ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా... విజ్ఞాన సుగంధం



📚📙📘📗📒📕📔📓📗📕📖

           ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.
           - మహాత్మగాంధీ 

ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.
             - నెహ్రు 

మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ 
పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.
         - బెడ్రంట్ రసెల్ 

మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.
          - ఆల్బర్ట్ ఐన్ స్టిన్

ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు 
       -నెల్సన్ మండేలా 

🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం📘 పుస్తకం అన్నారు .పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు  వచ్చి పడ్డాయంటా కానుకగా ఆ  వ్యక్తి 
       - లెనిన్ 

📚 ఒక్కో చిత్రం నటించక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు.
              -చార్లీ చాప్లిన్ 

ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు.
              - విన్ స్టన్ చర్చిల్ 

📚  భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పారు.
            -మార్టిన్ లూథర్ కింగ్

📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి.
                    - భగత్ సింగ్ 

          📖 నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు.
             - అబ్రహం లింకన్ 

📚 వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి, 
            అతడే నా మార్గదర్శి అన్నారు.
           -జూలియస్ సీజర్ 

           🌏 ప్రపంచపటంలో  కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు.
                       -టెస్కార్డ్స్ 

         📘 జీవితం విరక్తి చెందినప్పుడు లేదాకొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు.
              -ఇంగర్సాల్ 

🤸‍♀️వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, అలా 
📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు.
               -సిగ్మెండ్ ఫ్రాయిడ్ 

            పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు.

            ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే. ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి 


    అనుభవాన్ని...జ్ఞానాన్ని ఓ తరం నుంచి మరో తరానికి అందించే సాధనం పుస్తకం. 'మంచి పుస్తకాలు పఠించడం, గత శతాబ్దాల లోని ఉత్తమ వ్యక్తులతో సంభాషించడం వంటిది' అంటాడు ఫ్రెంచి తత్వవేత్త రీనీ డెకార్త్‌. 

దీనికి కొనసాగింపుగా 'కొన్ని పుస్తకాలు రుచి చూడాలి.. కొన్నింటిని మింగేయాలి, కొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలి' అంటాడు ప్రముఖ రచయిత బేకన్‌. మంచి పుస్తకం జ్ఞానాన్ని రంగరించి పెడుతుంది. దాన్ని జీర్ణం చేసుకొని నరనరానికి ఎక్కించుకోవడమే మనం చేయాల్సింది. 

ఆదిమ కాలం నుంచి అంతరిక్ష యానం వరకు మానవ మేధస్సు సృష్టించిన, సృజించిన మహత్తర విషయాలన్నీ పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మానవ చరిత్రలో సంభవించిన, సంభవిస్తున్న మలుపులన్నింటికీ అక్షరాలు సజీవ సాక్ష్యాలు. అందుకే 'మానవ జాతి పురోగమన యాత్రలో పుస్తకాలు మహత్తర పాత్ర పోషిస్తాయంటాడు’ ముల్కరాజ్‌ ఆనంద్‌. 

ప్రపంచ గతిని మార్చిన ఎందరో మహనీయుల జీవితాలను ప్రభావితం చేసిన శక్తి అక్షరం. 'ఫిరంగి వచ్చి ఫ్యూడల్‌ వ్యవస్థను నాశనం చేసింది. సిరా ఈనాటి సాంఘిక వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తుంద'న్న నెపోలియన్‌ వ్యాఖ్యకు సజీవ రూపం, ప్రపంచ చరిత్ర గమనాన్నే మార్చేసిన కారల్‌ మార్క్స్‌ 'పెట్టుబడి' గ్రంథం.

       ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో పుస్తక పఠనం తగ్గుతోంది. కొత్త పుంతలు తొక్కుతోన్న ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా- మన విలువైన సమయాన్ని మింగేస్తోంది. ఏది చదవాల్సివచ్చినా ఆన్‌లైన్‌ లోనే వెదుకుతున్నాం, పుస్తకాలను మర్చిపోతున్నాం. ఈ క్రమంలో చిన్ననాటి నుంచే పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కల్పించాల్సిన అవసరం నేడు ముందుకొచ్చింది. 

ప్రపంచవ్యాప్తంగా 77.4 కోట్ల మంది పుస్తకాలు చదవట్లేదని యునెస్కో సర్వే చెబుతోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా పుస్తకాలు చదివేది భారతీయులేనని ఒక సర్వే తెలిపింది. టీవీ, ఇంటర్నెట్‌ల వినియోగం పెరుగుతున్న నేడు... పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరుగుతుండడం ఆహ్వానించదగ్గ విషయమే.

 అయితే-విలువైన పుస్తకాలను భద్రపరచేందుకు డిజిటలైజ్‌ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అనేక పురాతన విజ్ఞాన గ్రంథాలు, తాళపత్రాలు డిజిటలీకరణకు నోచుకోడం లేదు. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని చాటిన శ్రీకృష్ణదేవరాయల విరచిత 'ఆముక్తమాల్యద' తాళపత్ర గ్రంథం ఇప్పటికీ తంజావూరు లోని సరస్వతి మహల్‌ గ్రంథాలయంలో ఉంది. ఈ తెలుగు గ్రంథాన్ని డిజిటలైజ్‌ చేయాలన్న స్పృహ ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాలేదు. 

వందల ఏళ్లనాటి ఆ తాళపత్రాలను ఫొటో ప్రతులుగా రూపొందించాలన్న మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎనిమిది దశాబ్దాల నాటి ఆకాంక్ష నేటికీ నెరవేరకపోవడం విడ్డూరం. అంతేకాదు తంజావూరు గ్రంథాలయం లోని 778 తెలుగు తాళపత్ర గ్రంథాల్లో ఇప్పటికీ 323 అముద్రితాలు తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. కాగితంపై రాసిన 44 ఒరిజినల్‌ గ్రంథాల్లో, 26 గ్రంథాలు ఇంకా పుస్తక రూపం లోకి రానే లేదు. అంతేకాదు-లండన్‌ లైబ్రరీలో దాదాపు 8 వేల పైచిలుకు తెలుగు పుస్తకాలున్నాయి. వాటిల్లో కొన్ని తెలుగు నేలపై లభించడమే లేదు. వాటిని సైతం డిజిటలైజ్‌ చేసే ఆలోచన లేకపోవడం విచిత్రం. 

కనుమరుగైపోతున్న పుస్తక సంపదను కాపాడుకోవడానికి, భవిషత్తు తరాలకు జ్ఞాన సంపదను అందుబాటు లోకి తేవడానికి యునెస్కో ఏప్రిల్‌ 23ను 'ప్రపంచ పుస్తక దినోత్సవం'గా ప్రకటించింది. ఈ ఆశయం నెరవేరాలంటే, తెలుగు భాషా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించినప్పుడే విలువైన పుస్తకాలు... జాతి సంపదగా మిగులుతాయి.

ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తోంది. ఒక పుస్తకాన్ని చదువుతున్నామంటే.. పరోక్షంగా ఆ పుస్తక రచయితతో మాట్లాడుతున్నామన్నమాటే. అందుకే పుస్తకం ఎన్ని నిర్బంధాలను ఎదుర్కొన్నా.. తరతరాలనూ అలరిస్తోంది.

 స్వాతంత్య్ర పోరాట కాలంలో ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి' పుస్తకాన్ని నిషేధించారు. కమ్యూనిస్టు సాహిత్యంపై ఆంక్షలు విధించారు. సల్మాన్‌ రష్దీ 'శాటనిక్‌ వర్సెస్‌'ను నిషేధించారు. డావెన్సీ కోడ్‌ను అడ్డుకున్నారు. తమిళనాడులో ఒక సాంఘిక దురాచారాన్ని, మూఢనమ్మకాన్ని ఎత్తిచూపుతూ 'వన్‌ పార్ట్‌ వుమెన్‌' (అర్థనారి) పుస్తకాన్ని రాసిన పెరుమాళ్‌ మురుగన్‌పై సంఘ పరివార్‌ శక్తులు తీవ్ర దాడికి దిగడం తాజా పరిణామమే. 

ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు ఎదురైనా అక్షరం..అక్షయం. ఛాందస, మూఢ విశ్వాసాల సంకెళ్ల నుంచి విముక్తి కలిగించి హేతువాద, సశాస్త్రీయ, ప్రగతిశీల చైతన్యాన్ని ఉద్దీపింపజేస్తూనే వుంటుంది. పుస్తక పఠనం ఒక వ్యాపకంగా, ఒక అలవాటుగా బాల్యంలోనే విత్తుకోవాలి. లేదంటే- 'చదువని వాడజ్ఞుండగునని..' పోతన చెప్పినట్లుగా... ఆ తరం అంతా అజ్ఞానంతో, మూఢ నమ్మకాలతో నిండిపోతుంది. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్న కందుకూరి మాటలు మనందరికీ మార్గదర్శకం కావాలి.

vijay pilla
9490122229

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు