కృషి పట్టుదలకు ప్రతీక అయిన అనువాద రచయిత వైసీపి వెంకట రెడ్డి


కృషి పట్టుదలకు ప్రతీక అయిన అనువాద రచయిత వైసీపి వెంకట రెడ్డి



          రాయలసీమలో కథకులు కొందరైనా అప్పుడప్పుడు కనిపిస్తారు. అనువాదకులు అరుదుగా అగుపిస్తారు. అందునా సత్తా ఉన్న అనువాద కులను వ్రేళ్ళమీద లెక్కించవచ్చు. అందుకు కారణం అనువాదం కష్టమైన ప్రక్రియ కావచ్చు.. అది అందరికీ యిష్టమైన క్రియ కాకపోవచ్చు. రా.రా. అన్నట్లు అనువాదంలో సమస్యలూ ఉండవచ్చు.

అనువాదం కష్టమైన ప్రక్రియ అని తెలిసినా తనకిష్టమైన ప్రక్రియగా మార్చుకొని వందలాది ఇతర భాషా కథల ను తెలుగులోకీ, తెలుగు కథలను హిందీ లోకి అనువదించడంతో బాటు 30 కి పైగా మౌలిక కథలు, బాలసాహిత్యం, నవలలు సృష్టించి శ్రమకు తగిన గుర్తింపుకు నోచుకోని కథాను వాదకులు (కథకుడు ప్లస్ అనువా దకుడు అను కోవాలి.) వై.సి.పి. వెంకటరెడ్డి.
         కరుడు గట్టిన కరువు జిల్లా అయిన  ఉమ్మడి అనంతపురం జిల్లాలో నల్లమాడ మండలంలోని ఎర్రవంకవల్లిలో గంగిరెడ్డి, గంగులమ్మకు వై.సి.పి. వెంకటరెడ్డి  1930లో జన్మించారు. బాల్యంలోనే తల్లి దండ్రులు మరణించడం వల్ల ఐదో తరగతికన్నా ఎక్కువ చదవలేక పోయారు.తల్లిదండ్రుల మరణంతో కుటుంబ భారం మీద పడింది. దాంతో 1952లో వివాహం చేసుకొని వ్యవసాయం, టైలరింగ్ వృత్తిగా చేపట్టారు. ఇంటి వద్దనే ప్రయివేటుగా హిందీ చదివి విశారద పరీక్ష పూర్తి చేసి 1958లో కుందుర్పి మిడిల్ స్కూలు అన్ ట్రైండ్ హిందీ ఉపాధ్యాయుడుగా నియమితులయ్యారు. ఉద్యోగం చేస్తూ ప్రయివేటుగా ప్రభుత్వ పరీక్ష 8వ తరగతి, రాష్ట్ర భాష ప్రవీణ పూర్తి చేసి 1960లో హైదరాబాదులో చదివి ప్రచారక్ ట్రైనింగ్ పానయ్యారు. తనకల్లు హైస్కూల్లో మూడేళ్ళు సర్వీసు పూర్తిచేసి 1964 లో నేరుగా ఎస్ఎస్.ఎల్.సి. రాసి పాసయ్యారు. అనాటి నియమ నిబంధనల ప్రకారం పి.యు.సి., బి.ఏ., ఎం.ఏ., (శ్రీ వేంకటేశ్వర యూని వర్సీటీ) ప్రయివేటుగా చదివి పాసయ్యారు.

తనకల్లు హైస్కూల్లో 15 ఏళ్ళు, రొద్దంలో ఒక సంవత్సరం, నల్లమాడలో 5 ఏళ్ళు, పట్నంలో 5 ఏళ్ళు హిందీ టీచరుగా పనిచేసి 1988 మార్చిలో ఉద్యోగ విరమణ చేసారు.

అయినా పట్టుదల కృషి ఉంటే మనిషి దేన్నయినా సాధించవచ్చనే దృఢ సంకల్పంతో చదివి హిందీ విశారద పాసై 1958 లో  ఉద్యోగ జీవితం ప్రారంభించి స్వయం కృషితో సాహిత్యరత్న, ఎం.ఏ. పరీక్షల్లో పాసయ్యారు.   రైతు కుటుంబం నుంచి రచయితగా ఎదిగాడు వై.సి.పి. వెంకటరెడ్డి (యెనుముల చిన్నయ్య గారి పెద్ద వెంకటరెడ్డి)

'చిరిగిన చొక్కా అయినా తొడుక్కొ, ఒక్కమంచి పుస్తకం కొనుక్కో,' అన్న వీరేశలింగం మాటలను స్ఫూర్తిగా తీసుకొని తక్కువ జీతంతో సంసారాన్ని నెట్టుకొస్తూ సాహితీ కృషీవలుడుగా రెడ్డి కొత్త అవతారం ఎత్తారు.

         కవిత రాస్తే కాళ్లు విరగ్గొడతానని బెదిరించే అయ్యవార్లున్న పాఠశాలల్లో, కథ రాస్తే వ్యథల పాలవుతావని బెదిరించే స్నేహితులున్న సమాజంలో, సాహిత్యం ద్వారా సమాజాన్ని ఉద్ధరించిందిచాలు సంసారం పట్ల శ్రద్ధ చూపండి అంటూ సాధించే భార్యామణులున్న కుటుంబాల్లో  సృజన శీలి రచయితగా ఎదగడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. 'లోకులు తిట్టినన్ వాకొనగా గట్టి పట్టు పట్టిన వాడన్ ' అంటూ వై.సి.పి. వెంకటరెడ్డి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కథా రచన కొనసాగించారు.

'సినిమావైరాగ్యం' అన్న కథ 1956 లో 'ప్రజామత' లో ప్రచురితం కావడం వల్ల రెడ్డి వెనుదిరిగి చూడలేదు. రెడ్డిగారు స్వయంగా హిందీలోకి అనువదించిన యీ కథ 'సినేమావైరాగ్య' అనే పేరుతో 'సాప్తాహిక్ మను' లో ప్రచురితమయింది.

తర్వాత కథలతో బాటు 'శకుని' అన్న సాంఘిక నవల కూడా రాసారు. ఇవన్నీ 'ఆంధ్రజ్యోతి'. 'ఆంధ్ర ప్రభ'. 'ఈనాడు' 'చతుర' మొద లైన దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
        వీరి కథల్లో హాన్యం తొణికిసలాడు తుంది.  పానుగంటి, భమిడిపాటి, ముళ్ళపూడి, మొక్కపాటి, ముని మాణిక్యం, డి.వి. నరసరాజు, గొల్లపూడి మొదలైన హాస్య రచయితల ప్రభావంతో ఎక్కువగా హాస్య రచనలే చేశారు.
అనువాదకునిగా  కృషి చేస్తూనే కథలు రాయడంలో అనువదించడంలో ఎంతో కీర్తి నారించారు.  వందలాది భాషేతర కథలను నవలలను అనువదించారు. దాదాపుగా 'తెలుగుకి హస్య-వ్యంగ్య రచనాయే', 'తెలుగుకీ 'శ్రేష్ఠకహానియా' పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించారు. వీటిన 'దీక్షాప్రకాశన్ ఢిల్లీ వారు ప్రచురించారు.  ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువదించిన కథలు 100 పైగా 'విపుల' లోనే ప్రచురితమయ్యాయి.

కేంద్ర సాహిత్య అకాడమీ వారి కోరిక ప్రకారం కుందనిక కపాడియాగారి గుజరాతీనవల 'సాత్ పాగ్లాన్ ఆకాష్ మాన్' ను తెలుగలోకి 'విముక్తి' పేర తెలుగు చేసారు. వీరు హిందీ లో రాసిన మౌలిక కథ 'అనురాగ్’ఆధారంగా బొంబాయిలోని ఆశీర్వాద్ ఫిల్మ్స్ వారు. టి.వి. ఫిల్మ్స్ నిర్మించారు.

ఈ కథ ఒక పల్లెటూరు చుట్టూ తిరుగుతుంది. తాగి వచ్చిన భర్త భార్యను హింసిస్తే ఆమె అతణ్ణి చావమని తిడుతుంది. ఇంటి నుంచి పరారయిన భర్త యాక్సిడెంట్లో చనిపోయినట్లు తెలుసుకొన్న భార్య కిరోసిన్ పోసుకొని తగులబెట్టుకొనే సమయంలో హఠాత్తుగా భర్త వచ్చి ఆమె మీద బానడు నీళ్లు కుమ్మరిస్తాడు.

'గిరఫ్తార్' అన్న వీరి మరో కథకు పాఠకుల నుండి విశేష స్పందన లభించింది. ఒక రచయిత తన రచనలకు పారితోషికం వస్తుందని భార్య, పిల్లల్ని నమ్మిస్తాడు. ఆఖరుకు సంపాదకులు రచన ప్రచురించక పోతే సదరు రచయిత అతణ్ణి బెదిరిస్తాడు. ఫలితంగా జైలుకు వెళ్లడం యీ కథ ఇతివృత్తం.
     
         ఉపాధ్యాయుడుగా ఉంటూ వీరు తెలుగు-హిందీలో రచనలు చేశారు. 1956లో 'సినిమా వైరాగ్యం' అనే కథ రాశారు. ఇది వీరి మొదటి కథ. ఆనాడు బెంగూళూరు నుంచి వెలువడుతున్న 'ప్రజామత' వార పత్రికలో ప్రచురితమైనది. 'సినిమా వైరాగ్య' అనే పేరుతో హిందీలో అనువదించారు ఈ కథను. ఇది కాన్పూరు నుంచి వెలువడుతున్న 'సాప్తా హిక్మాను' అన్న హిందీ పత్రికలో 19-8-1961 సంచికలో ప్రచురిత మయింది. వీరు 1973 లో హిందీలోకి అనువదించిన (అంపశయ్య) నవీన్ గారి కథ 'హత్య' ప్రముఖ హిందీ వారపత్రికధర్మయుగోలో ప్రచురిత మయింది. ఈ కథను హిందీ మాసపత్రిక 'కాదంబిని' సంపాదకులు శ్రీ రాజేంద్ర అవస్థీ గారు సంపాదకత్వం వహించి ప్రచురించిన 'భారతీయ శ్రేష్ఠ కహానియా' లో చేర్చారు. వీరు రచించిన తెలుగు సాంఘిక నవల 'శకుని' తెలుగు మాస పత్రిక 'చతుర' మార్చి, 1991 సంచికలో ప్రచురితమయింది.
వీరి కథలు, అనువాద కథలు, వ్యాసాలు మొత్తం కలిసి182 రచనలు హిందీ- తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి.

హిందీ మాసపత్రిక 'వర్తమాన్ సాహిత్య' డిసెంబరు, 1998 నంచికలో ప్రచురితమయిన వీరి హిందీ కథ'అనురాగ్ ఆధారంగా బొంబాయిలోని ఆశీర్వాద్్ఫల్మ్స్ వారు టి.వి. (ఎపిసోడ్) ఫిల్మ్ నిర్మించారు.

వీరు హిందీలోకి అనువదించిన 24 మంది తెలుగు హాస్య రచయితల రచనలు, 'తెలుగుకి హాన్య వ్యంగ్య రచనాయే' పేరుతో, 19 మంది కథలు 'తెలుగు కీ శ్రేష్ఠ కహానియా' పేరుతో ఢిల్లీలోని దీక్షా ప్రకాశన్ వారు రెండు సంకలనాలుగా ప్రచురించారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో బాటు 6 అవార్డులు పొందిన కుందనిక కపాడియా గారి నవల (గుజరాత్ -సాత్పాగాన్ ఆకాస్మాన్, హిందీ - దీవారోం సేపార్ అకాష్)ను కేంద్ర సాహిత్య అకాడమి కోనం'విముక్తి' పేర తెలుగు చేసారు. ఈ నవలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది.

భారతీయ భాషా పరిషత్, కలకత్తా వారి అవార్డుకు పుస్తకాల్ని ఎంపిక చేయడానికి 1998 సంవత్సరంలో ప్రపోజర్గా పని చేశారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి 'ముని వాహనుడు' అన్న నాటికను హిందీలోకి అనువదించారు. ఆనాటికను కేంద్ర సాహిత్య అకాడమీ ద్వైమాసిక పత్రిక 'సమకాలీన భారతీయ సాహిత్య' లో ప్రచురించారు.

'ఆగంతకుడు' అనే వీరి కథ హిందీ, బెంగాలీ. కొంకణి భాషల్లో
అనువదింపబడి ఆయా భాషా పత్రికల్లో ప్రచురితమైనది.
కడప, అనంతపురం రేడియో కేంద్రాల నుంచి ప్రసంగాలు, కథానికలు, నాటికలు ప్రసారమయ్యాయి. ఇటీవల ఆయన  ఎలుగుబంటితో నా సాహసం అనే పేరుతో తన  ఆత్మకథను వెలువరించారు.

       తొంభై పదులు దాటిన వెంకటరెడ్డి యువకుడిలా ఇప్పుడూ రాస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే కుంటు పడిన విద్యను అంతటితో ఆపివేయక పట్టుదలతో చదివి పై కొచ్చిన వెంకటరెడ్డి గారి జీవితం నేటి యువతకు ఆదర్శంగా పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

__పిళ్లా కుమారస్వామి

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు