం వాళ్ళది.పులయార్లు వ్యవసాయ కూలీలుగా పెద్ద రైతుల పొలాల్లో పనిచేసేవాళ్ళు.
   అయ్యన్  కుటుంబం ఒక కొండ ప్రాంతం అంతా రెక్కలు ముక్కలు చేసుకుని  సాగుబడి లోకి తెస్తే వారసులు లేని  ఆ ప్రాంతపు జమీందారు అతనికి అయిదు ఎకరాల భూమిని ఇచ్చాడు.కాలు మోపడనికి గజాల స్థలం లేని దళితులకు అంత భూమి ఉండడం మామూలు విషయం కాదు.అట్లా అందరు పులయాలర్ ల లోకి స్థితిమంతుల కుటుంబం వాళ్ళది.

        దళితుల పట్ల ఘోరమైన వివక్ష ఉన్న కాలం.. ఒక పులయార్ ఒక నాయర్ కన్నా 96 అడుగుల దూరం లో ఉండాలి అన్న నియమం. నాయర్ ల భూముల్లో వెట్టి చాకిరీ చేస్తూ మాట్లాడడం అటుంచి కనీసం దళితులు కళ్ళెత్తి చూడకూడదు. శరీరాలపై  పై వస్త్రం, చెప్పులు  వేసుకోకూడదు.దళిత స్త్రీలు కూడా పై వస్త్రం ధరించకూడదు.మెడలో , రాతి తో చేసిన గొలుసులు ,  రాళ్ళ తో చేసిన వేలాడే చెవి పోగులు ధరించాలి.నవ్వకూడదు.కుల స్త్రీలకు ఎదురుపడకూడదు.

       అయ్యంకళి   చిన్నప్పటి నుండి ఈ వివక్ష పై అసహనం గా ఉండేవాడు.ఒకసారి స్నేహితులతో ఫుట్బాల్ ఆడుతున్నాడు.బాల్ వెళ్ళి ఒక నాయర్ ఇంటిముందు తోటలో పడింది.ఆ ఇంటి ఓనర్ అయ్యంకళి ని ఇంకెప్పుడు నాయర్ ల , ఎళువ ల, నంబూద్రి ఇతర పెద్ద కులాల పిల్లలతో ఆడకూడద ని వార్నింగ్ ఇచ్చాడు.అయ్యంకళి కూడా ఒట్టుపెట్టుకున్నాడు. కేవలం తన కులం పిల్లల తోనే ఆడుకోవాలని. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది.అత్యంత దయనీయ స్థితి లో ఉన్న పేద పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపేవాడు.అయ్యంకళి లో చిన్ననాటి నుండే నాయకత్వ లక్షణాలు ఉండేవి.వ్యాయామం..ఆటల వల్ల పొలం పనుల వల్ల  మంచి దేహ దారుడ్యమ్ కలిగి ఉండేవాడు. సాయంత్రం పూట అందరు పిల్లలు గుంపుగా చేరి జానపద గీతాలు పాడేవాళ్ళు.కుల వివక్ష పై గీతాలు కూర్చి అందరి చేత పాడించేవాడు. ఊరందరికీ నచ్చిన వాడుగా ,ప్రియమైన వాడుగా అతణ్ణి 'ఊరిపిళ్ళై' మూతపిళ్ళై' అని పిలుచుకునేవాళ్ళు.
 1893 లో ఒక మధ్యాహ్నం నాయర్ ల లాంటి తెల్లటి దుస్తులు ధరించి, ఎడ్లబండి పై'నెడుమాంగడి' సంతకు వెళ్ళాడు అయ్యంకళి..అప్పటివరకూ దళితులు ఎడ్లబండి కొనడం..ఎక్కడం..నాయర్ ల లాంటి కొత్త దుస్తులు ధరించడం నేరం.ఊరు ఊరంతా ఉలిక్కిపడింది.చాలా ప్రాంతాల్లో దళితులకు  రహదార్లు కూడా నిషేధం.అగ్రవర్ణాల వాళ్ళు రాళ్ళతో ఎగబడ్డారు.అయ్యంకళి అనుచరులు కూడా తగ్గలేదు.అప్పటినుండి ప్రతీ ఊర్లో.. రోజూ భీకర పోరాటాలే.

ఈ సంఘటన ను కందసామీ..' dalits claim to public spaces' గా అభివర్ణించారు.
 ఎట్టకేలకు 1900 లో ట్రావెన్ కోర్ సంస్థానం లో అన్ని రహదార్లపై దళితులకు నిషేధం ఎత్తివేశారు.

         విద్యా రంగ సంస్కరణలు
        -------------------------------------
 ఎప్పటినుండి చదువుకున్నాం..కేరళ 100 శాతం అక్షరాస్యత , స్త్రీ పురుష నిష్పత్తి లో టాప్..మానవాభివృద్ధి సూచీ లో మొదటి స్థానం అని. కేరళీయలను అక్షర బాట పట్టించి ప్రపంచంలో తమదైన ముద్ర వేసుకోడానికి దోహదం చేసాడు అయ్యంకళి

     చదువు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అని నమ్మాడు అయ్యంకళి.ప్రభుత్వ పాఠశాలల్లో పులయార్లకు ప్రవేశం కల్పించాలని ట్రావెన్ కోర్ దివాన్ కు ఉత్తరాలు రాసాడు.అప్పుడు ఆంగ్ల పరిపాలనలో డైరెకర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా ' ఆర్ధర్ మిషెల్' ఉండేవాడు.అయ్యంకళి అతన్ని కలిసి పాఠశాలల్లో దళితులకు  ప్రవేశం కోసం విజ్ఞప్తి చేసాడు.  మంచి బట్టలు వేసుకుంటేనే సహించని వాళ్ళు దళితులకు చదువులు  అంటే ఊరుకుంటారా .. దివాన్ నుండి ఆర్డర్ వచ్చినా అగ్రకులాల పెద్దమనుషులు ఒప్పుకోలేదు.అయ్యంకళి మూడు అంచెల విధానం అమలు చేసాడు.

1.ప్రభుత్వ సహాయం కోరడం.
2.అగ్రకులాల వారితో పోరాటం.
3.స్వంతంగా పాఠశాలలు నెలకొల్పడం.

  ప్రభుత్వమ్ ఆర్డర్ పాస్ చేసి ఊరుకోగానే ..పోరాటం మొదలుపెట్టాడు.తన సైన్యం తయారు చేసుకున్నాడు.తమ పిల్లలు చదువుకోవడాన్ని వ్యతిరేకించే వాళ్ళ  పొలాల్లోకి , కూలీ  పనులకు వెళ్ళకూడదని తీర్మానించాడు.అన్ని ఊర్లల్లోకి కబురు అందింది. భూస్వాములు నివ్వెరపోయారు.ఒక్క రైతుకూలీ కూడా పొలాల్లో అడుగు పెట్టలేదు.దుక్కులు దున్నే కాలం. స్వంతంగా పనులు చేసుకోలేక సతమతమయ్యారు.ఎంతకాలమో వీరి మొండితనం సాగదని తిండి కోసం తిరిగి పొలాల్లోకి రావాల్సిందే అని గంభీరంగా ఉన్నారు. అయ్యంకళి చేపలు పట్టే వాళ్ళతో ఒప్పందం చేసుకుని పులయార్లను వాళ్లకు సహాయకులుగా పంపాడు.పట్టిన చేపల్లో కొన్నీ పులయార్లు అమ్ముకునే విధంగా ఏర్పాటు చేశారు.

    "మా పిల్లలకు చదువా.. మీ పొలాలు బీళ్ళా " అనే పాటలతో ఆ ప్రాంతాలన్నీ హోరెత్తాయి.'మిషెల్' ఇన్స్పెక్షన్ కు వస్తే అగ్రకులాల వాళ్ళు అతని జీప్ ను తగులబెట్టారు.రోజూ గోడవలతో అన్ని ఊళ్ళల్లోనూ ఉద్రిక్తత ఏర్పడింది.

 కేరళ ఏర్పడక 44 ఏళ్ళ ముందు 'అతి పెద్ద చారిత్రక వర్కర్స్ స్ట్రైక్ ' జరిగింది.వేతనాల కోసం కాదు విద్య కోసం.

     అయ్యంకళి సేన గుడిసెలు వేసి కొత్త పాఠశాలలు ప్రారంభించింది.ప్రభుత్వం ఉపాధ్యాయులకు 6.00 రూపాయల వేతనం ఇస్తే, తాను 9.00 రూపాయలు ఇస్తానని ప్రకటించాడు అయ్యంకళి.టీచర్లు అందరూ నంబూద్రి బ్రాహ్మలు, ఇతర అగ్రకులాల వాళ్ళే.ఎవరూ ముందుకు రాలేదు.చివరికి 'పరమేశ్వరన్ పిళ్ళై 'అనే టీచర్ ఒక్క రోజు పాఠాలు చెప్పాడు.అదే రాత్రి అగ్రకులాల వాళ్ళు ఆ పాఠశాల కు నిప్పు పెట్టి నేలకూర్చారు.'గ్రీష్మ గ్రీష్మం 'అనే పుస్తకం లో పిళ్ళై తన అనుభవాలను వివరించారు.

   1901 మార్చ్ 1 న 'ఊరూత్తంబలం' అనే ఊర్లో పంచమి అనే పులయార్ బాలిక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కోసం వెళ్ళింది.కోపంతో రగిలి పోయిన ఆ ఊరి నాయర్లు ఆ అమ్మాయి ఇంటి తో పాటు  ఊర్లో పులయార్ల గుడిసెలకు నిప్పు పెట్టారు.విషయం తెలుసుకున్న అయ్యంకళి సేన ఆ సాయంత్రం ఊర్లోని నాయర్ల పొలాలను ఇళ్ళను ధ్వంసం చేశారు.1901 నుండి 1904 వరకు చాలా పోరాటాలు జరిగి చివరకు 1904 లో అన్ని పాఠశాలల్లో దళితులకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం 'రాయల్ డిక్రీ' జారీ చేసింది.

____Rajitha Kommu
                                       

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు