కుజగ్రహంపై జీవం కోసం పరిశోధన
మనుషులు తమ ఆధునిక విజ్ఞానంతో ఇంకొక మెట్టు ఎక్కబోతున్నారు. ఇప్పటి వరకు భూమి మీద మాత్రమే జీవాన్ని గమనించిన మనం, ఇప్పుడు mars మీద, అంటే కుజ గ్రహం లేదా అంగారక గ్రహం మీద జీవం కోసం వెతకబోతున్నాం. గతంలో పంపించిన రోవర్ల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా అంగారక గ్రహం పై కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం నీటి సరస్సులు ఉండేవని, 4000 కిలోమీటర్ల పొడవున్న లోయల్లో నదులు, నదుల వ్యవస్థ ఉండేవని తెలుస్తోంది. ఇంత పొడుగున నదీ ప్రవాహ లోయలు భూమి పైన కూడా లేవు.
ఈ నేపథ్యంలో భూమి బయట జీవపరిశోధన (astrobiology)లో భాగంగా NASA వారి *Perseverance రోవర్* 30-జులై 7:50 AM EDT (5:30 PM IST) న రోదసిలోకి దూసుకుపోనుంది. ఏడు నెలల పాటు అంతరిక్షంలో ప్రయాణం చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి లో అంగారక గ్రహం మీదకి చేరుకుని కనీసం ఒక mars year, అంటే 687 భూమి రోజుల పాటు పరిశీలనలు చేయబోతోంది. అక్కడ శాంపిల్స్ సేకరించి భద్రపరుస్తుంది. వాటిని భూమికి తీసుకువచ్చి ఇక్కడ ల్యాబ్స్ లో పరిశోధన చేయాలన్న ప్రణాళిక ఉన్నది. గతంలో చంద్రుడి మీద శాంపిల్స్ తీసుకుని ఇక్కడ ఇలాగే పరిశోధన చేయడం జరిగింది.
ఈ Perseverance రోవర్ తో బాటుగా *Ingenuity హెలికాప్టర్* ని కూడా పంపుతున్నాము. భూమి వాతావరణంకన్నా 99% పలుచగా ఉండే అంగారక గ్రహం వాతావరణంలో ఈ హెలికాప్టర్ ఎగరబోతోంది. సాంకేతికంగా ఇది సాధ్యం అని తెలుసుకునేందుకు ఈ హెలికాప్టర్ ని పంపుతున్నాము. ఎంతో సృజనాత్మకంగా తయారు చేసిన ఈ హెలికాప్టర్ ని ఇంజినీరింగ్ అద్భుతంగా వర్ణిస్తున్నారు నాసా వారు.
ఈ రోవర్ అంగారక గ్రహంపై జెజెరో (Jezero) అనే జంగిడి (crater) ప్రాంతంలో దిగబోతోంది. ఈ క్రేటర్ లో కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం దాదాపు కొల్లేరు సరస్సుకి ఎనిమిది రెట్ల వైశాల్యం ఉన్న సరస్సు ఉండేదని, ఈ సరస్సు కొన్ని నదులకి నీరు అందిచ్ఛేదని మనకి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ క్రేటర్ ప్రాంతంలో డెల్టా తరహాలో డెపాజిట్లు ఉండడం వలన ఇక్కడ పూర్వపు జీవానికి అవశేషాలు దొరకవచ్చని ఈ రోవర్ ఈ ప్రాంతంలో పరిశోధన చేయబోతోంది.
ఈ రోవర్ లో 7 scientific instruments, 2 మైకులు, 23 కెమెరాలు ఉంటాయి. వీటిని 4 దేశాలు తయారు చేసాయి. ఈ mission కి నాలుగు లక్ష్యాలు ఉన్నాయి:
👉 అంగారక గ్రహం పై గతంలో జీవం పుట్టడానికి, పరిణామం చెందడానికి ఉన్న అనువైన వాతావరణ పరిస్థితులని గుర్తించడం.
👉 అంగారక గ్రహం పై గతంలో బ్రతికిన సూక్ష్మ జీవుల ఆనవాళ్లని సేకరించడం, ప్రత్యెకంగా రాళ్లలో ఉన్న అవశేషాలని గుర్తించి వెలికి తీయడం.
👉 అంగారక గ్రహం పై రాళ్ల, మట్టి శాంపిల్స్ సేకరించి భద్రపరచడం
👉 అంగారక గ్రహం పై ఆక్సిజన్ ఉత్పత్తి గురించి పరీక్ష చేయడం. భవిష్యత్తులో మనుషులు అంగారక గ్రహంపైకి వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది.
Comments
Post a Comment