మనుస్మృతిని ధిక్కరించిన ఛత్రపతి శివాజీ



మనుస్మృతిని ధిక్కరించిన ఛత్రపతి శివాజీ
-------------------------------------------------------------
       రాజైన శివాజీకే వివక్ష తప్పలేదు. శివాజీని పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి స్థానిక బ్రాహ్మణులెవరూ సహకరించలేదు. అప్పుడు దూరప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిపించారు. అతను కార్యక్రమం పూర్తి చేయించాడు కానీ, శివాజీ నుదుట తన కాలి బొటనవేలుతో తిలకం దిద్దాడు. ఎందుకంటే రాజైనవాడు శూద్రుడు గనక! మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు, జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. 

       *తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కోసారి ఒక్కొక్కరిని తమ వారిగా ప్రచారం చేసుకోవడం బిజెపి, ఆరెస్సెస్‌లకు కొత్తేమీ కాదు. వారిలో ఛత్రపతి శివాజీ ఒకరు.* ప్రసిద్ధ మరాఠా నాటకం 'జాణ్తారాజా' (జగమెరిగిన రాజు) కూడా శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించింది. అయితే  *ముస్లింల పట్ల, వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేష భావం చూపలేదని చరిత్రకారుడు సర్దేశాయి 'న్యూ హిస్టరీ ఆఫ్‌ మరాఠాస్‌' అనే తన పుస్తకంలో రాశారు.*  సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే శివాజీ ప్రాథమిక లక్ష్యంగా జీవితాంతం పోరాడాడు. అంతేగాని, ఆయన ఎప్పుడూ ముస్లిం ద్వేషి కాదు. ఇస్లాం వ్యతిరేకీ కాదు. అలా చూపించడానికి ప్రయత్నించిన వారు వాస్తవాల్ని వక్రీకరించినట్టవుతుంది.
మతం ప్రాతిపదికన కాకుండా మానవీయ కోణంలో ఛత్రపతి శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యంలో, ఇతర అధికారుల నియామకాల్లో మతానికి ఏ మాత్రం ప్రాముఖ్యం ఇవ్వలేదు. అతని సైన్యంలో ఎక్కువ మంది ముస్లింలే. రాజ్యాన్ని రక్షించాల్సిన సైన్యంలో ఆయన నిర్భయంగా ముస్లింలను నియమించుకోవడం, వారి మీద నమ్మకం పెంచుకోవడం గమనించాల్సిన విషయం. అలాంటి వాణ్ణి ముస్లిం వ్యతిరేకిగా చిత్రించడమంటే వారి అవగాహనా రాహిత్యాన్ని బయట పెట్టుకున్నట్టే. అలాగే ఇతర మత పెద్దలను కూడా శివాజీ ఎంతో గౌరవించేవాడు. హజ్రత్‌బాబా యాకుబ్‌ తొర్వాలే పట్ల శివాజీకి ఎంతో గౌరవభావం వుండేది. జీవితాంతం ఆయనకు పింఛను అందేలా ఏర్పాటు చేశాడు. ముస్లింలు నమాజ్‌ చేసుకునేందుకు తన రాజధాని రాయగఢ్‌లో ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు. రాజ్యంలోని, మసీదులకు, దర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్‌ దొరికితే దాన్ని గౌరవంగా తీసుకెళ్లి ముస్లింలకు అప్పగించా లన్న ఉత్తర్వు అమలులో ఉండేది. అలాగే ఫాదర్‌ అంబోస్‌ పట్ల కూడా శివాజీకి ఎంతో గౌరవం వుండేది. గుజరాత్‌ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్నిర్మించడానికి భూరి విరాళం అందించాడు.

       యుద్ధ సమయంలో చేతికి చిక్కిన ఇతర మతాల మహిళల పట్ల, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించరాదని సైన్యానికి ఆదేశాలుండేవి. అఫ్జల్‌ఖాన్‌ను శివాజీ హత్య చేయడాన్ని కొందరు వక్రీకరించారు. ఆదిల్షా రాజులకు శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం సాగుతున్న తరుణంలో, ఆదిల్షా రాజ్యానికి ప్రతినిధిగా అఫ్జల్‌ ఖాన్‌ పోరాడాడు. చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి కుట్ర పన్నాడు. అయితే ఆ కుట్ర వివరాలు ఒక ముస్లిం ద్వారా శివాజీ తెలుసుకున్నాడు. అంటే హిందువయిన శివాజీ మహారాజును రక్షించుకున్నది ముస్లిం అయిన రస్తీం జమాన్‌. రస్తీం జమాన్‌ సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్‌ఖాన్‌ను చంపేశాడు. ఇక్కడ మనం కృష్ణాజీ భాస్కర కులకర్ణి పోషించిన పాత్రను విశ్లేషించుకుంటే, మనకు అర్థమయ్యేదేమంటే.. తన మతం వాడయినా సరే.. తక్కువ కులంవాడు రాజుగా ఉండటం భరించలేక శివాజీని చంపడానికి వేరే మతం వాడికి సహాయపడ్డాడు. సరే, ఆ పథకం విఫలమైందన్నది వేరే విషయం.

       ప్రజారంజకుడైన మహారాజు ఛత్రపతి శివాజీ మనుస్మృతిని ధిక్కరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? శివాజీ మరాఠా 'కున్భి' కులస్తుడు. మనుస్మృతి ప్రకారం శూద్రకులం. అగ్రవర్ణాల వారు శూద్రకులాలను బానిసలుగా మార్చిన విషయం గతం చెపుతోంది. దేశ జనాభాలో తొంభై శాతం ఉన్న ఈ 'శూద్రులు' అగ్రవర్ణాల వారు రచించుకున్న మనుస్మృతి ప్రకారం చదువుకోకూడదు. ఆయుధం ఉపయోగించకూడదు. వారికి ఎదురుపడకూడదు. కేవలం వారి వారి చేతివృత్తులు చేసుకుని జీవించాలి. పైగా తమ రాబడిలో సగభాగం అగ్రవర్ణ పెత్తందారులకిచ్చి, మిగతా సగంతోనే జీవించాలి. ఈ కట్టుబాట్లను ఎవరైనా ధిక్కరిస్తే నాలుకలు కోసేవారు, చెవుల్లో సీసం పోసేవారు. రాజైన శివాజీకే వివక్ష తప్పలేదు. శివాజీని పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి స్థానిక బ్రాహ్మణు లెవరూ సహకరించలేదు. అప్పుడు దూరప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిపించారు. అతను కార్యక్రమం పూర్తి చేయించాడు కానీ, శివాజీ నుదుట తన కాలి బొటనవేలుతో తిలకం దిద్దాడు. ఎందుకంటే రాజైనవాడు శూద్రుడు గనక! ఇటువంటి పరిస్థితి సమకాలీనంలో కూడా మారలేదు. 

        మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు. జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు. అలాంటి శివాజీని కుట్రలు కుతంత్రాలతో అగ్రవర్ణాల వారు హత్య చేశారు. శివాజీ కుమారుడు శంభాజీ కూడా తండ్రి బాటలో నడిచాడు. *మనుస్మృతిని ధిక్కరించి 'బుద్ధ భూషణం' అనే పుస్తకం రాశాడు. వేదపురాణాల్ని అధ్యయనం చేసి అవి పనికిరానివని తేల్చాడు.*  'ఈ దేశానికి బౌద్ధం ఒక్కటే మార్గం' అని నిర్ణయించుకుని ప్రచారం చేశాడు. శూద్ర కులాల్ని చైతన్యపరిచాడు. అయితే శూద్రకులాలు బలపడితే తమకు ప్రమాదమని అగ్రవర్ణాల వారు ఔరంగజేబు సహాయంతో శంభాజీని, అతని అనుచరుల్ని బంధించారు. మనుస్మృతిలో చెప్పినట్టు కళ్ళు పీకి, చర్మం వొలిచి, నాలుక కోసి అతిక్రూరంగా హత్య చేశారు. శంభాజీ తలను, అతని అనుచరుల తలలను కోసి, వారి కత్తులకు గుచ్చి పూణెలో ఊరేగించారు. మమ్మల్ని ధిక్కరించి కులధర్మాన్ని ధిక్కరించినవాడు చక్రవర్తి అయినా సరే వాడికి ఏ గతి పట్టిందో చూడండంటూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు. తమను ఎదిరిస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని హెచ్చరించారన్నమాట! శంభాజీని ప్రోత్సహించిన అంటరాని వారికి తర్వాత కాలంలో మూతికి ముంత, నడుముకు చీపురూ వచ్చాయి. ఛత్రపతి శంభాజీ హత్యకు గుర్తే.. చెంబులో కర్రలు పెట్టి ఊరేగించడం! మహారాష్ట్రలో అది గుడిపడవా. తెలుగు ప్రాంతాల్లో ఉగాది. అందుకే ఉగాది ఏ విధంగానూ మన పండగ కాదు అనేది విశ్లేషకులు చెపుతున్న మాట. ఈ దేశ మూలవాసులకు అదొక దుర్దినం. ఛత్రపతి శివాజీ కాలంలోనే కాదు, ఈ 21వ శతాబ్దంలో కూడా ఈ కులమతాలు ఇలాగే కొనసాగాలని ఒక జియ్యరు స్వామి ఏమాత్రం సిగ్గూ, బిడియం లేకుండా చెపుతున్నారంటే ఏంటీ? మంత్రయినా, ముఖ్యమంత్రయినా సరే, తమ కాళ్ళ మీద పడాల్సిందేనని చెప్పుకోవడమన్న మాట! ఆధిపత్య కుల దురహంకారాన్ని అజ్ఞానంతో ప్రదర్శించుకోవడమన్న మాట! దీన్నిబట్టి మనం ఎన్నుకుంటున్న నాయకులు ఎలాంటి వారో అంచనా వేసుకోవచ్చు.

-- డా|| దేవరాజు మహారాజు

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు