చరిత్ర అంటే కొందరికి ఎందుకంత భయం?



దేశచరిత్ర అనేది ఒక యూనివర్సిటీకి లేదా ఒక పరిశోధకుడి పరిశోధనకు సంబంధించిన విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా పరిశోధకులంతా ఏండ్ల తరబడి పరిశోధనలు చేస్తే వచ్చే ఫలితమే చరిత్రగా నిలుస్తుంది. ఎంతో మంది చరిత్రకారులు, ఆర్కియాలజిస్ట్‌లు, ఇండాలజిస్ట్‌లు పరిశోధించి చెప్పిన దానికి ఆర్‌ఎస్‌ఎస్‌ వారు ఎందుకు బెంబేలెత్తుతున్నారూ? అసలు చరిత్ర పుస్తకాల్ని మార్చి తిరగరాయించాలనే కోరిక బీజేపీ ప్రభుత్వ పెద్దలకు ఎందుకొచ్చిందీ? ఇప్పుడున్న చరిత్ర గ్రంథాలంటే వారికెందుకంత గుబులూ? ఇది ఇలా ఉంటే, ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీల్లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉంటూ, ప్రపంచ మేధావుల్లో ఒకరైన భారతీయ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌ (83) పుస్తకాల్ని తగుల బెట్టాలని ఎందుకు పిలుపునిస్తున్నారూ? 

తన కృషిని గుర్తించి ఇచ్చే అకడమిక్‌ అవార్డులు తప్ప, మరే ఇతర అవార్డులూ తీసుకోనని, భారత ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్‌ని రెండుసార్లు నిరాకరించిన విశిష్ట వ్యక్తిత్వం కదా ఆమెది? అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్‌ 'లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ క్లూగ్‌ ఛైర్‌'కి నియమితులైనవారు కదా ఆమె? అలాంటి నిజాయితీ, నిబద్ధతగల చరిత్రకారులంటే ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీలకు ఎందుకంత వణుకూ? వారి ఉనికికి భంగం కలిగించే పరిశోధనా ఫలితాలు వారు వెల్లడిస్తున్నందుకా? బహుశా ఆర్యన్‌ దండయాత్రే వారి భయానికి కారణమై ఉంటుంది.

ఆర్యులు - అంటే ఇప్పుడు భారతీయ సమాజంలో ఉన్నతవర్గాలవారు, ఒకప్పుడు విదేశాల నుంచి వలస వచ్చారన్న సిద్ధాంతం-బహుశావారికి మింగుడు పడటం లేదేమో! ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్యవైశ్యగా చెప్పుకునే ఆర్యులు, ఒకప్పుడు ఇరాన్‌ ప్రాంతం నుంచి వలస వచ్చినవారు. ఇక్కడ సింధూ నాగరికతను అభివృద్ధి పరుచుకున్న ఈ దేశ మూల వాసుల్ని ఆర్యులు విభజించారు. శూద్రులుగా, చండాలురుగా చేసి కుల వ్యవస్థను స్థిరపరిచారు. ఆనాడు భూమి ఉన్న రైతుల్ని ఊరిబయటికి పంపి, అంటరాని తనాన్ని అంటగట్టారు. బలవంతంగా బెదిరించి, వారి భూముల్లో పంటలు పండించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్కియాలజిస్ట్‌లు, మానవ శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు ఇంకా ఇతర పరిశోధకు లంతా గత రెండు వందల ఏండ్లుగా ఎన్నో తవ్వకాలు జరిపి ఎంతో శ్రమించి, పరిశోధించి వెలికి తీసిన విషయమిది.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా దినపత్రిక 21 మే 2001నాడు ప్రచురించిన వార్తా కథనం ప్రకారం, అమెరికా ఉట్టా విశ్వవిద్యాలయం - బయోటెక్నాలజీ డిపార్టుమెంట్‌ హెడ్‌ మైఖేల్‌ బమ్‌శాద్‌ పరిశోధించి చెప్పిందేమంటే.. భారత్‌లోని బ్రాహ్మణులు ఈ దేశ మూలవాసులు కాదనీ, వారు యురేషియనులని తేల్చాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనతోపాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఆ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఆ బృందంలో డాక్టర్‌ జయదీక్షిత్‌ కూడా ఒకరు. ఈయన పూనాకు చెందినవాడు. అమెరికాలో స్థిరపడ్డ భారతీయ బ్రాహ్మణుడు. మైఖేల్‌ బమ్‌శాద్‌వలె ఇదే విషయం మీద పరిశోధనలు చేసి ఆ విషయాన్నే ధృవపరచాడు.

ఇప్పుడు యధార్థాలు తెలుసుకుని ఆలోచిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీలు ఎక్కడివీ? యురేషియా నుంచి వలసవచ్చిన వారి వారసత్వాన్ని అంటే ఆర్యుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వారి వన్నమాట! అందుకే చూడండి వారికి భారత రాజ్యాంగం కన్నా మనుస్మృతే విలువైంది. వారికి జాతీయ పతాకం కన్నా వారి ఆర్‌ఎస్‌ఎస్‌ జెండానే ముఖ్యమైంది. ఆర్యుల వర్ణ చరిత్ర మాత్రమే ఉన్న వేదాల్ని గొప్పవిగా భావిస్తారు. అందుకే వీరి పట్టుపూర్వోత్తరాల గూర్చి చెప్పే చరిత్రకారులంటే వీరికి వెన్నులో వణుకుపుడుతుంది. ఈ విషయాలన్నీ తెలిస్తే, ప్రజలు ఎలా స్పందిస్తారోనని భయపడుతుంటారు. క్రీ.పూ. వైదికమతంలో విగ్రహారాధన లేదు. బ్రాహ్మణులు మాంసాహారులు. యజ్ఞయాగాలలో ఆవుల్ని బలిఇచ్చి తిని, తాగి వేడుకలు చేసుకునేవారు. అప్పటి నుంచే అగ్నిని దేవుడిగా, ఇంద్రుణ్ణి దేవుడిగా, వరుణుణ్ణి దేవుడిగా గుర్తిస్తూ దేవతల సంఖ్య పెంచుకుంటూ పోయారు.

క్రీ.పూ.బౌద్ధం దేశమంతా వ్యాపించి స్వేచ్ఛ, సమానత్వాల గురించి చెప్పింది. అహింసను బోధించింది. ఆత్మ, పరమాత్మలు లేవని చెపుతూ అందరూ హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్పింది. బుద్ధుడి ప్రభావాన్ని, అతడి బోధనల ప్రభావాన్ని తట్టుకోలేక, హిందూమత వాదులు తమ మతంలో, తమ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. నేరుగా బుద్ధుణ్ణి తమ దశావతారాల్లో చేర్చుకోవడం, మాంస భక్షణ మానేయడం, బౌద్ధారామాల్ని హిందూ దేవాలయాలుగా మార్చుకోవడం వగైరా జరిగాయి. 

బుద్ధుడి వ్యక్తిత్వానికి ధీటుగా రాముడు, కృష్ణుడు వంటి కల్పిత పాత్రల్ని సృష్టించి, కథలల్లడం జరిగింది. బౌద్ధ జాతక కథల స్ఫూర్తితో హిందూపురాణాల్లోని ఎన్నో ఘట్టాలు రాసుకోవడం జరిగింది. సునిశితంగా విశ్లేషించుకుంటే ఆ విషయాలు గ్రహించొచ్చు. ఇక వైదిక మతం క్రమంగా రూపాంతరం చెందుతూ బ్రాహ్మణమతంగా మారింది. క్రీ.పూ. ఒకటో శతాబ్దంలో అంటరాని తనాన్ని ప్రవేశపెట్టి సమాజంలో తమ దే అత్యున్నతమైన స్థానమని ఆర్య బ్రాహ్మణులు ప్రకటించు కున్నారు. కులాలు, వర్ణాలు సజావుగా వర్ధిల్లేటట్టు కట్టడి చేశారు. ఇతర కులాల వారిని విద్యకు, సంపదకు దూరం పెట్టి- వారు విధిలేక కులవ్యవస్థను, వర్ణవ్యవస్థను పాటిం చాల్సిన దుస్థితి ఏర్పరిచారు. ఒక దశలో శూద్రులు దేవుడైన శంకరుడికి బ్రహ్మ, విష్ణులతో సమానమైన స్థాయి కల్పిం చారు. గోవుకు పవిత్రత ఆపాదించి, గోవధ నిషేధించారు.

ఈ దేశ మూలవాసులైన శూద్రులు, పంచములు, ఆర్యబ్రాహ్మణుల వల్ల విపరీతమైన చిత్రహింసలకు గురయ్యారు. ఊపిరి మెసలని కట్టుబాట్లు, నిబంధనలతో విసిగిపోయారు. పన్నెండో శతాబ్దంలో దేశంలోకి ముస్లింలు రావడంతో వారిలో కొందరు ముస్లిం మతంలోకి మారారు. 
1792లో విలియం కేర్‌ దేశంలో అడుగుపెట్టినప్పుడు మరికొందరు క్రైస్తవం స్వీకరించారు. ఆర్య బ్రాహ్మణులు హిందూ మతంలో విధించినన్ని కఠినమైన నిబంధనలు ఇతర మతాల్లో లేకపోవడం వల్ల, ఇక్కడలేని సౌకర్యాలు, సౌలభ్యాలు, వెసులుబాట్లు అక్కడ ఉండటం వల్ల కొంత మంది ముస్లిం మతంలోకి, మరికొంత మంది క్రైస్తవంలోకి మారడం జరిగింది. 

జైన, బౌద్ధ మతాలు అప్పటికే తగ్గుముఖం పట్టాయి. అసలైతే ముస్లిం, క్రైస్తవ మూలాలు భారతదేశంలో లేవు. ప్రస్తుతం దేశంలో ఉన్న ముస్లింలైనా, క్రైస్తవులైనా ఈ దేశ మూలవాసులే. బహుజనులే. విదేశీయులు కాదు. దానికి తోడు సుదీర్ఘకాలం దేశం ముస్లిం చక్రవర్తుల పాలనలోనూ, బ్రిటిష్‌రాణి పాలనలోనూ ఉండటం వల్ల కూడా మత మార్పిడులు వేగవంత మయ్యాయి.

ఆర్య సమాజ్‌ అంటే అది యురేషియన్‌ సమాజం. అంటే విదేశీ సమాజం. భారతదేశంలో బ్రాహ్మణులు 'ఆర్యులు' అని పిలవబడేవారు. అందువల్లే దయానంద్‌ సరస్వతి ఆర్యసమాజ్‌ స్థాపించాడు. దేశంలోని ఇతర కులాల వారు, వర్ణాలవారు బ్రాహ్మణుల్ని 'ఆర్యా!' అని సంభోదించాలన్న నియమం ఉండేది. ఇటీవలి కాలం వరకు ఆర్య అనే పదం వాడుకలో ఉన్న విషయం మనకు తెలుసు. ముస్లింలు దండయాత్ర చేసి భారతదేశాన్ని ఆక్రమించు కున్నట్టు, బ్రిటిష్‌వారు ఆక్రమించుకుని రాజ్యమేలినట్టు, ఇంకా ఇంకా చాలా యేండ్ల క్రితం ఆర్యబ్రాహ్మణులు కూడా యురేషియా నుంచి అంటే ఇరాన్‌ ప్రాంతం నుంచి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారని పరిశోధకులు ధృవీకరించారు. 

మనం చిన్నప్పుడు ఆర్యుల ప్రవేశం, ఆర్యావర్తనం లాంటివి చరిత్రలో చదువుకున్నవే కానీ అప్పుడు ఇంత విపులంగా విషయాలు తెలియలేదు. ఇప్పుడు హిందూ మతంగా పిలువబడే బ్రాహ్మణిజం ఎప్పుడో ఇరాన్‌ ప్రాంతం నుంచి వచ్చినవారు రూపొందించింది. మనుషులు మాట్లాడు కోవడానికి ఏర్పరచుకున్న భాషని కర్మ-ధర్మ సిద్ధాంతాల మాటున మంత్రాలు, తంత్రాలుగా మార్చి తమదైన ముద్రవేసుకున్నారు. శ్రమించి, ప్రకృతిని మనిషికి అనువుగా మార్చుకునే పనిని తక్కువదిగా చేశారు. తోటి మనుషుల్ని అంటరానివాళ్ళుగా గుణం తక్కువ వాళ్ళుగా శూద్రులుగా, పంచములుగా ప్రకటించారు. ఒక పందిని దేవుడి అవతారంగా వర్ణించారు. 

రుగ్వేదం (3:9:11) ప్రకారం దేవుళ్ళను 3339 వర్గాలుగా, మనుషుల్ని ఆరువేల కులాలుగా విడగొట్టారు. దేవుడి పేరుతో ఆచారాలు ఏర్పరిచి ఒక 'పవిత్రమైన' పురోహిత వర్గాన్ని ఏర్పరిచారు. సమాజంలో తొంభైశాతంగా ఉన్న శూద్రుల్ని, అంటరాని వారిని ఆత్మన్యూనతా భావానికి లోను చేశారు. తమ కులం ఏమిటో చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వర్ణవ్యవస్థని, ఒక మానసిక రుగ్మతని భారతీయ సమాజంలో ప్రవేశపెట్టి స్థిరపరిచారు. 

ఆ దుష్ప్రభావంలోంచి శతాబ్దాలు గడిచినా మన సమాజం కోలుకోలేకపోతోంది. ఇరాన్‌ ప్రాంతమంటే (యూరోప్‌+ ఆసియా=యురేషియా) ఇప్పటి ఇరాన్‌ అని కాదు. వేల వేల ఏండ్ల క్రితం ఆ ప్రాంతం ఇస్లామీకరించ బడక పూర్వం ముందున్న ప్రాంతం. అప్పుడు అక్కడ మాట్లాడిన భాషలు అవెస్తన్‌ - సంస్కృతం. ఇవి వేరువేరు భాషలుకావు. ఒక మూల భాషకు ఏర్పడ్డ రెండు మాండలికాలు.

అన్ని భాషల్లాగా సంస్కృతం అంత వరకు ఒక మామూలు భాషే. కాని, దాని స్థాయి అనూహ్యంగా పెంచి, దాన్ని దైవ భాషగా, వేదభాషగా ప్రకటించుకున్నారు. పైగా శూద్రులు ఆ భాష చదివితే నాలుకలు కోశారు. ఆ భాష వింటే చెవుల్లో సీసం పోశారు. వేదాల సృష్టికర్తలయిన నాటి ఆర్య బ్రాహ్మణుల అకృత్యాల జాబితా చాలా పెద్దది. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, గోత్రాలు పక్కన పెట్టి, ఆధునిక యుగ వైఐజ్ఞానిక స్పృహతో ఆలోచించగల మానవ వాదులకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఎదగలేనితనంలో కొట్టుమిట్టాడుతున్న వారికి గత చరిత్ర విప్పి చెప్పితే కోపాలే వస్తాయి. అందుకే చరిత్ర గ్రంథాల్ని తిరగరాయించాలన్న కోరిక కొందరిలో బలంగా ఉంది. పుస్తకాలు, సిలబస్‌లు మార్చుకున్నంత మాత్రాన అసలు చరిత్ర మారదుకదా? ప్రస్తుత పరిస్థితుల్లో మైనార్టీల మీద విపరీతంగా జరుగుతున్న దాడుల్ని రోజూ మనం చూస్తున్నాం. హిందూత్వను బలోపేతం చేయాలను కునేవారు మైనార్టీలను హింసిస్తే లాభమేమిటీ? వారే ఆలోచించుకోవాలి. 

హిందూమత ఛాందసానికి తట్టుకోలేక వారి వారి పూర్వీకులు ఒకప్పుడు మతాలు మార్చుకున్నారు. వారి వారసుల్ని ఇప్పుడు అదిరించి, బెదిరించి, హింసకు గురిచేస్తే వారు హిందూత్వాన్నెలా సమర్థిస్తారు? 'ఘర్‌ వాపసీ' ఎలా సాధ్యం? విశాల దృక్పథంతో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పాల్సింది పోయి, సంకుచితత్వంతో హత్యలు చేస్తూపోతే ఎవరైనా గాని హిందూత్వ వైపు ఎలా ఆకర్షింపబడతారూ? దేశంలో అధికారపార్టీ నిర్వహిస్తున్న ఒకరకమైన ఉగ్రవాద చర్యల్ని హిందువులే వ్యతిరేకిస్తున్నారు కదా? అందుకే పురాణ గాథల్ని ఎద్దేవా చేస్తూ నార్ల ఇలా అన్నారు. 

''భూమి బల్ల పరుపు / 
పాము దానిని మోయు/ 
పాల కడలి కలదు పాడె కలదు / 
పాత పుస్తకాల పాండిత్య మింతె రా! 
నవయుగాల బాట నార్లమాట!''

- డాక్టర్‌ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు