ఇంజనీరింగ్ మహాద్భుతం పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టుపై 1942లో బ్రిటిష్ పాలకులు తొలి ఆలోచన చేశారు. అయ్యంగార్ అనే చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్టు కోసం తొలిసారి కృషి చేశారు. అమెరికా నుంచి 'కార్న్ టెరిజాగీ' తోపాటు మరికొందరు ఇంజనీరింగ్ నిపుణులు గోదావరిపై డ్యామ్ ను ఎక్కడ కట్టాలో పరిశీలించారు. ఇప్పుడున్న డ్యామ్ సైట్ నుంచి వందమీటర్ల దిగువన నిర్మాణానికి అనుకూలంగా ఉందని సూచించారు. అవన్నీ ఆలోచనల దశలోనే ఆగిపోయాయి.
స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ... ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఈ ప్రాజెక్టును చేపట్టలేకపోయారు.
తరువాత ఈ ప్రాజెక్ట్ ని కార్యరూపం తీసుకు వచ్చి
ప్రారంభించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కే చెందుతుంది.అయితే అప్పట్లో కాలువల నిర్మాణం మాత్రమే జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణం మొదలు కాలేదు.
నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత బాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కొనసాగించింది.బాబు ప్రభుత్వం తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కూడా దానిని కొనసాగిస్తున్నారు. త్వరలో దానిని పూర్తి చేసే పనిలో ఉన్నారు.
నిర్మాణం, డిజైన్లో అనేక ప్రత్యేకతలు.. ప్రవాహానికి అడ్డుగా మట్టి, రాతి కట్ట
మరోవైపున ప్రాజెక్టు స్పిల్ వే.. దేశంలోనే తొలి... భారీ డయాఫ్రం వాల్
80 అడుగుల నుంచి స్పిల్వే కాంక్రీట్.. భౌగోళిక సమస్యలకు కొత్త పరిష్కారం.
నాడు నింగి నుంచి గంగను భువికి తెప్పించేందుకు భగీరథుడు తపస్సు చేశాడు. పట్టువదలకుండా ప్రయత్నించి, దేవదేవులనే ఒప్పించి అనుకున్నది సాధించాడు! పుడమిని పునీతం చేశాడు!
అక్కడ మహా యజ్ఞం జరుగుతోంది! నీటిని నిలిపేందుకు కొండలు బద్దలవుతున్నాయి! పుడమికి పచ్చటి హారతి పట్టేందుకు దారులు సిద్ధమవుతున్నాయి! కోరలు తొడిగిన యంత్రాలు విరామమెరుగకుండా శ్రమిస్తున్నాయి! రేపటి వెలుగుల కోసం అక్కడ వేలాది మంది స్వేదం చిందుతోంది! దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని స్థాయిలో ఇంజనీరింగ్ అద్భుతం జరుగుతోంది!
ఇటీవల ఆగష్టు 2020న కురిసిన వర్షాలకు గోదావరి నదికి ఎంతో ఉదృతంగా 21లక్షల క్యూసెక్కుల నీటి వరద వస్తున్నప్పటికీ అంతే స్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్( ఎం ఈ ఐ ఎల్) సంస్థ చేస్తోంది. సాధారణంగా వరదలు వచ్చినప్పుడు నదుల్లో నిర్మాణ పనులు నిలిపివేస్తారు. కానీ పోలవరంలో ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించ డంతో భారీ వదరల్లోనూ పనులను నిలిపివేయ కుండా యధావిధిగా కొనసాగిస్తున్నాయి.
నవ్యాంధ్రకు జల-జీవ నాడి!
రాష్ట్రంలోని అన్ని పరివాహక ప్రాంతాలను తడిపేంత స్థాయి! వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా... కళ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి ఇది తెర దించుతుంది.
రాష్ట్రం చివరనున్న అనంతపురం నుంచి పైనున్న శ్రీకాకుళం దాకా దాదాపు అన్ని నదీ బేసిన్లకు అదనపు ప్రయోజనం కలిగించే బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది.
వెరీ వెరీ స్పెషల్.
ఏ ప్రాజెక్టుదైనా ఒకటే శైలి. నది ప్రవాహానికి అడ్డుగా ఆనకట్ట కడతారు. నీటిని నిలుపుతారు. అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు వైపులా రాయి లేదా మట్టితో కట్ట పోస్తారు. నాగార్జున సాగర్ నిర్మాణం ఇలాంటిదే.
శ్రీశైలం ప్రాజెక్టుకు ఇలా కట్టలు పోయాల్సిన అవసరం రాలేదు. ప్రధాన ప్రవాహంపై రెండు కొండల మధ్య ఆనకట్ట కట్టారు. కానీ...
పోలవరం నిర్మాణ శైలే ప్రత్యేకం. గేట్లతో కూడిన ప్రధానమైన ఆనకట్ట (స్పిల్వే)ను నది ప్రవాహంపై కాకుండా పక్కన నిర్మిస్తున్నారు. నది ప్రవాహంపై రాళ్లు, మట్టి, కాంక్రీట్తో కూడిన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్) నిర్మితమవుతుంది. నదీ ప్రవాహాన్ని ఇదే అడ్డుకుంటుంది. అక్కడ నిండే నీరు చుట్టూ విస్తరించి, నిలుస్తుంది. పక్కనే ఉన్న స్పిల్వేనూ తాకుతుంది.
నీటి విడుదల అక్కడి నుంచే జరుగుతుంది. అక్కడ విడుదలైన నీరు కిలోమీటరు పాటు ప్రవహించి అసలైన ప్రవాహంలో కలుస్తుంది. అంటే... ఇక్కడ నదీ ప్రవాహాన్నే మారుస్తున్నారన్న మాట!
ప్రవాహంపై రాక్ఫిల్ డ్యామ్ కట్టడం ఎందుకు?
గోదావరి లోతుకు వెళ్లేకొద్దీ ఇసుకే! ప్రవాహ ప్రాంతంలో గరిష్ఠంగా 150 మీటర్లు ఇసుకే ఉంది. ఇక్కడ స్పిల్వే నిర్మించాలంటే రాయి వచ్చేదాకా వెళ్లి అక్కడి నుంచి కాంక్రీటు నిర్మాణం మొదలుపెట్టాలి. ఇది అసాధ్యం! అందుకే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు.
భూగర్భంలో ఇసుక ఉన్న చోట ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించి స్పిల్వేను పక్కకు మార్చారు.
ఇదే పోలవరం డిజైన్లో ప్రత్యేకత!
ప్రవాహానికి అడ్డుగా ‘కొండ’
ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్... ఇది నదీ ప్రవాహానికి అడ్డంగా 1750 మీటర్ల పొడవు, 41 మీటర్లు ఎత్తు ఉంటుంది. కింది భాగంలో 300 మీటర్ల వెడల్పులో నిర్మిస్తారు. పైన 30 మీటర్లు ఉంటుంది.
అంటే... నదీ ప్రవాహానికి 1.75 కిలోమీటర్ల పొడవున ఒక కొండనే అడ్డు వేస్తారన్న మాట. ఈ అడ్డుకట్టే నీటిని నిలిపి ఉంచుతుంది. ఇది గరిష్ఠంగా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఉంటుంది.
గోదావరిపై ఇప్పటిదాకా వచ్చిన గరిష్ఠ వరద 30 లక్షల క్యూసెక్కుల లోపే!
ప్రాజెక్టులో భారీ స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు ఆ ప్రాంతంలో భూమిపై ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల స్వల్పస్థాయిలో ప్రకంపనలు రావొచ్చు. అందుకే... భూగర్భంలో వేసే కాంక్రీట్కు ‘ప్లాస్టిసిటీ’ లక్షణాలు ఉండేలా ‘బెంటనైట్ క్లే’ అనే రసాయనాన్ని కలుపుతున్నారు.
వేగానికి నిదర్శనం...
చైనాలోని త్రీగార్జె్సలో గరిష్ఠంగా రోజుకు 7000వేల క్యూబిక్ మీటర్ల పని జరిగింది.
పోలవరం ప్రాజెక్టులో రోజుకు 10వేల క్యూబిక్ మీటర్ల పని జరగనుంది. హెడ్ వర్క్స్లో మొత్తం 1055 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగాల్సి ఉంది. ఇప్పటికి 717 లక్షల క్యూబిక్ మీటర్లు, అంటే 68 శాతం పని పూర్తయింది. గంటకు 250 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కలిపే బ్యాచింగ్ ప్లాంట్లు మూడు ఉన్నాయి.
ప్రాజెక్టులో వినియోగిస్తున్న మొత్తం పరికరాల విలువ రూ.2వేల కోట్లు. ఈ ఖర్చుతో మధ్య తరహా ప్రాజెక్టునే నిర్మించవచ్చు. ప్రాజెక్టులో గంటకు 1750 టన్నుల క్యూబిక్ మీటర్ల కంకర కొట్టే యంత్రాలున్నాయి. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నారు.
ఏ నిర్మాణ ప్రాజెక్టుకైనా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవు. అయితే, పోలవరం పనులు మాత్రం ఎండకాసినా, వాన కురిసినా ఆగవు. వర్షాకాలంలో స్పిల్వే నిర్మాణ ప్రాంతంలో చేరే నీటిని తోడి, నదిలో కలిపేందుకు 350 హెచ్పీ మోటర్లను ఉపయోగిస్తున్నారు. గట్టున ఉండే 200 మీటర్ల వరకు కాంక్రీట్ను తీసుకెళ్లి వేయగల ‘ఫుడ్జ్ మిస్టర్’ టెలీబెల్ట్ యంత్రాన్ని ప్రత్యేకంగా తెప్పించారు. అలాగే 130 మీటర్ల దూరం వరకు కాంక్రీట్ను వేయగల యంత్రాలూ ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో 3, 4 వేల మంది పని చేస్తున్నారు. ఒక దశలో ఇది 10వేల మందికి చేరుతోంది. అంటే... ఒక మోస్తరు ఊరే ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమవుతుందన్న మాట!
కాఫర్ డ్యామ్
పోలవరం నిర్మాణంలో మరో ప్రత్యేకత కాఫర్ డ్యామ్.
రాక్ఫిల్ డ్యామ్ పనులు జరిగేందుకు నదీ ప్రవాహాన్ని పక్కకు మళ్లించేందుకు తాత్కాలికంగా కాఫర్ డ్యామ్ను నిర్మిస్తారు. పోలవరం ప్రాజెక్టులో వచ్చే ఏడాదికి కాఫర్ డ్యామ్ ద్వారానే నీటిని మళ్లించి.. గ్రావిటీ ద్వారా కుడి కాలువకు నీరు అందించాలనే యోచన.
ప్రాజెక్టు అవసరాల దృష్ట్యా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కిందివైపున కూడా మరో కాఫర్ డ్యామ్ నిర్మించాల్సి వస్తోంది.
కూల్ కూల్
ఒక చిన్న ఇంటికి స్లాబ్ వేస్తే 20 రోజులు క్యూరింగ్ చేయాలి. రసాయన చర్య ఫలితంగా కాంక్రీట్ నుంచి ఉష్ణోగ్రత వెలువడి, చీలికలు/పగుళ్లు/బీటలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
మరి... లక్షల క్యూబిక్ మీటర్ల కాంకీట్ర్ పని జరిగే పోలవరంలాంటి ప్రాజెక్టుల మాటేమిటి? ప్రతి 3మీటర్ల కాంక్రీట్కు అన్నేసి రోజులు క్యూరింగ్ చేసుకుంటూ వెళితే... ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడు? అందుకే... ప్రత్యేకమైన ‘కూలింగ్ టెక్నాలజీ’ ఉపయోగిస్తున్నారు.
ఇందులో భాగంగా.
కాంక్రీట్ను 12 నుంచి 15 డిగ్రీల వరకు చల్లార్చు తారు. దీనికోసం కాంక్రీట్ మిక్సింగ్ సమయంలోనే మంచు ఫలకాలను (ఫ్లేకీ ఐస్) పంపిస్తారు. లిక్విడ్ నైట్రోజన్తోనూ కాంక్రీట్ను చల్లబరుస్తారు. దీని కోసం
2 ప్లాంట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
పర్యాటకానికి మరింత ప్రభ
పోలవరం నిర్మాణం తర్వాత పాపికొండలు మునిగిపోతాయన్నది అపోహ మాత్రమే!
పోలవరం ప్రాజెక్టుకు దిగువన 40 కి.మీ. దూరాన రాజమండ్రి ఉంది. ఆరు కి.మీ. ఎగువన పాపికొండలు ఉన్నాయి. పాపికొండల ఎత్తు సముద్ర మట్టం నుంచి 240 మీటర్లు. పోలవరంలో పూర్తి నిల్వ స్థాయి (ఎఫ్ఆర్ఎల్) 40 మీటర్లు మాత్రమే! పోలవరం నిర్మించినా పాపికొండల విహార యాత్ర ఆగదు. అంతేకాదు, పోలవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. పర్యాటకుల పడవలు డ్యామ్ను అటూ ఇటూ దాటేందుకు ‘పనామా కాల్వ’ తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. స్పిల్వే నుంచి జారి పడే గోదావరి జలాల అందాలను సమీపం నుంచి చూసేందుకు వీలుగా దేశంలోనే అతి పెద్ద సస్పెన్షన్ కేబుల్(ఐకానిన్) బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు..
చేపలకోసం ప్రత్యేక దారి
గోదావరి నదికి అడ్డుకట్ట వేసేస్తే గోదావరిలో ప్రత్యేకంగా లభించే ‘పులస’ వంటి మత్స్య సంపద ఏమైపోవాలి?
ఇలాంటి అనుమానాలు అందరికీ వచ్చేవే!
మత్స్య సంపదకు ఏ మాత్రం నష్టం జరగకుండా.. చేపలు, ఇతర జల చరాల కోసం ప్రత్యేక మార్గాన్నీ పోలవరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ‘ఫిష్ లేడర్’ అంటారు.
దీని డిజైన్ను కేంద్ర జల వనరుల సంఘం రూపొందించింది. ఈ నిర్మాణం లేకుంటే అటవీ, పర్యావరణ శాఖ అసలు ప్రాజెక్టు నిర్మాణానికే అనుమతి ఇవ్వదు.
‘పవర్’ఫుల్ హౌస్
పోలవరం ప్రాజెక్టులో భాగంగా 969 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. దీని నిర్మాణ బాధ్యత 'జెన్కో'కు ప్రభుత్వం అప్పగించింది.
రాళ్లు, మట్టి పోస్తే సరిపోదు::!
మట్టి, రాళ్లు, కాంక్రీటును కుప్పగా వేసేస్తే.. కింది నుంచి ఇసుక జారి పోతుంది. పైనున్న కట్ట కుంగిపోతుంది. అది జరగకుండా ఉండాలంటే రాక్ ఫిల్ డ్యామ్ దిగువ నుంచి చుక్క నీరు అటువైపు వెళ్లకూడదు. పైనే కాదు, భూగర్భంలోనూ నీటి ప్రవాహాన్ని నిలిపి వేయాలి. దీనికోసం పైనుంచి భూగర్భంలో రాయి వచ్చేదాకా లోపలికి వెళ్లి ఒక కాంక్రీట్ గోడ కట్టాలి. అదే 'డయాఫ్రం:వాల్. ప్రాజెక్టులో స్పిల్వే ఎంతకీలకమో డయాఫ్రంవాల్ అంతే కీలకం!
చకచకా గేట్లు.
సహజంగా కాంక్రీట్ పని మొత్తం పూర్తయ్యాక రేడియల్ గేట్ల తయారీ మొదలుపెడతారు.
కానీ... ప్రాజెక్టు పూర్తిపై నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటి నుంచే గేట్ల తయారీ మొదలుపెట్టింది. ఒక్కో గేటు పొడవు 20 మీటర్లు. వెడల్పు 15 మీటర్లు. మొత్తం 48 గేట్లలో 26 ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరో మూడు తయారవుతున్నాయి.
స్కిన్ప్లేట్తో కలిపి ఒక్కో గేటు బరువు 90 టన్నులు. ఇతరత్రా సపోర్ట్స్తో కలిపి, వీటిని స్పిల్వేకు అమర్చే సరికి ఈ బరువు 325 టన్నులకు చేరుతుంది.
గేట్లను ఆపరేట్ చేసేందుకు ‘హైడ్రాలిక్’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తారు.
జర్మనీ యంత్రంతో ‘డయాఫ్రం’
మనదేశంలో ఇప్పటిదాకా ఎక్కడా, ఏ ప్రాజెక్టుకూ బాగా లోతుగా వెళ్లి డయాఫ్రం వాల్ నిర్మించాల్సిన అవసరం రాలేదు. ఈ పని చేయడంలో జర్మనీకి చెందిన ‘బావర్’ దిట్ట.
అందుకే... ‘ఎల్అండ్టీ-బావర్’కు డయాఫ్రం వాల్ నిర్మాణం పని అప్పగించారు. ఇందుకు ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు. కోరల చక్రాలున్న ఈ యంత్రం ఇసుకను తోస్తూ, భూమిని కోస్తూ లోపలికి దూసుకెళ్తుంది. అలా రాయి వచ్చేదాకా వెళ్తుంది. రాతిని కూడా రెండు మీటర్లపాటు కోసి... అక్కడి నుంచి కాంక్రీట్ వేస్తూ వెళుతుంది. ఈ సమయంలో వచ్చే ఇసుక, మట్టి, చిన్నచిన్న రాళ్లను పైపుల ద్వారం దూరంగా వేసేస్తుంది. ఇదంతా ఏకకాలంలో జరుగుతుంది. వెరసి... ఈ భారీ యంత్రం భూగర్భంలోనే ఐదు అడుగుల వెడల్పుతో భారీ కాంక్రీటు గోడను కడుతుంది.
భూగర్భంలో డయాఫ్రం వాల్! ఎగువన... ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్! ఇక... ఒక్క చుక్క కూడా ఇటు నుంచి అటు వైపునకు ఇంకదు, వెళ్లదు! అడ్డుకట్ట భద్రంగా ఉంటుంది.
మహా స్పిల్ వే
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే పొడవు 1150 మీటర్లు.
దీని నిర్మాణం ఒక మహా యజ్ఞం. భూమి పై నుంచి గట్టి రాయి వచ్చేదాకా తవ్వి, ఆ రాయినీ మరింత తొలిచి... అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ వస్తారు.
ప్రాజెక్టుకు ఒకవైపున తక్కువ లోతులోనే రాయి వచ్చింది. కుడివైపున మాత్రం 80 అడుగులు కిందికి వెళ్లాల్సి వచ్చింది.
అంటే... దిగువకు ఎనిమిది అంతస్తులు తవ్వి, అక్కడి నుంచి కాంక్రీట్ పని చేస్తూ వస్తున్నారు. మరింత కింద కూడా రాళ్ల మధ్య ఎలాంటి ‘గ్యాప్స్’ ఉన్నా పూడ్చేందుకు... రంధ్రాలు వేసి ‘జెట్ గ్రౌటింగ్’ ద్వారా సిమెంటు పంపిస్తున్నారు.
ఇసుకను మజ్జిగ కవ్వంలా చిలికినట్లు పక్కకు నెట్టేసి... సిమెంటును పంపే ‘ఇంపెరియస్ జెట్ గ్రౌటింగ్’ కూడా చేస్తున్నారు. ఈ గ్రౌటింగ్ రంధ్రాలను ప్రతి ఆరు మీటర్లకు ఒకటి చొప్పున వేస్తున్నారు. జర్మనీకి చెందిన 'కెల్లెర్' సంస్థ ఈ పని చేస్తోంది.
స్పిల్వేపై మొత్తం 48 గేట్లు ఉంటాయి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం పనులు ఒకేసారి జరుగుతున్నాయి.
స్పిల్వే నుంచి విడుదలయ్యే నీరు వేగంగా, బలంగా దూసుకొస్తుంది. ఆ నీరు పడే చోట భారీ కాంక్రీట్ బెడ్స్ను కూడా ఇప్పటి నుంచే నిర్మిస్తున్నారు.
Highlights of పోలవరం.
గరిష్ట నీటి మట్టము :
+ 45.72 మీటర్లు (+ 150.00 అడుగులు)
క్రెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిల్ వే :
+ 25.72 మీటర్లు (+84.39 అడుగులు)
ఈసీఆర్ఎఫ్ డ్యాం టాప్ బండ్ లెవెల్ :
+ 54.00 మీటర్లు (+177.16 అడుగులు)
గ్రాస్ స్టోరేజ్ ఆఫ్ రిజర్వాయర్ :
194.60 టీఎంసి
లైవ్ స్టోరేజ్ : 75.20 టీఎంసి
ప్రాబబుల్ మ్యాగ్జిమమ్ ఫ్లడ్ డిశ్చార్జ్ :
50 లక్షల క్యూసెక్కులు
క్యాచ్ మెంట్ ఏరియా : 3,06,643 చ.కి.మీ
సబ్ మెర్జెన్స్ ఏరియా : 601 చ.కి.మీ
పోలవరంతో లాభాలు
960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి,
గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీటి మళ్లింపు.
2.91 లక్షల హెక్టార్లు (7.2 లక్షల హెక్టార్లు)కు సాగునీరు అందించొచ్చు..
విశాఖ నగరవాసుల తాగునీటి కోసం 23.44 టీఎంసీల కేటాయింపు..
540 గ్రామాలు (28.5 లక్షల మంది ప్రజలకు) తాగునీటి సౌకర్యం,
చేపల పెంపకం,
పడవలతో రవాణా మార్గానికి అవకాశాలు
ఒడీషా, చత్తీస్ ఘడ్ లకు 5 టీఎంసీలు, 1.5 టీఎంసీల నీటి సరఫరా.
కుడి కాలువ : 174 కిలోమీటర్ పొడవైన ఈ కాలువ ద్వారా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 3.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. ఇదే కాలువ ద్వారా గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టీఎంసీల నీళ్లు మళ్లిస్తారు.
ఎడమ కాలువ : 181.5 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఎడమ కాలువ ద్వారా.. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారు.
పోలవరానికి 2014 అంచనాల ప్రకారం 58139 కోట్లు ఎందుకు??
222 మండలాలు,
371 జనావాసాలు,
ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాల సంఖ్య 98818 ,
2,00,000 పైగా నిర్వాసితులు,
వేల ఇండ్లు,
లక్షల ఎకరాలు..
నాడు ఎకరానికి 1,50,000, ఇంటికి 1,00,000 చొప్పున మొత్తం 2,000 కోట్లు ప్రకటించి 5,000 కోట్లతో మురుగు కాలువలు తవ్వితే...
నేడు ఎకరానికి 10,65,000, ఇంటికి 6,75,000 వేలు, వారి పునరావాసపు వసతి, మౌళిక సదుపాయాల కోసం 3000 కోట్ల చొప్పున మొత్తం 33,858 కోట్లు..
కాలువల బాగుకు, ఆర్దిక సర్దుబాట్లకు, ప్రపంచ ప్రసిద్ది చెందిన ఇంజినీరింగ్ వర్క్స్ కి మొత్తం ప్రాజెక్టు రూ.24,461 కోట్లు...
ఈ మహా యజ్ఞాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అసమాన్యం, చిరస్మరణీయం.
ఇవండి మన కలల పోలవరం వివరాలు.
2 ఏళ్లలో పోలవరం పరుగులుపెట్టిందిలా....
* 2019నవంబర్ 8న MEIL చేతికి పోలవరం ప్రాజెక్టు పనులు
*21-11-2019లో ప్రాజెక్టు స్పిల్ వే ''O'' బ్లాకు వద్ద కాంక్రీట్ పనులు
* ఫిబ్రవరి-17-2020 న గడ్డర్ల నిర్మాణ పనులు
* 2020 జూలై-6 స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల అమరిక మొదలు
* 2020 ఆగష్ట్-19న వరదలోనూ స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ కాంక్రీట్ పనులు
* 2020సెప్టెంబర్ 09న స్పిల్ వే బ్రిడ్జి శ్లాబ్ కాంక్రీట్ పనులు ప్రారంభం
* 2020నవంబర్-12నాటికి 2లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి
* 2020 డిసెంబర్-17న స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక పనులు
* 2021 ఫిబ్రవరి-11న నాటికి స్పిల్‌వే లోని 52 పిల్లర్లు 52మీటర్ల ఎత్తు నిర్మాణం పూర్తి
* 2021 ఫిబ్రవరి-20న స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు అమర్చడం పూర్తి
* 2021ఫిబ్రవరి-22న స్పిల్ వే రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక పనులు
* 2021ఫిబ్రవరి-26న స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తి
* 2021మార్చి-25న స్పిల్ వే రేడియల్ గేట్ల ట్రయల్ రన్ విజయవంతం.
* 2021మే-27న ఎగువ కాఫర్ డ్యాం అన్ని గ్యాప్‌లను పూడ్చి నదికి అడ్డుకట్ట
* 2021జూన్ 11న అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే వైపు గోదావరి మళ్లింపు
* 2021జూన్-23న రేడియల్ గేట్లు అమర్చిన తరువాత స్పిల్ వే నుండి గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
Comments
Post a Comment