ఎవరు బండ?
‘‘అదేదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు
మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు
ఆరడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు
మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేశాడు
ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది
మూడడుగుల ముక్క బండ చాకిరేవు చేరింది
కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి
కంపుకొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి
గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిచాయి
మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి
అర్థంకాని స్తోత్రాలతో పూజారి భక్తిశ్రద్ధలు
చాకలి నోటివెంట ఇస్సు ఇస్సు శబ్ధాలు
శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది
పవిత్రతకై ప్రతి బట్టా బండను బాదుతోంది
కడకు.. గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్లాయి
రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్లాయి
గుడిలోని దేవుడా? రేవులోని బండా?
ఎవరు దేవుడు? ఎవరు బండ?’’
- రంగనాధ్.
Comments
Post a Comment