చెప్పడం తప్పు కాదుగా!



ఎవడి బతుకు వాడు బతికేస్తున్నాడు.. పక్కోడు అస్సలు పట్టడు.. ఎంత కాడికీ నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నాను.. నువ్వేం కొనుక్కున్నావు.. నేనేం కొనుక్కున్నానూ వంటి కంపేరిజన్లూ, ఈ భూమ్మీద ఉన్న సంతోషమంతా నువ్వే అనుభవిస్తున్నావన్న ఈర్ష్యా..

చెప్పేవాడు లేక జీవితాలు జీవితాలు నాశనం అవుతున్నాయి. మనం చెప్పినా ఎవడూ వినట్లేదని చాలా కన్వీనియెంట్‌గా చేతులు ఎత్తేసి సినిమాలు చూస్తున్నారు పెద్ద వాళ్లంతా. పెద్దా చిన్నా తేడా లేదు. మనిషికీ మనిషికీ మధ్య గౌరవాలు లేవు. ఎవడిష్టమొచ్చినంత మాటా వాడు అనేస్తాడు. చదువూ, సంస్కారం ఏమీ ఉండవు. మనకన్నా చిన్న వాళ్లకి నాలుగు మంచి మాటలు చెప్పాలన్న థాట్ కూడా ఎవరికీ ఉండదు. ఎంతసేపటికీ మనమూ యూత్‌లా అయిపోదామనే యావ తప్పించి! అబ్బాయిలకూ, అమ్మాయిలకూ పోటీగా అందంగా కనిపించడం కోసం.. అయిపోతున్న వయస్సుని, మనస్సులో పేరుకుపోతున్న ఇన్‌సెక్యూరిటీని కవర్ చేసుకోవడం కోసం వెధవ తాపత్రయాలు తప్పించి!

నువ్వు యూత్‌గా చెలామణి అయ్యే దానికన్నా నువ్వు నీకంటే చిన్న వాళ్ల పట్ల బాధ్యతగా ప్రవర్తించేటప్పుడు వచ్చే respect ఎక్కువ. ఎన్ని పూసుకున్నా.. ఎంత కవర్ చేసుకున్నా ఇంత లావు పొట్టా.. మొహంలో ముడతలూ ఎక్కడికీ పోవు. అస్సలు ఇవి కాదు పెద్ద వాళ్లు చేయాల్సింది. బయట జీవితాలు నాశనం అవుతున్నాయి. నీ చుట్టూ ఉన్న పదిమందికి కాస్త కూర్చోబెట్టి ఏది మంచో ఏది చెడో చెప్పు. నీ మాట వినకపోయినా ఫర్లేదు. హర్ట్ అవ్వకు.. ఇగో ఫీలవ్వకు. తల్లిదండ్రులుగా పిల్లలకు పోటీగా అందంగా తయారవడం బానే ఉంటుంది.. అంత ట్రెండీగా ఉండడంతో పాటు.. లేటెస్ట్ జనరేషన్‌తో పోటాపోటీగా ఉండడంతో పాటు కాస్త మీరు చూసిన జీవితం గురించి.. సమాజం, విలువలూ.. జీవితం పట్ల respect, కష్టపడే తత్వం ఇలాంటివి చెప్పండి. నష్టమేం లేదు. విన్నా వినకపోయినా చెప్పండి.

చిన్న వయస్సులోనే చనిపోతున్నారు.. అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు.. తాగి తందనాలాడి మనుషుల్ని గుద్ది, డివైడర్లని గుద్ది చంపుతున్నారు.. చస్తున్నారు.. అమ్మాయిల్ని వాడుకుంటున్నారు.. అబ్బాయిల్ని ఈజీగా మార్చేస్తున్నారు.. బాగా సంపాదిస్తున్నామన్న తలపొగరుతో మనుషుల్ని దూరం చేసుకుంటున్నారు.. ఏదో జరగరానిది జరిగితే తట్టుకోలేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇన్నీ చూస్తూ.. మనం సోకులు చేసుకుంటున్నాం.. అవి కొన్నాం, ఇవి కొన్నాం, ఇంత సంపాదించాం అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఎందుకు ఇలాంటి బాధ్యత లేని బ్రతుకులు ఈ పెద్ద వాళ్లకి? ఇన్నేళ్లు జీవితాన్ని చూసి కనీసం పక్కన వాడికి చెప్పలేని చేతగానితనం సిగ్గేయట్లేదా?

చెప్పండి... యువతరానికి ఏదైనా నోరు విప్పి చెప్పండి. మన మాట వినట్లేదని ఇగో ఫీలై ఆగిపోతే.. కనీసం నీ ఇగోని కూడా నువ్వు జయించలేని బలహీనతలో ఇన్నాళ్లు నువ్వు సాధించిందేంటి? కష్టమొస్తే ఇంట్లో చెప్పుకోవడానికి మనిషి ఉండట్లేదు. మీ పిల్లలతో పాటు నువ్వూ Facebookలో గంటల తరబడి గడిపేస్తుంటే ఆఫీస్ పనులు చేస్తున్నావా, వంట చేశావా ఇవన్నీ బాధ్యతలు వదిలేస్తుంటే ఇంకా నీలో ఏం చూసి నీ పిల్లలు నేర్చుకోవాలి?

కాస్త బాధ్యతగా ఉండు.. ప్రపంచం మొత్తం మళ్లీ మామూలవుతుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. పెద్దవాళ్లు ఏదీ చెప్పకుండా ఎస్కేపిస్టులుగా మారిపోయినప్పుడే పిల్లల జీవితాలు చీకట్లోకి వెళ్తున్నాయి. కాస్త ఓపిక తెచ్చుకోండి.. చెప్పండి, వినకపోతే మళ్లీ మళ్లీ చెప్పండి.. చెప్పడం తప్పు కాదుగా!

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు