మహాసాధ్వి, మహిళా సేనాని కస్తూరిబా





మహాసాధ్వి, మహిళా సేనాని కస్తూరిబా

(గాంధీజీ వెన్నంటి సాగిన కస్తూర్బా నేపథ్యం, జీవన గమనం, పట్టుదల, అవగాహన చాలా విలక్షణమైనవి. గాంధీజీ ఇంగ్లండులో బారిష్టరు చదివిన వ్యక్తి, ఉపాధికోసం దక్షిణాఫ్రికా తరలి వెళ్ళిన సాహసి. అయితే కస్తూర్బా ఎటువంటి చదువు, ఎటువంటి అధ్యయనం లేకుండా కేవలం జీవితాలను గమనించి గాంధీజీని ఆయన విధానాలను అర్థం చేసుకుని హేతుబద్ధంగా స్వీకరించి, జీవించిన మహాతల్లి. దేశంకాని దేశాన చాలారకాల సమస్యల మధ్య సాహసంతో జీవితాన్ని సాగించింది. గాంధీజీ, రాజాజీ గార్ల మనవడు రాజమోహన్ గాంధీ, 2006లో మోహన్ దాస్:  ఎ ట్రూస్టోరీ ఆఫ్ ఎ మాన్, హిస్ పీపుల్ అండ్ యాన్ ఎంపైర్  అనే పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం ఆధారంగా కస్తూర్బా గాంధీ అంతిమ రోజుల గురించి ప్రస్తుత వ్యాసం.)

రెండవ ప్రపంచ యుద్ధం జరిగే రోజులవి. జపాన్‌ విజృంభిస్తూ మలయా, రంగూన్‌, సింగపూర్‌లను వశపరుచుకొన్నది. భారతదేశ తూర్పు తీర పట్టణాలపై బాంబుల దాడి జరగవచ్చని ప్రజలు ఆందోళపడుతున్న రోజులవి. భారత్‌కు రేపు కాదు నేడే స్వాతంత్రం ప్రకటించాలని ఎ.ఐ.సి.సి. సమావేశంలో నెహ్రూ, పటేల్‌ మొదలైనవారు హెచ్చరించారు. 1942 ఆగస్టు 7వ తేదీన 40 కోట్ల భారతీయులకు స్వాతంత్రం ఇచ్చి తీరాలని గాంధీజీ ''లక్ష్యాన్ని సాధించటమో లేక మరణించడమో'' (డూ ఆర్‌ డై) అని 'క్విట్‌ ఇండియా' ఉద్యమానికి పిలుపిచ్చారు. బ్రిటిష్‌ ప్రభుత్వం దేశనాయకులను జైళ్లలో నిర్బంధించడం ప్రారంభించింది. గాంధీజీ, మహాదేవ్‌దేశాయ్‌, మీరాలతోపాటు సరోజనీ నాయుడులను పూనా దగ్గిర ఉన్న ఆగాఖాన్‌ ప్యాలెస్‌కు తరలించారు. సాయంత్రం ప్రసంగిస్తానన్న కస్తూర్బాను, సుశీలను ప్యాలెస్‌కు తరలించారు. అక్కడకు చేరుకోగానే కస్తూర్బా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

'క్విట్‌ ఇండియా' ఉద్యమంలో వేలాది ప్రజలు శాసన ధిక్కారానికి, విధ్వంసానికి, చివరకు మరణానికి తెగించి, వీరోచితంగా పోరాడారు. లక్షలాది మంది జాతీయ వాదులు జైళ్లకు వెళ్లారు. గాంధీజీ సాహచర్యంతో కస్తూర్బా కోలుకున్నట్లు కనిపించారు. గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి మహదేవ్‌ దేశాయ్‌ హఠాత్తుగా మరణించారు. తన భర్త కుడిచేతిలా సేవలందించిన దేశాయ్‌ మృతికి కస్తూర్బా వెక్కివెక్కి దు:ఖించింది.

అరెస్టుల రూపంలో ప్రభుత్వ దమనకాండపైన, బెంగాల్‌ కరువు సమస్యపై ప్రభుత్వం స్పందించక పోవడటంతో 1943 ఫిబ్రవరి 19న గాంధీజీ 21 రోజుల ఉపవాసదీక్ష ప్రారంభించారు. ప్రఖ్యాత వైద్యుడు డా. బి.సి. రాయ్‌ను, మరొక డాక్టర్‌ను గాంధీజీ దంపతుల ఆరోగ్య పర్యవేక్షణకు ప్రభుత్వం అనుమతించింది. 13వ రోజున గాంధీజీకు మింగటం కష్టమైంది. మంచినీళ్లతో పాటు, నిమ్మరసం, పంచదార కలిపి త్రాగడానికి గాంధీ అంగీకరించటంతో ప్రాణానికి ముప్పు తప్పింది. ''తాను దాదాపు మృత్యు ముఖంలో ఉన్నప్పుడు, కస్తూర్బా తాను సుస్తీగా ఉన్నా శోకించలేదు; ధైర్యం కోల్పోలేదు. పైగా మిగతా వారికి ధైర్యం చెప్పింది'' అని గాంధీజీ తరువాత గుర్తు చేస్తున్నారు, అంతకు ముందు సేవాగ్రాం (నాగపూర్‌ దగ్గిర)లో తనకు సపర్యలు చేస్తున్న గాంధీకు మనమరాలి వరసైన మనూ గాంధీను 1943 మార్చిలో ప్రత్యేకంగా కోరి కస్తూర్బా ఆగా ఖాన్‌ ప్యాలెస్‌ కు రప్పించుకున్నారు. భారీ కాపలాతో ఇంత పెద్ద భవంతికి బదులు చిన్న జైలుకు మార్చండని గాంధీజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

ఒక సహఖైదీ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా మామిడిపండ్లు పంచినప్పుడు, కస్తూర్బా ''మన పెళ్లయి ఎన్నేళ్లయింద''ని గాంధీజీను అడిగింది. ''ఎందుకు నీవు కూడా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటావా?'' అని గాంధీజీ అడిగితే 74 సంవత్సరాల కస్తూర్బా మిగిలిన వారితో పాటు నవ్వింది. ''మహదేవ్‌ గతించారు. ఇక ఇప్పుడు నేను...'' అని కస్తూర్బా నిర్వేదం చెందారు. గాంధీజీ నిర్బంధంతో పాటు పెద్ద కుమారుడు హరిలాల్‌ (మద్యానికి బానిసై) తల్లిదండ్రులకు వేదన కలిగించడం ఆమెను మరింత కృంగదీసింది. 5వ తరగతి గుజరాతీ వాచకంలోని రెండు పాటలను గాంధీజీ కస్తూర్బాకు నేర్పారు. రాత్రిళ్లు ఆమెకు ఓపిక ఉన్నప్పుడు ఇద్దరు ఆ రెండు పాటలనూ పాడేవారు. 

గాంధీజీ 21 రోజుల ఉపవాస దీక్షలో ప్రక్కన కస్తూర్బా ఉండటం వల్ల గాంధీజీకు ఊరట కలిగింది. భర్త దీక్షలో ఉన్నప్పుడు కుమారులు రామదాస్‌, దేవదాస్‌లు చూడడానికి రావటం కస్తూర్బాకు సంతోషం కలిగింది. 1943 డిసెంబర్‌లో కస్తూర్బాకు మూడుసార్లు గుండెనొప్పి వచ్చింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గాంధీజీ జైలు సూపరింటెండెంట్‌కు లేఖ వ్రాసారు. మదన్‌లాల్‌ దగ్గిర బంధువైన కానూ గాంధీను, జయప్రకాష్‌ నారాయణ్ భార్య ప్రభావతిని అధికారులు అనుమతించారు. కస్తూర్బాకు ప్రభావతి సపర్యలందిస్తే, కానూగాంధీ భజన గీతాలతో ఓదార్పు కలిగించేవారు. గాంధీజీ ఎన్నో లేఖలు వ్రాసాక, కస్తూర్బాను చికిత్స చేయడానికి ఆయుర్వేద వైద్యుడు శివశర్మను, ప్రకృతి వైద్యుడు దిన్షామెహతాను అనుమతించారు.

మంచం పట్టిన తల్లిని ముగ్గురు కుమారులు (మణిలాల్‌ దక్షిణాఫ్రికాలో విధి నిర్వహణలో                ఉన్నాడు) చూడటానికి గాంధీజీ ప్రక్కన నిలబడిన దృశ్యం ఆమెలో సాంత్వన కలిగింది. 1944 ఫిబ్రవరి 22 శివరాత్రి రోజున రాత్రి 7గం. 35ని.కు గాంధీజీ చేతుల్లో కస్తూర్బా అంతిమ శ్వాస విడిచారు. మరణించిన తల్లిగుండెలపై వాలి చివరి కుమారుడు దేవదాస్‌ గాంధీ రోదించారు. గాంధీజీ కనుల నుంచి అశ్రుబిందువులు రాలటం సహచరులు గమనించారు. మిగతా స్త్రీల సాయంతో మృతదేహానికి గాంధీజీ స్నానం చేయించి, తాను వడికిన నూలు చీరను ఆమె పార్ధివ దేహానికి కప్పారు. గాంధీజీ ఆమె జుట్టును సరిచేసి కుంకుమదిద్దారు.

సానుభూతి తెలిపిన వైస్రాయ్‌ వేవెల్‌కు స్పందిస్తూ గాంధీజీ వ్రాసిన లేఖలో ''మేము అందరి దంపతుల వంటి వారము కాదు. 1901 నుంచి మేము చేసిన ప్రయోగాలతో, పరస్పర అంగీకారంతో ఆత్మ నిగ్రహాన్ని మా జీవనపధంగా మార్చుకున్నాము. మేమిద్దరం వేరు వేరు వ్యక్తులుగా గాక, ఆమె స్వచ్ఛందంగా నాలో ఒక భాగంగా మిళితమయ్యారు. తన ఆలనాపాలనతో పాటు, నిరంతర ఆధారంగా, నిత్య సహచరిగా నన్ను ఈ స్థితికి రావడానికి తోడ్పడింది. నా జీవన సహచరిగా ఎన్నుకునే అవకాశం ఉంటే, జన్మజన్మలకు 'బా'నే కోరుకుంటాన''ని గాంధీజీ శ్రద్ధాంజలి ఘటించారు. 

- డా. పాటిబండ్ల దక్షిణామూర్తి

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు