ఇండియాలో మూడు* *సామాజిక విప్లవాలు
*ఇండియాలో మూడు* *సామాజిక విప్లవాలు* .
మార్క్స్ సామాజిక విప్లవాలకు ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఉత్పత్తి సంబంధాలమార్పు కొరకు జరిగే వర్గ పోరాటాలు చోదక శక్తులుగా పనిచేస్తాయని అంటాడు. ఈ అంచన ఆధారంగా ఆయన ప్రపంచ చరిత్ర మొత్తం వర్గ పోరాటాల చరిత్రేననే సూత్రీకరణ చేశారు. ఈ సూత్రీకరణలో భాగంగా ప్రపంచంలో మొదట బానిస సమాజం, తర్వాత భూస్వామ్యం, భూస్వామ్యం నుండి పెట్టుబడిదారీ సమాజంగా పరివర్తన చెందిన క్రమాన్ని చారిత్రక భౌతిక సిద్ధాంతంలో విశ్లేషిస్తాడు. 1853లోనే భారతదేశంలో బ్రిటిష్ పాలనపై పరిశీలన చేస్తున్నప్పుడు భారతదేశ చరిత్రపై కూడా దృష్టి సారించాడు. ఆయన దృక్పధానికి భిన్నమైన పరిస్థితులు భారతదేశంలో ఉండేసరికి ఇండియాకు చరిత్ర లేదు? అనే నిర్ణయానికి వస్తాడు ఆయనే కాదు డాక్టర్ అంబేద్కర్ కూడా తన’ కుల నిర్మూలన’(1932) గ్రంథంలో భారతదేశంలో సామాజిక విప్లవాలు ఎందుకు సంభవించలేదు? అనే ప్రశ్న నన్ను వేధిస్తున్నదని అంటాడు. కాబట్టి ఈ ఇరువురు తాత్వికులు లేవనెత్తిన సందేహాలపై చర్చ జరగవలసి ఉంది.
భారతీయ చరిత్రలో సింధు నాగరికత విశిష్టత మనకు తెలిసిందే. ఇది ఎలా పతనం చెందింది? అనే విషయంలో చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు వరదలు, కరువు కాటకాలు వల్ల పతనమైనదని అంటే మరికొందరు ఆర్యుల దండయాత్రలు కారణమని అన్నారు. ఇరాన్ నుండి వలస వచ్చిన ఆర్యులుకు మొదట వ్యవసాయం తెలియదు. పశు పోషణ కోసం స్థానిక తెగలను ఓడించి తమ ఆధిపత్యాన్ని స్థిర పరుచుకున్నారు ఈ విధంగా వారిది పశుపాలన కలిగిన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ. ఇది క్రీస్తుపూర్వం 1500 నుండి 1000 వరకు కొనసాగింది. అయితే తర్వాత కాలంలో వైదిక బ్రాహ్మణ యజ్ఞం కర్మకాండలు వ్యవసాయ అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే యజ్ఞ క్రతువుల ఖర్చులు, వృధా లను తగ్గించాలి. కాబట్టే యజ్ఞ సంస్కృతికి వ్యతిరేకంగా పాలక క్షత్రియ వర్గాల నుండి వర్ధమాన మహావీరుడు (జైనం) సిద్ధార్థుడు (బౌద్ధం) తిరుగుబాటు చేశాడు.
బౌద్ధ సంఘం వాణిజ్య సంపత్తిని, పెట్టుబడినీ ప్రోత్సహించింది. ధన లాభం కలిగే విధంగా మదుపు పెట్టాలని కూడా చెప్పింది. మత కర్మకాండలకు వ్యతిరేకంగా హేతువాదాన్ని ప్రోత్సహించింది. ఇదే కాలంలో ఇనుము వినియోగంలోకి రావడంతో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు దారి తీసింది.ఈ పరిణామాలు ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి దోహద పడ్డాయి. ఇందువల్లనే బలమైన నగర కేంద్ర మగధ సామ్రాజ్యం ఉనికిలోకి వచ్చింది. బౌద్ధం తిరుగుబాటు వల్ల వేదకాలంలో మొదటి స్థానములో ఉన్న బ్రాహ్మణులు బౌద్ధ కాలంలో మూడవ స్థాయి కి నెట్టబడ్డారు. ఈ కాలంలో మొదటి స్థానం పాలక క్షత్రియులది కాగా వ్యాపార వర్గం రెండో స్థానానికి ఎదిగించబడ్డారు. ఈ మార్పులను చారిత్రకంగా లభ్యమవుతున్న సాహిత్య ఆధారాలలో కూడా చూడవచ్చు. వేదిక్ సాహిత్యములో బ్రాహ్మణ దేవతల ఆధిపత్యం కనిపిస్తుంది. బౌద్ధం తరువాత వచ్చిన హిందూ పురాణ సాహిత్యంలోబ్రాహ్మణ దేవతలు కాక క్షత్రియులైన రాముడు, కృష్ణుడు లాంటి దేవుళ్ళ ఆధిపత్యం కనిపిస్తుంది.
ఈ మార్పుల పై డాక్టర్ అంబేద్కర్ చాలా లోతైన పరిశీలన చేశారు."ప్రాచీన చరిత్రను అధ్యయనం చేసిన తరువాత చరిత్ర పండితులు నిర్ధారణ చేసిన దానికి నేను వ్యతిరేక నిర్ధారణకు వచ్చాను. నాకు అందిన సమాచారం ప్రకారం ప్రాచీన ఇండియన్లు రాజకీయ జాతి అని నాకు తెలిసింది. భారతీయ సమాజ నైతిక విలువలపై ప్రభావం చూపిన ఇండియన్ రాజకీయ విప్లవం ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ రాలేదు. ప్రభుత్వం, తత్వం అనే రెండు అంశాలు ప్రాచీన ఇండియన్స్ కున్న రెండు సొత్తులు. అంతకు ముందెన్నడూ ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో ఇండియాలో హేతువాదం ప్రబోధించారు. ఇండియా విప్లవ దేశం. దానితో పోల్చితే ప్రెంచ్ విప్లవం కూడా సరిపోదు. ఈ విధంగా ఇండియాలో బౌద్ధ ,వైదిక బ్రాహ్మణ వాదాల మధ్య గొప్ప సంఘర్షణ జరిగింది. ఇది గొప్ప యుద్ధం కూడా. ఈ ఘర్షణ సైద్ధాంతిక విప్లవమే కాక గొప్ప రాజకీయ విప్లవం కూడా. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విషయములో బౌద్ధులు విప్లవకారులు. బ్రాహ్మణులు విప్లవ వ్యతిరేకులు. వారి సువార్తలే భగవద్గీత, మనుస్మృతని" అంటాడు.
కాబట్టి వైదిక వర్ణ వ్యవస్థ ప్రాబల్యానికి వ్యతిరేకంగా వచ్చిన బౌద్ధ తిరుగుబాటు దోపిడి వ్యతిరేక పోరాటమే. అయితే ఈ సామాజిక విప్లవం బౌద్ధంతోనే ఆగిపోయింది. పుష్యమిత్ర శుంగుని ప్రతి ఘాత విప్లవంతో చాతుర్వర్ణ వ్యవస్థ కులాలుగా ఘనీభవించినది. అటు తర్వాతనే కుల ధర్మాన్ని రక్షించి, కీర్తించేందుకు మనుస్మృతి, రామాయణ, మహాభారత కథలు వ్రాయబడ్డాయి. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణునిచే వర్ణ ధర్మాలు ధర్మబద్ధమైనవనిగ చెప్పిస్తారు కాబట్టి చాతుర్వర్ణ వ్యవస్థ కేవలం సామాజిక, ఆర్ధిక రూపం మాత్రమే కాదు, లోతుగా విశ్లేషిస్తే నాలుగు వర్ణాలు నాలుగు వర్గాలుగా విభజించబడటం మనేది సామాజిక దోపిడికి సంబంధించిన శ్రమ విభజననే. ఇది ఉత్పత్తి , పంపకం, వినియోగాలుకు సంబంధించిన వ్యవస్థని అంటాడు. ఈ విధంగా వైదిక బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బౌద్ధం తిరుగుబాటుని అంబేద్కర్ విప్లవంతో పోల్చుతున్నాడు.. కాబట్టి భారతీయ చరిత్రలో మొదటి సామాజిక విప్లవం బౌద్ధం వల్ల జరిగింది. ఇది మన ప్రాచీన భారతదేశంలో సంభవించిన మొదటి విప్లవం. ఇక క్రీస్తు శకం తర్వాత నుండి బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చేవరకు జరిగిన చరిత్రలో సామాజిక విప్లవాలు జరిగినట్లుగా ఏ చరిత్రకారుడు కూడా నమోదు చేసిన ఆధారాలు లేవు. భక్తి ఉద్యమాల అనుభవాలు ఉన్నప్పటికీ అవి పునాది రంగములో మార్పులను తీసుకు రాలేకపోయాయి
ఇక మార్క్స్ పరిశీలించిన రెండవ విప్లవాన్ని చూద్దాం. శ్రమ విభజన మీద ఆధారపడ్డ కులవ్యవస్థ భారతీయుల శక్తికి అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారింది. స్వయంగా అభివృద్ధి చెందుతున్న సామాజిక రాజ్యాన్ని మార్పు లేని ప్రకృతి సూత్రంగా మార్చివేశావి. రాజవంశాలు నిరంతరంగా మారుతున్నప్పటికీ సమాజంలోని ప్రాథమిక ఆర్థిక , సామాజిక నిర్మాణములో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. అందువల్ల సామాజిక విప్లవాలు ఉనికిలోకి రాకుండా పోయాయనే నిర్ణయానికి వచ్చాడు. ఈ సందర్భంగానే ఇండియాకు చరిత్ర లేదనే వ్యాఖ్యానాన్ని కూడా చేస్తాడు.కానీ బ్రిటిష్ వారి ఆవిరి ఇంజన్, స్వేచ్ఛా వ్యాపారం విధానం స్వయం పోషణ గ్రామీణ వ్యవస్థను ధ్వంసం చేస్తుండడం చూసి, బ్రిటిషు చొరబాటు ఆసియాలో కెల్లా పెద్దదయిన నిజం చెప్పవలసి వస్తే ఏకైక సామాజిక విప్లవాన్ని తట్టిలేపింది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యానం దేశ ప్రజలు తిరుగుబాటు గురించో కమ్యూనిస్టుల పోరాటాల గురించో కాదు. బ్రిటిష్ పెట్టుబడిదారీ ఉత్పత్తి శక్తులు ఇక్కడికి ఫ్యూడల్ ఉత్పత్తివ్యవస్థపై రుద్దటం వల్ల చేతివృత్తులు ధ్వంసమవుతున్న స్థితిని సామాజిక విప్లవంగా విశ్లేషిస్తున్నారు. అంటే పాతబడిన ఆసియా సమాజాన్ని నిర్మూలించి ప్రాచ్షాత్య సామాజిక భౌతిక పునాదులను నెలకొల్పడం చేయాలి అంటాడు. మానవాళి చరిత్రలో పెట్టుబడిదారీ సమాజం ఉనికిలోనికి రావటం గొప్ప విప్లవం గానే విశ్లేషిస్తాడు. ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం విజయవంతమైన తర్వాత ప్రపంచములో కనీవినీ ఎరుగని వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ పెట్టుబడిదారి ఉత్పత్తి శక్తులు ఇక్కడి వారసత్వ కులవృత్తులను ధ్వంసం చేయటంలో విప్లవాత్మకమైన పాత్రని పోషించింది. వాటి స్థానములో కులంతో సంబంధంలేని ఆధునిక వృత్తులు ప్రవేశ పెట్టబడ్డాయి. బ్రిటిష్ వారి పారిశ్రామికీకరణ, ఉదారవాద విద్యవల్ల అప్పటివరకు వాటికి దూరంగా ఉన్న సామాజిక తరగతులు ఇతర వృత్తులో కి మారే ప్రక్రియకు పునాది పడింది. దీనికి అంటరాని జాతుల నుండి వచ్చిన డాక్టర్ అంబేద్కర్ పెద్ద ఉదాహరణ. ఇక్కడి నుండే దడి కట్టుకున్న వర్గ సమాజం నుండి యూరపు తరహా వర్గ సమాజంగా పరివర్తన చెంది ప్రక్రియకు నాంది పడింది. కాబట్టి ఈ పరిణామాలను భారత దేశంలో సంభవించిన రెండవ విప్లవంగా చూడవచ్చు.
ఇప్పుడు మూడవ విప్లవాన్ని చూద్దాం. దీన్ని ప్రభాత్ పట్నాయక్ గారు విశ్లేషించారు ఈయన అగ్రశ్రేణి మార్క్సిస్టు మేధావిగా సుప్రసిద్ధులు. అలాంటి వ్యక్తి ‘1950 నుండి రాజ్యాంగం అమలుతో దీర్ఘకాలిక విప్లవం ప్రారంభమైందనే వ్యాఖ్యానం రాటం ఆలోచనాపరులలో ఆసక్తిని రేపుతున్నది. ఢిల్లీలోని జాతీయ దళిత అధ్యయనాల సంస్థ ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఐదవ స్మారక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యానాన్ని చేయటం జరిగింది. ఆయన తన వాదనకు డాక్టర్ అంబేద్కర్ 1949 లో రాజ్యాంగ ముసాయిదాను పార్లమెంట్లో ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగాన్ని ఆధారంగా విశ్లేషిస్తాడు "భారతీయ సామాజిక చరిత్ర సంస్థగత అసమానలతో వర్గీకరించబడింది. కానీ మన రాజ్యాంగం ప్రజలకు సార్వత్రిక ఓటుహక్కు కల్పించడం ద్వారా రాజకీయరంగంలో సమానత్వాన్ని ఆమోదించింది. కాబట్టి ఈ రాజకీయ సమానత్వం ద్వారా సామాజిక, ఆర్థిక రంగాలలో సమానత్వాన్ని తీసుకురావాలనే" డాక్టర్ అంబేద్కర్ వ్యాఖ్యలను చెబుతూ ఈ రాజ్యాంగానికి విప్లవ స్వభావం ఉందనీ అంటాడు.
భారత రాజ్యాంగానికి విప్లవ స్వభావం ఉండటానికి రెండు రకాల ఉద్యమాలు పునాదిగా ఉన్నాయని అంటాడు. అందులో ఒకటి బ్రిటిషు వలస వ్యతిరేక ఉద్యమానిది కాగా, రెండోది పూలే నుండి అంబేద్కర్ వరకు సాగిన సామాజిక విముక్తి ఉద్యమాలలో ఉన్నాయని అంటాడు. కాబట్టి ప్రభాత్ పట్నాయక్ చెప్పిన దాని ప్రకారం 1950 నుండే మనదేశంలో దీర్ఘకాలిక విప్లవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని గురించి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చేసిన వ్యాఖ్యానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 1950జనవరి 26 అనేది మమ్మల్ని మనుషులుగా లెక్కించిన రోజు. దీన్ని బట్టి చూస్తే అన్ని రకాల సామాజిక తరగతులు రాజ్యాంగం యొక్క విశిష్టతని గుర్తిస్తున్నాయి
వైపరీత్య మేమంటే ఈ దేశములోని ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా రాజ్యాంగ అవతరననీ దీర్ఘకాలిక విప్లవంగా గుర్తించడం లేదు. అందుకే అవి జనతా ప్రజాతంత్ర విప్లవమని, సోషలిస్టు విప్లవ కార్యక్రమాలను ప్రకటించుకొని పనిచేస్తున్నాయి. ప్రభాత్ పట్నాయక్ సిపిఎం పార్టీకి చెందిన మార్క్సిస్టు మేధావిగా ఉంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కూడా ఈ రాజ్యాంగంతో దీర్ఘకాలిక విప్లవం ప్రారంభమైన విషయాన్ని గుర్తించడం లేదు. అన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా భారత రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగమని దాన్ని కూల్చి వేయటమే లక్ష్యంగా ప్రకటించుకున్నారు. అలాంటి వారే ఇటీవలికాలంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం పిలుపులను ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రాజ్యాంగం విషయంలో వారి అంచనాలు సరైనవి కావని అర్థం అవు తుంది.
ఇక మన రాజ్యాంగం ఆర్థిక, సామాజిక ,రాజకీయ రంగాలలో సమానత్వాన్ని సాధించేందుకు సామాజిక న్యాయాన్ని లక్ష్యంగా ప్రకటించుకున్నది. రాజ్యాంగం ప్రకటించిన సామాజిక న్యాయాన్ని సాధించేందుకుగాను అందుకు అనుగుణంగా చాలా అధికరణలు రూపొందించింది. ముఖ్యంగా ఆదేశిక సూత్రాలు చెప్పేదేమంటే భారతీయ సమాజంలో ఉన్న అసమానతలను నిర్మూలించి సామాజిక న్యాయాన్ని మరియు సమానత్వాన్ని పెంపొందించాలని నిర్దేశిస్తాయి. అలాగే ప్రతి మనిషి గౌరవంగా జీవించే విధంగా ఉండాలని కోరుతాయి. చట్టం ముందు అందరూ సామానులేనని 14 వ అధికరణ తెలుపుతుంది. 15 వ అధికరణ మతం, జాతి, కులం, లింగం, ప్రాంతాన్ని బట్టి వివక్షతలు పాటించడాన్ని నిషేధించింది. 16వ అధికరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెబితే, 17 వ అధికరణ ద్వారా అంటరానితనాన్ని నిషేధించింది. 19 వ అధికరణ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను 21వ అధికరణ పౌర రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది.వెట్టిచాకిరి రద్దు 23 వ అధికరణ ద్వారా మరియు 14 ఏళ్ల లోపు పిల్లలు ప్రమాదకర పనులు నిర్మించరాదనీ 24 వ అధికరణ తెలుపుతుంది.
ఆదేశిక సూత్రాల లోని 38 వ అధికరణ సామాజిక నిర్మితలో ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయము పెంపొందించుటకు ప్రభుత్వం పాటుపడాలని తెలిపింది. అలాగే సమాన పనికి సమాన వేతనం స్త్రీ పురుషులకు ఇవ్వాలి. పిల్లలు దోపిడీకి గురికాకుండా వారు ఆరోగ్యంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కల్పించాలని ప్రకటించింది. అధికరణ 39 (ఎ) ఏమంటున్న దంటే అందరూ సమానఅకాశాలు పొందటానికి న్యాయ వ్యవస్థ పనిచేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆదేశిస్తుంది. ముఖ్యంగా 46వ అధికరణ బలహీన తరగతులకు చెందిన వారి పిల్లలు విద్యాపరంగా, ఆర్థికపరంగా ఎదిగేందుకు ప్రత్యేక లక్షణాలు చేపట్టాలని చెబుతుంది. ప్రత్యేకించి దళితులు, గిరిజనులను అన్ని రకాల అన్యాయాలు, దోపిడీ నుండి రక్షించాలి. ప్రజలందరికీ పౌష్టికాహార స్థాయి మరియు జీవన ప్రమాణాలు పెంచటం ప్రభుత్వ బాధ్యత అని 40వ అధికరణ చెబుతుంది. ఈ విధంగా రాసుకుంటూ పోతే ఎన్నో అధికరణలు పౌరుల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి వివరిస్తాయి. అందుకనే గ్రాన్ విల్లి ఆస్టిన్ అనే రాజ్యాంగ నిపుణుడి ప్రకారం భారత రాజ్యాంగం ప్రథమంగా ఒక సామాజిక పత్రం. ఇందులోని అత్యధిక ఆర్టికల్స్ సామాజిక తీర్మానపు లక్ష్యాలను సాధించటానికి లేదా ఈ విప్లవ ఉద్దేశాలను సాధించడానికి అవసరమైన పరిస్థితులను స్థాపించటం ద్వారా ఈ విప్లవ లక్ష్యాలను సాధించుటకై నేరుగా ఉద్దేశించబడినవి. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ మొత్తం రాజ్యాంగం జాతీయ పునరుజ్జీవనాన్ని లక్ష్యంగా పెట్టుకొని సామాజిక న్యాయాన్ని సాధించడానికి మూడవ భాగంలోని ఆర్టికల్స్ కృషి చేస్తున్నాయి ఇందులోని అత్యధిక ఆర్టికల్స్ సామాజిక తీర్మానపు లక్ష్యాలను సాధించటానికి లేదా ఈ విప్లవ ఉద్దేశాలను సాధించడానికి అవసరమైన పరిస్థితులను స్థాపించటం ద్వారా ఈ విప్లవ లక్ష్యాలను సాధించుటకై నేరుగా ఉద్దేశించబడినవి. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ కీ మొత్తం రాజ్యాంగం జాతీయ పునరుజ్జీవనాన్ని లక్ష్యంగా పెట్టుకొని సామాజిక న్యాయాన్ని సాధించడానికి మూడవ భాగంలోని ఆర్టికల్స్ కృషి చేస్తున్నాయి. ప్రాథమిక హక్కులు మరియు రాజ్య విధానపు ఆదేశిక సూత్రాలు ఈ లక్ష్యం వైపు గా పయనించడానికి ఉద్దేశించినవి. రాజ్యాంగంలోని 3 ,4 వ భాగాలు అతి ముఖ్యమైనవని అంటాడు.
కాబట్టి ఇంతటి విప్లవం స్వభావం కలిగిన రాజ్యాంగాన్ని అటు కమ్యూనిస్టు శ్రేణులు ఇటు బహుజన శ్రేణులు కూడా సరిగా గుర్తించలేక పోతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవటం ద్వారా పార్లమెంటులోనూ శాసనసభలో బలహీన కులాల వారు తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలి. అందుకోసం తమ కాళ్లపై తాము నిలబడే విధంగా స్వతంత్ర రాజకీయాలు చేయాలి. తమ జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండేవిధంగా తమాషా ఎన్నికల పద్ధతిని వారు డిమాండ్ చేయవచ్చు. ఇవాళ దేశంలో అన్ని రంగాలు ప్రైవేటీకరించం పడుతున్నాయి. సంక్షేమంపై కూడా ప్రభుత్వాలు కోతలను పెడుతున్నాయి. ఇటువంటి. స్థితినే ప్రభాత్ పట్నాయక్ సామాజిక ప్రతిఘాత విప్లవంగా విశ్లేషిస్తున్నాడు. ఈ ప్రతిఘాత విప్లవం ప్రధానంగా దళితులు, మైనారిటీలు, మహిళలను కేంద్రంగా చేసుకొని కొనసాగుతుందని ఆయన అంటాడు ఇటువంటి పరిస్థితులలో అణగారిన కులాలు, తరగతులు రక్షణ పొందాలంటే వారి ప్రాతినిధ్యము పెరగాలి. శాసనాలు చేసే రాజకీయ అధికారం ఉన్నప్పుడే ప్రస్తుత పరిస్థితుల నుండి రక్షణ పొందే అవకాశం ఉంది.
అలాగే ఇప్పటి వరకు 15 శాతంగా ఉన్న అగ్రకులాలు రాజకీయాలలో 66.5 శాతం, వాణిజ్య వ్యాపార రంగాల్లో 97 శాతం ఉపాధిలో 87 శాతం వాటాలు పొందటం అనేది ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధం. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా అంటే రాజకీయ ప్రజాస్వామ్యం ద్వారా ఇప్పటివరకు అగ్రకుల ఏకస్వామ్య ఉన్న రంగాలను ప్రజాస్వామికకరించాలి. దీన్నే బహుజన ప్రజాస్వామిక విప్లవం అని అంటున్నాను. ఈ విప్లవం 1950 రాజ్యాంగ అవతరణతో ప్రారంభమైంది. ఈ విప్లవ లక్ష్యాలు పూర్తి చేసుకొనే పని ఇంకా మిగిలి ఉంది. ఇది బహుజనుల రాజకీయ చైతన్యం పై ఆధారపడి ఉంది
*డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు* , అసోసియేట్ ప్రొఫెసర్, 9959649097.
వీక్షణం, july - 2022 లో వచ్చింది.
Comments
Post a Comment