సమకాలీన సామెతలు


• కరోనా పేషంటుకి దగ్గులు నేర్పినట్లు.
• తమ్ముడు తమ్ముడే...సోషల్ డిస్టెన్సు  సోషల్ డిస్టెన్సే...!
• దగ్గయి వంగనిది కరోనా అయి వంగుతుందా...?

• సర్వేంద్రియాణాం శ్వాసకోసం ప్రధానం.
• ఆడలేక మాస్కు మాసిందన్నాట్ట.
• బాటిల్లో పోస్తేనే శానిటైజర్ అయినట్లు.
• కరోనాకి కొడుకున్నాడు గానీ...పడిశానికి పెద్దన్న లేడు.
• అయ్య బజార్లు తిరుగుతుంటే...కొడుకు బాసింపట్టేసుకుని కూకుంటాడా?
• పొమ్మనలేక...తుమ్మినట్లు.
• గుడి కన్నా బందెలదొడ్డి పదిలం.
• పోన్లే పాపమని తొడుక్కోడానికి మాస్కు ఇస్తే....గుడెనక్కి పోయి అరుగు తుడిచాడట.
• కరోనా వచ్చినాక కర్చీఫు కోసం వెతుక్కుని ఏం లాభం?
• పనిమనిషికి పెత్తనం ఇస్తే శానిటైజర్ తో చెప్పులు తుడిచిందట. 
• జ్వరం వచ్చినోడెళ్ళి కరోనా వచ్చినోడితో మొఱపెట్టుకున్నాడట.
• గోరంత వైరస్ జగమంత ఒణుకు.
• దగ్గేవాడికి... కరోనా వచ్చినోడు లోకువ.
• తోచీతోచనమ్మ కరోనా వచ్చినోళ్ళతో కబడ్డీ ఆడితే....ఇంకా తోచనమ్మ ఐసోలేషన్ సెంటర్ కెళ్ళి సెల్ఫీ దిగిందట.
• చూసి రమ్మంటే అంటించుకుని వచ్చేట్ట.
• కరోనా వచ్చిందని ఒకడేడుస్తుంటే .... పేకాటకి ఒక హ్యాండు తగ్గిందని ఇంకోడేడ్చాడట.
• చేయి చూసి జాతకం చెప్పే పంతులు... కరోనాతో కడతేరాడట. 

• ఇదిగో జొరం అంటే...అదిగో కరోనా అన్నట్లు. 
• ఆసుపత్రికెళ్ళి బరువు చూసుకున్నా... కరోనా అనే అంటారు.
• ఇచ్చుకొంటినమ్మ బనానా... పుచ్చుకొంటినమ్మ కరోనా అన్నట్లు. 
• కరోనా.... సంచార పురుష లక్షణం 

• తిరుగుబోతుకి లేని గుట్టు కరోనాకెందుకు?
• పోలీసు దెబ్బలు తప్పినా కరోనా దగ్గులు తప్పవు. 
• కథకు కాళ్ళు లేవు, కరోనాకు కళ్ళు లేవు.
• అత్తకు మెత్తన, కరోనాకు మంచీ లేవు. 
• కరోనా ఏల వచ్చెరా కనకలింగమా అంటే....తిరిగి చెడ్డ ఫలితంరా తిరుపలింగమా అన్నాట్ట. 
• కరణాన్ని, కరోనా పేషంటుని కాటికి పోయినా నమ్మరాదు. 
• కాలం, కర్మం కలిసి రాకపోతే కమలబాంధవుడికైనా కరోనా తప్పదు. 
• ముక్కు వంకర... మాస్కు తీరుస్తుంది.
• పిండి కొద్దీ రొట్టె, పుణ్యం కొద్దీ పురుషుడు, తిరుగుడు కొద్దీ కరోనా.
• అత్త పోరు, మామ పోరు కరోనా తీర్చిందట. 

• మొదలే చప్పిడిముక్కు, దానికి తోడు కరోనా...
• హోమ్ క్వారంటైన్ కి ఎక్కువ ఐసోలేషన్ సెంటర్ కి తక్కువ.

• అంబులెన్సు ఎక్కరా మామా అంటే...విండో సీటయితేనే ఎక్కుతా మావా అన్నాట్ట.
• కరోనా కథంతా విని అది కాళ్ళకి వచ్చే జబ్బా అనడిగాట్ట.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు