కమ్యూనిస్టు మేనిఫెస్టో సందేశం


కమ్యూనిస్టు మేనిఫెస్టో యొక్క 177 వ వార్షికోత్సవ సందర్భంగా మేనిఫెస్టో మనకు ఇస్తున్న సందేశం ! 
------------------------------------------------------

కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రచురించిన అన్ని పత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన పత్రం కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో . ఇది 177 సంవత్సరాల క్రితం ప్రచురించబడింది. దీని రచయితలు కార్ల్ మార్క్స్ - ఫ్రెడరిక్ ఎంగెల్స్ లు. యూరోప్ లో ప్రజాతంత్ర విప్లవ పోరాటాలు ప్రజ్వరిల్లుతున్న సందర్భంలో ఈ మ్యానిఫెస్టో కమ్యూనిస్టు లీగ్ అధ్వర్యంలో 1848 ఫిబ్రవరి 21 న ప్రచురింపబడింది.
 
 సోషలిజం లేదా కమ్యూనిజం గురించిన ఆలోచనలు మార్క్స్ - ఎంగెల్స్‌ లతోనే ప్రారంభం కాలేదు. వారికి ముందు, సమిష్టి ఆస్తిపై ఆధారపడిన వర్గరహిత సమాజం గురించి ఆలోచనలు చేసిన సమర్ధించిన గొప్ప ఆలోచనాపరులు కూడా ఉన్నారు: తొలి క్రైస్తవులు ప్రైవేట్ ఆస్తి లేని సమాజాల గురించి కలలు కన్నారు. 16వ శతాబ్దంలో థామస్ మోర్, 18వ శతాబ్దంలో బెబూఫ్,, మొరెల్లి, మాబ్లిలు 19వ శతాబ్ది ప్రారంభంలో రాబర్ట్ ఓవెన్, ఫోరియర్, సెయింట్ సైమన్ లాంటి గొప్ప ఆలోచనాపరులు దోపిడి-పీడన, అసమానతలు లేని సమ సమాజానికి చెందిన ఊహాజనిత సిద్ధాంతాలు, పథకాలు ప్రతిపాదించారు. అయితే ఈ ఊహాజనిత సోషలిస్టుల పథకాలు కొంత ప్రచారానికి, అవకాశం ఉన్నచోట్ల కొన్ని ఆదర్శ ప్రయోగాలకు పరిమితమైనవి మాత్రమే , కాని ఆ ప్రచారము, ప్రయోగాలు చరిత్ర శాస్త్రంపై, సామాజిక అభివృద్ధి నియమాల జ్ఞానంపై ఆధారపడినట్టివి కావు.

ఊహాజనిత సోషలిస్టులకు భిన్నంగా మ్యానిఫెస్టోలో మార్క్స్ - ఏంగెల్స్ ల వివరణలు , అంచనాలు యాదృచ్చికమైనవి కావు , ఊహాజనితమైనవి కావు. మార్క్స్ - ఏంగెల్స్ లు మానవ సమాజ చరిత్రను శాస్త్రీయ దృక్పథం పై ఆధారపడి చరిత్రకు సంబంధించిన పరిణామ క్రమాన్ని, మార్పులను వివరించారు. మార్క్స్ - ఏంగెల్స్ ల యొక్క ఈ శాస్త్రీయ దృక్పథం గతితార్కిక భౌతికవాద పద్ధతి నుండి ఉద్భవించింది, దీనిని చారిత్రక భౌతికవాదం అని పిలుస్తారు. దీనితో చరిత్రకు శాస్త్రీయ పునాది సమకూరింది. చరిత్రకు చెందిన ఈ భౌతిక వాద గతితర్క సిద్ధాంతాన్ని మార్క్స్ - ఏంగెల్స్ లు హోలీ ఫ్యామిలీ మరియు జర్మన్ ఐడియాలజీ వంటి రచనలలో అప్పటికే వివరించి వుండినారు.
మానవ జీవితావసరాలైన ఆహారము తదితర అన్ని వస్తువుల ఉత్పత్తి, వాటి మారకమే అంటే ఆర్థిక వ్యవస్థలే సామాజిక వ్యవస్థల ఉనికికి పునాది అనే చరిత్రను గురించిన భౌతికవాద సిద్ధాంతాన్ని మార్క్స్ ఏంగెల్స్ లు ఆవిష్కరించారు. ఆదిమ సమాజం తప్ప చరిత్రలో ఆవిర్భవించిన ప్రతి సామాజిక వ్యవస్థలోనూ వస్తు సంపదలు ఎలా ఉత్పత్తి చేయబడుతున్నాయో ఎలా మార్పిడి జరుగుతున్నాయో, అంటే ఉత్పత్తి సాధనాలపై ప్రైవేటు యాజమాన్యం, అదే సమయంలో ఉత్పత్తి క్రమంలో మానవుల మధ్య ఏర్పడే ఉత్పత్తి సంబంధాలు సమాజం పీడిత - పీడక వర్గాలుగా విభజింపబడడానికి, దోపిడి -పీడనలకు మూలమవుతుందని చెప్పారు. అంటే ఈ వర్గాలు ఉత్పత్తి పద్ధతుల నుంచి, మారకపు విధానం నుండి సంక్షిప్తంగా చెప్పాలంటే సమాజాల ఆర్థిక పరిస్థితుల నుంచి ఉత్పన్నమయ్యాయని, ఆర్థిక వ్యవస్థే సమాజానికి నిజమైన పునాది అని మార్క్స్ - ఏంగెల్స్ లు కనుగొన్నారు. ఆ పరస్పర విరుద్దమైన వర్గ సంబంధాలతో కూడిన ఆర్థిక వ్యవస్థల పునాది పైనే ఇంతవరకు సామాజిక వ్యవస్థలు నడిచాయన్నారు. ఈ వర్గ సమాజాలలో ఉత్పత్తి పద్ధతుల్లోనూ, మారక పు పద్ధతుల్లోనూ వచ్చే మార్పులు , కొనసాగే దోపిడీ - పీడనలు వివిధ రూపాల్లో అన్ని రంగాల్లో వర్గ పోరాటాలకు కారణమవుతాయి . ఈ వర్గ పోరాటాలే సాంఘిక ఆర్థిక రాజకీయ మార్పులకు ,అంతిమంగా సామాజిక విప్లవాలకు దారితీస్తాయని వాటి ఫలితంగా పాత సామాజిక వ్యవస్థలు ఉనికి నుండి పోయి కొత్త సామాజిక వ్యవస్థలు ఉనికిలోకి వస్తాయని చారిత్రిక భౌతిక వాదం నిర్ధారించింది. ఈ వాస్తవాన్ని మార్క్స్ - ఏంగెల్స్ లు అప్పటికే తమ రచనలలో నిర్ధారించి ఉండినారు. ఆ పునాది పైన కమ్యూనిస్టు మేనిఫెస్టో "ప్రస్తుత సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రే" అని ప్రసిద్ధ పదబంధాలలో చాటి చెప్పింది.
  
మ్యానిఫెస్టో మొదట ప్రచురించబడిన నలభై సంవత్సరాల తర్వాత - 1888 జనవరిలో, ఎంగెల్స్ మ్యానిఫెస్టో ఇంగ్లీషు ప్రచురణకు ముందుమాట రాశారు. అందులో మానిఫెస్టో ప్రాధాన్యత ప్రభావం గురించి ఎంగెల్స్ ఇలా చెప్పారు:

"మ్యానిఫెస్టో మా ఇద్దరి సమిష్టి రచన. అయితే , అందులో కేంద్రంగా వుండే ప్రాథమిక ప్రతిపాదన మాత్రం మార్క్స్ దేనని నేను చెప్పడం నా విధి . ఆ మౌలిక ప్రతిపాదన ఏమంటే: ప్రతి చారిత్రక యుగంలో, ప్రబలంగా ఉన్న ఆర్థిక ఉత్పత్తి మరియు మారకపు విధానం మరియు దాని నుండి అవశ్యకంగా ఉద్భవించిన సామాజిక నిర్మాణం , ఆ దశకంతకు పునాదిగా వుంటుంది. ఆ పునదిపై , కేవలం దాని నుండి మాత్రమే వివరించడానికి వీలైనట్టి ఆ దశ యొక్క రాజకీయ-మేధో చరిత్ర ఆధారపడి వుంటుంది. తత్ఫలితంగా మానవాళి మొత్తం చరిత్ర అంతా (భూమిపై సమిష్టి యాజమాన్యం కలిగి ఉండే ప్రాచీన ఆదిమ తెగల సమాజాలు రద్దు చేయబడినప్పటి నుండి) వర్గ పోరాటాల చరిత్రే, పీడిత వర్గాలకు పీడకవర్గాలకు మధ్య, పాలిత వర్గాలకు పాలకవర్గాలకు మధ్య పోరాటాల చరిత్రే; . ఈ వర్గ పోరాటాల పరిణామాల పరంపర ఏ దశకు చేరుకున్నాయంటే దోపిడీ చేయబడిన వర్గం, అణచివేయబడిన వర్గం అంటే -శ్రామిక వర్గం దోపిడీ చేసే వర్గమైన పాలకవర్గం నుండి అంటే -బూర్జువా వర్ధం నుండి విముక్తి పొందాలంటే, మొత్తం సమాజం అంతటిని ,మొత్తం దోపిడీ నుంచి, పీడన నుంచి, వర్గ భేదాల నుంచి , వర్గ పోరాటాల నుంచి ఇక ఇది కడపటి సారిగా విముక్తి చేస్తేనే కానీ తాను విముక్తి పొందలేదు ."
 

వర్గ చైతన్యం గల కార్మికులకు, మొదటగా ఒక సరైన కమ్యూనిస్టు అవగాహన , సామాజిక మార్పుకు అవసరమైన సరైన విప్లవ కార్యక్రమం, ఎత్తుగడలు, మరియు కమ్యూనిస్టు ఆలోచనలను కార్మిక వర్గంలోకి తీసుకవెళ్ళే వివిధ సంస్థలు అవసరం . అందుకు వర్గ చైతన్యం గల కార్మికులు తమ వర్గ ప్రయోజనాల సాధనకు మరియు సమాజాన్ని మార్చడానికి వివిధ సామూహిక సంస్థలను నిర్మించాలి . కార్మిక వర్గం యొక్క ప్రాథమిక సంస్థలు అయిన ట్రేడ్ యూనియన్లు , ప్రజా సంఘాలతో ప్రారంభించి, కార్మికులు పాక్షిక ఆర్థిక సాంఘిక రాజకీయ డిమాండ్ల సాధన కోసం పోరాటాలు నిర్మించాలి. కాల క్రమంలో ఆ పోరాటాలు తమ మౌలిక డిమాండ్ల పరిష్కారానికి సరిపోవని చాలవని వారు అర్థం చేసుకునేలా వారి చైతన్యాన్నిపెంచాలి.
ప్రస్తుత పరిస్థితులలో, ఈ క్రమం తప్పనిసరి..పెట్టుబడిదారీ విధానంలో కార్మిక ఉద్యమ పురోగతి కోసం రోజువారీ పోరాటం లేకుండా సోషలిస్ట్ విప్లవం అసాధ్యం. వివిధ రకాల రోజువారి పోరాటాల అనుభవం ద్వారా కార్మికవర్గం తన స్వంత శక్తిని తెలుసుకుంటుంది మరియు ఈ సమాజాన్ని మార్చగల సమస్త శక్తులను సంపాదిస్తుంది.
నేడు వర్గ చైతన్యం గల కార్మికులకు కమ్యూనిస్టు మేనిఫెస్టో ఇచ్చే సందేశం ఇదే. ఈ మార్గాన్ని అనుసరిద్దాం!.

- బత్తిని శ్రీనివాసరావు                         
                                                           ***

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

రూపం మార్చుకుంటున్న ఫాసిజం_ ప్రజాస్వామిక వాదుల కర్తవ్యాలు

2025 వక్ఫ్ (సవరణ) బిల్లు – ముఖ్యాంశాలు: