పార్టీ పాత్ర: మార్గదర్శకత్వమా, బదులుగా తనే పనిచేయడమా?
*పార్టీ పాత్ర: మార్గదర్శకత్వమా, బదులుగా తనే పనిచేయడమా?*
పార్టీ ఏదో మంచితనం కోసం ప్రజా సంఘాల్లో పనిచేయడం లేదు. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం వైపు వర్గాలనూ, ప్రజలనూ సమీకరించేందుకు తను చేస్తున్న కృషిలో ప్రజా సంఘాలు ఒక ముఖ్యమైన లింకు అని పార్టీ భావిస్తోంది. అందువల్ల మనం ప్రజా సంఘాల స్వతంత్ర పనివిధానం అంటున్నామంటే దానర్ధం, పార్టీ ఏ విధంగానైనా ప్రజా సంఘాల జీవితంలో జోక్యం చేసుకోవచ్చని కాదు. దానర్థం ఏమంటే పార్టీ మార్గదర్శక పాత్ర వహిస్తుంది మినహా, ప్రజా సంఘం స్థానాన్ని ఆక్రమిస్తుందని కాదు.
ఒక ప్రజా సంఘంలో పార్టీ పనిచేసే విధానం ఎలా ఉండాలంటే, ఆ ప్రజా సంఘపు సాధారణ లక్షణానికి భంగం కలిగించకుండా దాని వెనుకనున్న మెజారిటీ ప్రజానీకంపై క్రమంగా తన ప్రభావంతో పట్టు సాధించగలగాలి.
పార్టీ మార్గదర్శక పాత్రను ఆదేశాలతోనో, అధిపత్యంతోనో, లేక దాని కమిటీలను పార్టీ సభ్యులతో నింపేయడంతోనో జరగకూడదు. అలా కాకుండా వాటిలో పనిచేస్తున్న పార్టీ సభ్యులను, మనతో విభేధించే పార్టీయేతరులను కూడా ఒప్పించి
వారిని మన అవగాహనలోకి తీసుకురావాలి.
పార్టీ మార్గదర్శక పాత్ర అంటే, అది వెనుకబడిన సెక్షన్ ప్రజలు నిరంతరాయంగా ప్రజా సంఘంలోకి రావడాన్ని అడ్డుకోకుండానే వారి చైతన్యాన్ని నిరంతరాయంగా పెంపొందించాలి. అలా కాకపోతే ఆ ప్రజా సంఘం పార్టీకి చేరువగా ఉండే మిలిటెంట్ల సంఘం అయిపోతుంది. ప్రధానమైన ప్రజా బాహుళ్యం నుండి వేరుపడిపోయి వారిని చురుకుగా పనిచేయించలేకపోతుంది.
ప్రజలు ఎడ్యుకేషన్ ద్వారా, రోజువారీ పోరాటాల అనుభవాల ద్వారా సంపాదించుకున్న ప్రాథమిక చైతన్యాన్ని విప్లవ రాజకీయ చైతన్యంగా మార్చడానికి పార్టీ ఫ్రాక్షన్ల ద్వారా పనిచేయాలి. మార్గదర్శకత్వం అంటే ఏమిటో ఈ క్రింది మాటల్లో కేంద్ర కమిటీ స్పష్టంగా చెప్పింది. “ఈ సందర్భంగా ప్రజల్లో పనిచేసే ప్రజా సంఘాల్లో పార్టీ పని కనిపించకూడదు. లేకపోతే ప్రజలతో లింకు తెగిపోతుంది. ప్రజా సంఘాలకు మార్గదర్శకత్వం వహించే పరమ సూత్రం అది. ప్రజా సంఘాన్ని పార్టీ ప్రతినిధిగా మార్చేయడం ద్వారా పార్టీని ప్రజా సంఘానికి ప్రత్యామ్నాయంగా మార్చడం వల్ల చాలా నష్టదాయకమైన పరిణామాలు సంభవిస్తాయి."
"ఈ సంస్థల్లో పార్టీ మార్గదర్శక పాత్ర అంటే అందులోని విస్తారమైన ప్రజల చైతన్యాన్ని కొత్త, ఉన్నత స్థాయికి పెంచడమే. ప్రజా సంఘపు విస్తృత లక్షణాన్ని మార్చకుండా వారిని పార్టీ నినాదాలవైపు ఆకర్షితులను చేయడమే.”
పార్టీ మార్గదర్శక పాత్ర అనేది ఒక వైపు మాత్రమే జరిగే క్రమం కాదు. పార్టీ ఇచ్చే వైపూ, ప్రజలూ, ప్రజా సంఘాలూ పుచ్చుకునే వైపూ ఉండాలి. ప్రజలనుండి నేర్చుకోడానికి పార్టీ ప్రయత్నం చేయాలి.
* పార్టీ ఎలా మార్గదర్శకత్వం వహిస్తుంది?
పార్టీ ప్రధానంగా ఫ్రాక్షన్లు, సబ్-కమిటీల ద్వారా ప్రజా సంఘాల్లో పనిచేస్తుంది. వీటి ద్వారా ప్రజా సంఘాల్లో పనిచేసే పార్టీ సభ్యులు, పార్టీ శాఖలకు మార్గదర్శకత్వం వహిస్తుంది.
* సబ్-కమిటీలు, ఫ్రాక్షన్ కమిటీలు.
ఫ్రాక్షన్లు, ఫ్రాక్షన్ కమిటీలు, సబ్-కమిటీల ఏర్పాటు, పని విధానం గురించిన సూత్రీకరణలను కేంద్ర కమిటీ 1974 తీర్మానంలో పేర్కొన్నది.
16వ పార్టీ మహాసభ నివేదికలో పార్టీ ఫ్రాక్షన్లు, ఫ్రాక్షన్ కమిటీలు, సబ్ - కమిటీల కర్తవ్యాలను గురించి వివరించింది.
అవి:
అ) ఒక నిర్ధిష్ట ప్రజా సంఘంలో పార్టీ విధానాన్ని అమలు పర్చడంపై మొత్తంగా పర్యవేక్షించడం.
ఆ) ఆయా ప్రజానీకంలోరాజకీయ-సైద్ధాంతిక కృషి చేయడం
ఇ) పార్టీ సాహిత్యాన్ని పంచడం, అమ్మడం, ఈ) మిలిటెంట్లను గుర్తించి వారిని పార్టీలోకి తీసుకోడానికి సిద్ధం చేయడం
ఎఫ్) ప్రజా రంగాలకు సంబంధించిన నిర్ణయాలను అమలు చేయడంలో పార్టీ కమిటీలకు తోడ్పడడం.
సబ్-కమిటీ, ఫ్రాక్షన్ కమిటీల ఒక ముఖ్యమైన పని పార్టీని నిర్మించడం. ఈ పనిని ఆయా ప్రజా సంఘాల్లో పనిచేసే పార్టీ నాయకులు, సభ్యులు ఫ్రాక్షన్ కమిటీల, ఆయా పార్టీ కమిటీల మార్గదర్శకత్వంలో నిర్వహించాలి. వారు పార్టీ కమిటీకి ప్రతిపాదనలు చేయాలి, పార్టీ నిర్మాణంలో పురోగతిని పర్యవేక్షించాలి.
ప్రజా సంఘంలో ఫ్రాక్షన్ సభ్యుల ద్వారా పార్టీ విధానాలు, నిర్ణయాలను అమలు పరిచే బాధ్యతను ఫ్రాక్షన్ కమిటీలు నిర్వహించాలి.
ప్రజా సంఘాల బయట ఉన్న కొత్త సెక్షన్ ప్రజలను చేరుకోడానికి ఎటువంటి కృషి చేయాలన్న అంశాలను అవి పరిశోధించాలి. కొత్త ప్రాంతాలకూ, కొత్త సెక్షన్లకూ చేరుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అటువంటి కార్యకలాపాలను వారు నిరంతరం రూపొందిస్తూ ఉండాలి. వర్గేతర, మార్క్సిస్టు వ్యతిరేక సిద్ధాంతాలైన మతతత్వం, నయా- ఉదారవాద సిద్ధాంతాలను ఎదుర్కొనడానికి సైద్ధాంతిక కృషి చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో ముఖ్యంగా యువతలో పురోగామి, విప్లవ సిద్ధాంతాలు పెరగడానికి వీలైన వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించాలి.
సబ్-కమిటీలు, ఫ్రాక్షన్ కమిటీలు పార్టీ సభ్యులకు కాలానుగతమైన పనిని రూపొందించాలి. పార్టీ సాహిత్య అమ్మకాలు, సైద్ధాంతిక కృషి, ఆగ్జిలరీ శాఖలోకి చేర్పింపులు, క్యాండిడేట్ సభ్యులను తీసుకోవడం వగైరా పార్టీ నిర్మాణ సమస్యలను చేపట్టాలి.
కాని ఈ అంశాలన్నిటిలోనూ వివిధ స్థాయిల్లో సబ్-కమిటీలు, ఫ్రాక్షన్ కమిటీల పని చాలా లోపభూయిష్టంగా ఉంది. సబ్-కమిటీలు, ఫ్రాక్షన్లు పార్టీ నిర్మాణం మీద, ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించే అంశాల మీద సరైన శ్రద్ధ పెట్టడం లేదు.
ప్రజా సంఘాల కమిటీల పరిధిలోని అంశాలపై మాత్రమే కేంద్రీకరించే వైఖరి కొనసాగుతోంది. ఫ్రాక్షన్ కమిటీలు పార్టీ నిర్మాణం పనిని వదిలిపెట్టి ప్రజా సంఘాల దైనందిన వ్యహారాలపై కేంద్రీకరించి ప్రజా సంఘాలకు బదులుగా అవే ఆయా సంఘాల దైనందిన వ్యవహారాలు చక్కబెడుతున్నాయి. మహా సభల ఏర్పాట్లు, ఆఫీస్ బేరర్ల ప్యానళ్లను నిర్ణయించడం వంటి పనులు చేసేస్తున్నాయి. దానివల్ల ఉద్యమానికి రెండు విధాల హాని చేస్తున్నాయి.
* పార్టీ సభ్యులు.
ప్రతి పార్టీ సభ్యుడు ఒక ప్రజా సంఘంలో పనిచేయాలని మన పార్టీ నిబంధనావళి నిర్దేశిస్తోంది. పార్టీ కమిటీలు, ముఖ్యంగా జిల్లా, స్థానిక స్థాయిల్లో పార్టీ సభ్యులకు కొన్ని ప్రజా సంఘాల్లో వారికి తగిన పనిని అప్పగించాలి. ఆయా ప్రజా సంఘాల్లో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు పార్టీ సభ్యులకు ఫ్రాక్షన్ కమిటీలు సహకరించాలి.
కానీ చాలా పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యులు తమ బాధ్యతలు నిర్వహించడం లేదని నివేదికలు తెలుపుతున్నాయి. వారిలో చాలా మందికి ఏ బాధ్యతా అప్పగించలేదు. వారిలో కొందరు చురుకుగా లేరు. పార్టీ, ఫ్రాక్షన్లు తమ మార్గదర్శక పాత్రలో విఫలమవుతున్నాయని ఇది తెలియజేస్తోంది. ప్రజా సంఘాల పనిని విస్తృతం చేయాలంటే ప్రజా సంఘాల్లోని పార్టీ సభ్యులను చురుకుగా పనిచేయించడం అత్యంత కీలకం.
* పార్టీ కమిటీల పాత్ర.
ప్రతి ప్రజా రంగంలో పనిని పార్టీ కాలానుగతంగా సమీక్షించాలి..
అఖిల భారత కేంద్రం పనిని కాలానుగుణంగా సమీక్షించాలని గతంలో నిర్ణయించినప్పటికీ, అది నిరంతరాయంగా జరగడం లేదు. సబ్-కమిటీ నివేదికల ద్వారా అటువంటి సమీక్షలు జరగాలి. పొలిట్ బ్యూరోలో చర్చించి కేంద్ర కమిటీ ముందు పెట్టాలి. అప్పుడే ప్రజా రంగాల పని మెరుగుపడుతుంది. అఖిల భారత ప్రజా సంఘాల కేంద్రంలోని పార్టీ కార్యకర్తలతో పార్టీ కేంద్రం నిరంతరం సమావేశ మవుతూ, చేసిన పనిని గురించి చర్చించాలి.
అనేక రాష్ట్రాల్లో ప్రజా సంఘాల సమీక్షా నివేదికలను ఆయా పార్టీ కమిటీలకు సమర్పించడం గానీ, అవి వాటిని పరిశీలించడం గానీ జరగడం లేదు. పార్టీ మహాసభ సందర్భంగా మాత్రమే పార్టీ రాష్ట్ర కమిటీలు ప్రజా రంగాల నివేదికలను పరిశీలి స్తున్నాయి.
మనతో ఉన్న వర్గ, ప్రజా సంఘాలను సమన్వయపరచడంతో పార్టీ సహకరించాలి. డూప్లికేషన్లు, గందరగోళం లేకుండా ప్రజా సంఘాల శక్తులను ఒకే మార్గంలో నడిపించడానికి ఇది తోడ్పడుతుంది.
Comments
Post a Comment